ETV Bharat / business

మహిళలకు రిటైర్మెంట్ పాలసీ ఎంత ముఖ్యమో తెలుసా?

author img

By

Published : Mar 8, 2020, 7:16 AM IST

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పదవీ విరమణ అనేది ముఖ్యం. అయితే పురుషులతో పోలిస్తే మహిళలకు ఈ ప్రణాళిక కాస్త ప్రత్యేకం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలకు రిటైర్మెంట్​ ప్రణాళిక ఆవశ్యకతను తెలిపే ఓ కథనం..

how retirement plan important for women
మహిళలకు రిటైర్మెంట్ పాలసీ ఎంత ముఖ్యమో తెలుసా?

పదవీవిరమణ ప్రణాళిక ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే ఈ విషయంలో మహిళలు కాస్త వెనకబడి ఉన్నారు. భారత్​లో ఇది కాస్త ఎక్కువే అని చెప్పాలి.

భారత్​లో ఆర్థిక విషయాల పరంగా చూస్తే పురుషుల కన్నా మహిళలు ఎంతో వెనకబడి ఉన్నట్లు చాలా నివేదికలు చెబుతున్నాయి. అయితే పురుషుల కన్నా ఆర్థిక అవసరాలు మహిళలకే ఎక్కువ అనికూడా అవి సూచిస్తున్నాయి. అలాంటప్పుడు మహిళలకు రిటైర్మెంట్ ప్రణాళిక ఎంతో అవసరం.

మహిళలకు రిటైర్మెంట్ ప్రణాళిక ఎందుకు తప్పని సరి. వారు ఎలా దాన్ని నిర్మించుకోవాలి. రిటైర్మెంట్ సమయంలో అంచనా వేసుకోవాల్సిన అంశాలేంటి?

ఆర్థిక వ్యత్యాసం..

పురుషులు మహిళలకు వేతనాల విషయంలో వ్యత్యాసం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కారణంగా స్త్రీలు పొదుపు చేసే మొత్తం కూడా తక్కువగానే ఉంటుంది.

వేతనాల విషయం పక్కన పెడితే భారత్​లో మహిళలు.. పిల్లలు, ఇంట్లో ఇతర వ్యక్తుల సంరక్షణ బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు. అదే సమయంలో కొన్నిసార్లు ఉద్యోగంలో విరామం తీసుకోక తప్పదు.

ఇలా ఉద్యోగంలో తీసుకునే బ్రేక్​ల కారణంగా మహిళల పదవీ విరమణ ప్రణాళికకు తీవ్ర అడ్డంకిగా మారుతోంది. మఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువ పడుతోంది. ఎందుకంటే ఈ వయస్సులోనే చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఇదే వయస్సు వారు అధికంగా సంపాదించే సమయం కావడం కూడా గమనార్హం.

అయితే కొంత కాలానికి వారు మళ్లీ ఉద్యోగంలో చేరినప్పటికీ వేతన పెంపు, పదోన్నతులను కోల్పోతారు. అయితే ప్రస్తుతం మహిళలు, పురుషుల మధ్య వేతన వ్యత్యాసం తగ్గుతున్నప్పటికీ.. ఆ అంతరం పూర్తిగా సమసిపోయేందుకు మాత్రం ఇంకా చాలా సమయం పట్టనుంది.

అందుకే ఉద్యోగంలో ఉన్నప్పుడే.. ఎక్కువ మొత్తాన్ని యూనిట్ ఆధారిత బీమా పథకాల్లో (యులీప్) పొదుపు చేయడం మంచిది. దీని వల్ల కొన్నాళ్లు ఉద్యోగం చేయకపోయినా పెట్టుబడులు ఫలితాలనిస్తుంటాయి. మీ జీవిత ఆశయాలకు సంబంధించి తొలినాళ్లలోనే.. సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ సంపదకు భద్రత ఉంటుంది.

ఆరోగ్యం..

