ETV Bharat / business

క్రెడిట్​ స్కోరు పెంచుకోండిలా... కొత్త అప్పు దొరుకుతుంది సులభంగా...

author img

By

Published : Aug 22, 2020, 9:26 PM IST

credit score increase and get new Debts
credit score increase and get new Debts

ఈ రోజుల్లో అప్పు దొరకడం ఎంతో సులభం. అదే సమయంలో ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా అనే నిఘా కూడా పెరిగింది. కొత్త అప్పులు ఇచ్చేందుకూ.. రుసుములు రద్దు చేసేందుకూ.. వడ్డీలో కొంత రాయితీ కోసం.. ఇలా అనేక రకాలుగా క్రెడిట్‌ స్కోరు ప్రాధాన్యం పెరిగింది. రుణాల విషయంలోనే కాదు.. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను పరిశీలించడానికీ ఇది ప్రామాణికంగా మారింది. ఉద్యోగాలు ఇచ్చేముందూ అభ్యర్థి రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరును చూస్తున్నారు. అందుకే, కొత్తగా అప్పులు తీసుకున్నవారు తమ క్రెడిట్‌ స్కోరుపై దెబ్బపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కార్డులు.. కాస్త క్రమశిక్షణగా..

చేతిలో డబ్బులు లేకున్నా.. ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పిస్తాయి క్రెడిట్‌ కార్డులు. అయితే, వీటిని కాస్త క్రమశిక్షణగా వాడాల్సిందే. ముఖ్యంగా మొదటిసారి క్రెడిట్‌ కార్డులు వాడటం ప్రారంభించినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే. అప్పు తీసుకున్నప్పుడు దానిపై విధించే వడ్డీని రుణంలోనే కలిపి వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారు. క్రెడిట్‌ కార్డులపై అలాంటిది ఉండదు. మీరు సమయానికి బిల్లు చెల్లించకపోతేనే ఇక్కడ వడ్డీ అనే మాట వస్తుంది. అందుకే, తక్షణ అవసరానికి సంబంధించినంత వరకూ క్రెడిట్‌ కార్డులు చాలా ఉపయోగకరం. దీంతోపాటు క్రెడిట్‌ స్కోరు విషయంలోనూ ఇది కీలకం. ఇప్పటికీ మీకు క్రెడిట్‌ కార్డు లేకపోతే.. మీ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి, కార్డు తీసుకునే ప్రయత్నం చేయండి.

కొన్నిసార్లు ఆదాయం సరిపోయినంత లేకపోతే క్రెడిట్‌ కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు. మీరుండే ప్రాంతం కూడా కార్డు ఇవ్వడానికి అవరోధం కావచ్చు. ఇలాంటప్పుడు కొత్తగా క్రెడిట్‌ కార్డు తీసుకోవాలనుకునే వారికి ఇబ్బందులు రావచ్చు. ఈ పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను హామీగా చూపించి, క్రెడిట్‌ కార్డును తీసుకునే అవకాశం ఉంది. మీ ఎఫ్‌డీలో 90శాతం మేరకు పరిమితితో కార్డు లభిస్తుంది. నగదు తీసుకోవాలనుకుంటే.. మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చు. బ్యాంకు పూర్తి హామీతో ఈ కార్డులను జారీ చేస్తుంది కాబట్టి, మీ ఆదాయం, ప్రాంతం తదితర అంశాలతో పెద్దగా అవసరం ఉండదు. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నవాళ్లు కూడా ఇలాంటి అవకాశాలను పరిశీలించవచ్చు.

మీ అవసరానికి ఏ కార్డు సరిపోతుందో చూసుకోవడానికి ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా వివిధ కార్డులను పోల్చి చూసుకోవడంతోపాటు, మీకు సరిగ్గా సరిపోయే క్రెడిట్‌ కార్డును ఎంచుకోవచ్చు.

30-40శాతానికి మించకుండా..

