ETV Bharat / business

వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లు యథాతథమే

author img

By

Published : Dec 4, 2020, 11:11 AM IST

కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గవర్నర్​ శక్తి కాంత దాస్​.

RBI
ఆర్బీఐ

విశ్లేషకుల అంచనాలు నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ). ద్రవ్యోల్బణం పెరగడం, జీడీపీ ఇంకా ప్రతికూల స్థాయిలోనే ఉన్న వేళ రెపో రేటును యథాతథంగా 4 శాతానికి పరిమితం చేసింది. రివర్స్‌ రెపో రేటు 3.35శాతంగా, బ్యాంక్‌ రేటు 4.25శాతంగా కొనసాగనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ ప్రకటించింది.

ఆర్థిక వృద్ధి బలోపేతం కోసం అకామడేటివ్‌ మోనిటరీ పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. వృద్ధిని పెంచేందుకు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఇదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్‌బీఐ సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు -7.5శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అక్టోబరులో జరిగిన పరపతి విధాన ప్రకటనలో జీడీపీ వృద్ధిని -9.5శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దాన్ని సవరించింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీడీపీ పాజిటివ్‌లోకి వచ్చే అవకాశముందని, నాలుగో త్రైమాసికంలో 0.7శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఆర్థిక వ్యవస్థ కోలుకునేట్లు కన్పిస్తోందని అన్నారు గవర్నర్‌ శక్తికాంతదాస్. ‌వ్యవస్థలో తగినంత ద్రవ్యత అందుబాటులో ఉంచేందుకు సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనేక రంగాలు కోలుకుంటుండటంతో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందన్నారు.

చివరసారిగా మే 22న వడ్డీరేట్లలో మార్పులు చేసింది ఆర్‌బీఐ. రెపో రేటును అత్యంత కనిష్ఠంగా 4శాతానికి పరిమితం చేసింది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతుండటంతో మే తర్వాత నుంచి ఆర్‌బీఐ వడ్డీరేట్ల జోలికి పోలేదు.

ఇదీ చూడండి: ఫుల్ జోష్​లో మార్కెట్లు​-‌ పెట్టుబడుల జోరు మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.