ETV Bharat / business

మహిళలూ దాచేస్తున్నారు.. పెట్టుబడులు పెట్టేస్తున్నారు

author img

By

Published : Mar 8, 2020, 7:55 PM IST

ఆర్థిక అంశాల విషయంలో మహిళల పాత్ర మెరుగుపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ప్రముఖ ఆన్​లైన్​ ఫినాన్షియల్​ సర్వీసెస్ సంస్థ చేసిన సర్వేలో 68 శాతం మంది మహిళలు కుటుంబ ఆర్థిక అంశాల్లో పురుషులతో సమానంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది.

women in savings
మహిళలూ పొదుపులో దూసుకుపోతున్నారు

దేశంలో మహిళలు.. పొదుపు చేయడంలో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది. వారి సంపాదన పట్ల వారే నిర్ణయాలు తీసుకోవడం గానీ, కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో సమాన అధికారాలు కలిగి ఉండే ధోరణి పెరిగినట్లు ఆన్​లైన్​ ఫినాన్షియల్​ సర్వీసెస్ సంస్థ స్క్రిప్​బాక్స్​ పేర్కొంది.

సర్వేలో పాల్గొన్న 68 శాతం మంది మహిళలు.. కుటుంబంలోని ఆర్థిక వ్యవహారాల్లో తాము సమానంగా పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. కేవలం 10 శాతం మంది మహిళలు.. వారి ఆర్థిక నిర్ణయాలను కుటుంబంలోని పురుషులకు వదిలేస్తున్నట్లు సర్వేలో తేలింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో 600 మంది మహిళలపై సర్వే చేసింది స్క్రిప్ బాక్స్. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది మిలీనియన్లు, 24 శాతం మంది జెన్-​ఎక్స్​ తరానికి చెందినవారు. మిగిలినవాళ్లు 50 ఏళ్లు పైబడిన వయస్కులు.

పొదుపు క్రమశిక్షణ..

అత్యధిక మంది మహిళలు పొదుపు క్రమశిక్షణతో మెలుగుతున్నట్లు సర్వే పేర్కొంది. అయితే 30 శాతం మంది మాత్రమే మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారని వెల్లడైంది. ఆశ్చర్యకరంగా మహిళలు పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నట్లు తేలింది. సాధారణంగా పురుషులు పెట్టుబడి పెడతారు, మహిళలు పొదుపు చేస్తారు అనే ప్రచారానికి ఈ ధోరణి తెరదించినట్లు సర్వే పేర్కొంది.

47 శాతం మంది తమను తాము ఆర్థికంగా బలపరుచుకునేందుకు, వ్యక్తిగత ఆర్థిక అంశాలపై సలహాల కోసం డిజిటల్​ ఛానెల్స్​పై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.

అత్యధికంగా 80శాతం మంది నెలవారీగా కొంత మొత్తం పొదుపు చేస్తుండగా.. 20 శాతానికిపైగా మహిళలు వారి నెలవారీ ఆదాయంలో సగానికిపైగా పొదుపు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది.

అంత బాగుంది.. కానీ

పొదుపు విషయంలో మహిళలు ధీమాగా ఉన్నప్పటికీ.. పెట్టుబడుల అంశంలో ధైర్యం కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఇతరులు నిరుత్సాహపరుస్తుండటం, పెట్టుబడుల విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నట్లు 43 శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఆర్థిక విషయాలపై ఇవి అవసరం..

సర్వేలో పాల్గొన్న వారిలో 31 శాతం మంది పాఠశాల విద్యాభ్యాసం నుంచే ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 20 శాతం మంది మహిళలు ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చించే వీలుండాలని పేర్కొన్నారు. 18 శాతం మంది మహిళలు.. పని చేసే చోటా ఆర్థిక పరమైన అంశాల్లో ప్రోత్సాహం అందించాలని వెల్లడించారు.

ఇదీ చూడండి:ఆ కారణాలతో ఈ వారమూ ఒడుదొడుకులే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.