ETV Bharat / business

ఆర్​బీఐ ఎంపీసీ నిర్ణయాలపై నిపుణుల హర్షం

author img

By

Published : Dec 4, 2020, 6:09 PM IST

కీలక వడ్డీ రేట్లను వరుసగా మూడోసారి యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంపై ఆర్థిక, పరిశ్రమ, రియల్టీ రంగాల నుంచి మంచి స్పందన వస్తోంది. ద్రవ్యోల్బణం సవాళ్లు ఉన్నా.. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచి.. ఆర్థిక వృద్ధికి ఊతమందించే నిర్ణయాలు తీసుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయా రంగాల నిపుణులు.

Industry experts on RBI policy rates
ఆర్​బీఐ వడ్డీ రేట్ల యథాతథ స్థితిపై నిపుణుల స్పందన

ఈ ఏడాది చివరి ద్వైమాసిక ద్రవ్య పరపతి కమిటీ(ఎంపీసీ) సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్​బీఐ తీసుకున్న నిర్ణయంపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. వృద్ధికి ఊతమందించేందుకు తక్కువ వడ్డీ రేట్లను కొనసాగించడంపై సానుకూలంగా స్పందిస్తున్నారు.

ఎంపీసీ నిర్ణయాలు ప్రధానంగా వృద్ధి రేటు రికవరీపై దృష్టిసారించాయని.. ఇవి సప్లయి పెరిగేందుకు కూడా తోడవుతాయని ఎస్​బీఐ మ్యూచువల్ ఫండ్స్​ ఫిక్సెడ్ఇన్​కం విభాగాధిపతి రాజీవ్​ రాధాకృష్ణ అన్నారు.

వృద్ధి రేటు అంచనాలు సానుకూలంగా మారుతున్నప్పటికీ.. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు పూర్తిగా తొలగిపోలేదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి అన్నారు. ఈ కారణంగా వచ్చే ఏడాది కూడా ఆర్​బీఐ, కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని ఉద్దీపనలు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం ఆశ్చర్యం కలిగించనప్పటికీ.. ఆర్థిక వృద్ధి బలోపేతం కోసం అకామడేటివ్‌ మోనిటరీ పాలసీ విధానాన్ని పాటిస్తున్నందుకు ఎంపీసీని అభినందించాల్సిన అవసరముందని అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు.

రియల్టీ రంగం స్పందన ఇలా..

వడ్డీ రేట్లు ఇంకా తక్కువగానే కొనసాగించడం వల్ల.. గృహ కొనుగోళ్ల సెంటిమెంట్ బలపడొచ్చని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు నిరంజన్​ హిరానందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం అంచనాలు సానుకూలంగా ఉండటం కూడా హౌసింగ్ డిమాండ్​కు కలిసిరావచ్చని పేర్కొన్నారు.

'కరోనా తర్వాత ఇళ్ల డిమాండ్​ నెమ్మదిగా పుంజుకుంది.. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల రానున్న త్రైమాసికాల్లో విక్రయాలు పెరిగే అవకాశముంది' అని గౌర్స్ గ్రూప్ ఎండీ మనోజ్​ గౌర్ తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.