క్రెడిట్‌ కార్డును ఎంత పరిమితి మేరకు వాడుతున్నారనేదీ కీలకమైన విషయమే. మీ మొత్తం క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.50,000లు ఉందనుకుందాం. ఇందులో నుంచి మీరు రూ.20,000లు ఖర్చు చేశారనుకుందాం. అప్పుడు మీ రుణ పరిమితి వినియోగం 40శాతం అన్నమాట. అధిక మొత్తం వినియోగిస్తే.. మీరు అప్పు కోసం ఆరాటపడుతున్నారని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. ఇలాంటి వారికి కొత్తగా రుణాలు ఇవ్వడానికైనా.. క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకూ బ్యాంకులు కాస్త సందేహిస్తుంటాయి. కాబట్టి, క్రెడిట్‌ కార్డును వినియోగించేప్పుడు పరిమితిలో 30-40శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఒకవేళ మీరు తరచూ ఈ పరిమితిని దాటేస్తూ ఉంటే.. మీ బ్యాంకును సంప్రదించి, కార్డు పరిమితి మొత్తాన్ని పెంచాల్సిందిగా కోరండి. పరిమితి పెరిగితే.. రుణ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది.

అవసరం లేకుంటే అడగకండి

కొంతమంది అవసరం లేకపోయినా.. తరచూ రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. ఇది ఎప్పుడూ సరైన విధానం కాదు. మీకు నిజంగా రుణం తీసుకునే ఉద్దేశం ఉన్నప్పుడే.. దాని గురించి ఆరా తీయండి. మీరు రుణం కోసం అడిగినప్పుడల్లా.. రుణ సంస్థలు ఆ విషయాన్ని క్రెడిట్‌ బ్యూరోలకు చేరవేస్తుంటాయి. మీకు వాస్తవంగా రుణం, కార్డు అవసరం ఉన్నప్పుడు మీరు పదేపదే అడిగిన విషయాన్ని గుర్తించి, బ్యాంకులు మీకు రుణం ఇవ్వడానికి సందేహించవచ్చు. కాబట్టి, భవిష్యత్తులో మీకు రుణం, కార్డు అవసరం ఉంటే.. ఎలాంటి విచారణలూ చేయకండి. ముఖ్యంగా వెంటవెంటనే అడగకండి. ఒకవేళ మీకు ఎంత రుణం వస్తుంది అనే అంశాన్ని తెలుసుకోవాలని భావిస్తే.. ఆన్‌లైన్‌లో విచారించవచ్చు. ఇలా వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు.. సాధారణ విచారణగా పరిగణించి, క్రెడిట్‌ నివేదికలో నమోదు చేయరు.

అప్పుడప్పుడూ చూడండి..

కొన్నిసార్లు క్రెడిట్‌ నివేదికలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. మీ వివరాలను నమోదు చేసేప్పుడు బ్యాంకు లేదా క్రెడిట్‌ బ్యూరో సంస్థల దగ్గర జరిగే పొరపాట్లు మీకు నష్టం చేకూరుస్తాయి. ఇతరుల అప్పులు మీ పేరమీదకు వచ్చి చేరవచ్చు. మీకు అవసరమై అప్పు చేయాలని అనుకుంటే.. అప్పటికే మీ రుణ నివేదికలో మీకు తెలియకుండానే ఉన్న ఒక భారీ అప్పు అందుకు అవరోధంగా మారవచ్చు. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాకుండా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రుణ నివేదికలో తప్పుగా చేరిన రుణాల వల్ల మన ప్రమేయం లేకుండానే క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. కొత్త రుణాలు తీసుకునేందుకు ఇబ్బందులు వస్తాయి. తరచూ క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదికలను తనిఖీ చేసుకోవడం ద్వారా పొరపాట్లు జరిగితే వెంటనే సరిదిద్దుకునేందుకు వీలవుతుంది.

ఆలస్యం చేయొద్దు..

రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. ఈ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే రుణ చరిత్ర నివేదికలో ఆ విషయం నమోదవుతుంది. క్రెడిట్‌ స్కోరు నిర్మాణంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కూడా. ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా.. రుణ వాయిదాలను, క్రెడిట్‌ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు, పూర్తిగా చెల్లించేయాలి. క్రెడిట్‌ స్కోరు 750 పాయింట్లకు మించి ఉన్నప్పుడే కొత్త రుణాలు సులువుగా అందుతాయి. ఒకవేళ బిల్లు చెల్లింపు తేదీలను మర్చిపోతామనుకుంటే.. బ్యాంకు ఖాతాలో స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇవ్వడం ద్వారా నేరుగా ఖాతాల నుంచే ఆ బిల్లులను చెల్లించేయండి.

- రాధికా బినాని, చీఫ్‌ ప్రొడక్ట్స్‌ ఆఫీసర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.