ETV Bharat / business

నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

author img

By

Published : Jun 5, 2020, 7:29 PM IST

లాక్​డౌన్​తో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగుతున్న వేళ.. భారతీయ వ్యాపార దిగ్గజం టాటా సన్స్ కీలక ప్రకటన చేసింది. తమ పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చేది లేదని తేల్చి చెప్పింది. వ్యాపారాల నిర్వహణకు అవసరమైనన్ని నగదు నిల్వలు తమవద్ద ఉన్నట్లు స్పష్టం చేసింది.

tata sons
'టాటా గ్రూప్ పెట్టుబడులను నగదుగా మార్చేది లేదు'

ప్రస్తుత కరోనా కాలంలో వ్యాపార రంగం నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ వ్యాపార సంస్థలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ నగదుగా మారుస్తున్నాయి. ఆ మొత్తాన్ని వ్యాపార మూలధనంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా పెట్టుబడులను నగదుగా మార్చేది లేదని ప్రకటించింది భారతీయ వ్యాపార దిగ్గజం టాటా సన్స్. మూలధనం కోసం పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చబోయేది లేదని వెల్లడించింది. తమవద్ద సరిపోయినంత నగదు నిల్వలు ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటన విడుదల చేశారు.

"టాటా సన్స్ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంది. గ్రూప్ కంపెనీలకు మద్దతుగా నిలిచేందుకు, నూతన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసేందుకు తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయి."

-ఎన్​. చంద్రశేఖరన్, టాటా గ్రూప్ ఛైర్మన్

లాక్​డౌన్ వేళ ఇతర కంపెనీల లాగానే టాటా గ్రూప్​ను కూడా పలు సవాళ్లు, అవకాశాలు తలుపు తడుతున్నట్లు చెప్పారు. గ్రూప్​కు చెందిన అన్ని కంపెనీలు.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని చెప్పారు చంద్రశేఖరన్.

సాఫ్ట్​వేర్ సహా వివిధ వ్యాపారాలు నిర్వహించే టాటా గ్రూప్​నకు టాటా సన్స్ మాతృ సంస్థ.

ఇదీ చూడండి: అద్వితీయమే లక్ష్యంగా శ్రమించాల్సిన సమయమిది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.