జీవశాస్త్రం ప్రకారం మహిళలు, పురుషులు ఇద్దరు వేరు వేరు జీవులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనర్థం అరోగ్యం పరంగా పురుషులతో పోలిస్తే మహిళలకు చాలా వ్యత్యాసం ఉంటుంది.

క్యాన్సర్​ సహా పలు ఇతర రోగాలకు మహిళలు ఎక్కువగా ప్రభావితం అవుతారని చాలా నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఆర్థరైటిస్, కీళ్ల వ్యాధులు పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా వస్తాయని కూడా తెలిపాయి.

అయితే ఇక్కడ ఇంకో కీలక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే పురుషులతో పోలిస్తే.. మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారనే విషయం కూడా సర్వేల్లోనే తేలింది. 2011 జనగణన ప్రకారం దేశంలో 65 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు 4.05 కోట్ల మంది, పురుషులు 3.6 కోట్ల మంది ఉన్నట్లు తేలింది. మహిళల సగటు జీవనకాలం 69.8 ఏళ్లుగా ఉంటే.. పురుషులు జీవనకాలం 67.3 ఏళ్లుగా ఉంది. దీని ద్వారా పురుషుల కన్నా మహిళలకు ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

ఇటీవలి ఓ నివేదిక ప్రకారం 65 నుంచి 87 ఏళ్లు జీవించే మహిళలకు సగటున పురుషులతో పోలిస్తే ఆరోగ్యం కోసం 18 శాతం ఖర్చులు ఎక్కువగా ఉంటాయని తేలింది.

అందుకే మహిళలు పదవీవిరమణ ప్రణాళిక తయారు చేస్తున్నట్లయితే అందులో ఈ ఆరోగ్యం విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా అదనపు ఆరోగ్య, రోజువారీ ఖర్చులకు సరిపోయే విధంగా ఉండేలా ప్రణాళికను రూపొందించుకోవాలి.

కుటుంబ లక్ష్యాలు..

సహజమైన విధిగా గానీ, సామాజిక పరంగా గానీ ఇతరులకు సంరక్షకులుగా ఉండే బాధ్యతల నుంచి మహిళలు తప్పించుకోలేపోతున్నారు. ఈ కారణంగా వారి గురించి వారు పట్టించుకునే కన్నా ఇతరుల కోసమే ఎక్కువగా శ్రమిస్తున్నారు.

మీరు ఉద్యోగిని ఆయినా, ఇంట్లోనుంచే పని చేసే వారైనా, పెళ్లయినా, ఒంటరిగా ఉన్నా కుటుంబం కోసం ఆర్థిక పరంగా ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది.

జీవిత ఆశయాలకు లింగబేధం ఉందని, మహిళలూ వారి జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సమానమైన ప్రయోజనాలు ఉండాలని నేను నమ్ముతాను.

ప్రపంచాన్ని చుట్టేయాలి, ధనికురాలిగా పదవీ విరమణ పొందాలి, ఆరోగ్యంగా ఉండటం, పిల్లలను విదేశాల్లో చదివించాలి అనే కలలు మీకు ఉంటే గనక వీలైనంత త్వరగా పెట్టుబడులు ప్రారంభించాలి.

మీరు ఆర్థిక విషయాల పట్ల ఎంత సురక్షితంగా ఉంటే, కచ్చితంగా పదవీ విరమణ అంత ఫలవంతంగా ఉంటుంది.

-తరున్ చంగ్​, ఎండీ& సీఈఓ, బజాజ్ అలీయంజ్​లైఫ్​

గమనిక: పైన తెలిపిన సలహాలు, సూచనలు రచయిత దృష్టికోణంలో చెప్పినవి మాత్రమే . ఈటీవీ భారత్​కు గానీ, సంస్థ యాజమాన్యానికి వీటితో సంబంధం లేదు. ఈ సూచనలు పాటించాలనుకునేవారు మరోసారి నిపుణులను ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయం తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయానికి వెళ్లాలని ఈటీవీ భారత్​ సలహా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.