ETV Bharat / business

కారులోకి వరద నీరు చేరితే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

author img

By

Published : Aug 29, 2021, 2:11 PM IST

వర్షాకాలంలో భారీ వానలకు వాహనాలు వరద నీటిలో చిక్కుకొని పాడయ్యే(Flood damage vehicles) ఆస్కారం ఉంది. ఇలాంటి సమయంలో రిపేరుకు భారీగా వెచ్చించాల్సి ఉంటుంది. చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ భారం తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటి? అంతేకాకుండా పూర్తిగా భారం పడొద్దు అనుకుంటే బీమా విషయంలో(Flooded vehicle insurance ) ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Car in floods
వరదల్లో చిక్కుకున్న కారు

ప్రస్తుతం వానాకాలం కొనసాగుతోంది. వర్షాలు తరచుగా కురుస్తున్నాయి. వరద ప్రవాహంతో సమస్యలు తలెత్తుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సమస్య ఉన్నప్పటికీ.. నగరాల్లో చాలా ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వరద, లోతట్టు ప్రాంతాల్లో ముప్పు అధికం. దీనితో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు నీటిలో తేలిపోతాయి. కొన్ని మునిగిపోతాయి(Flood damage vehicles). సెల్లార్​లోకి నీరు ప్రవేశిస్తే అవి కూడా మునిగిపోతాయి. అంతే కాకుండా బురద వల్ల మట్టిలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. సాధారణంగానే ఎక్కువ ఖర్చు పెట్టి కొన్న వాహనం రిపేరుకు కూడా కొన్ని సార్లు ఎక్కువ వెచ్చించాల్సి రావొచ్చు. వరదల సమయంలో నీట మునిగిన వాహనాలకు డ్యామేజీ ఎక్కువగానే అవుతుంటుంది. ఇంజిన్ పాడైపోతే జేబుకు చిల్లు పడాల్సిందే. దీన్ని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాహన నిపుణులు చెబుతున్నారు.

స్టార్ట్​ చేయొద్దు..

పార్క్ చేసి ఉన్న వాహనం నీట మునిగినట్లయితే ఇంజిన్​లోకి నీరు(Flood-damaged vehicles problems) ప్రవేశించదు. ఒకవేళ దాన్ని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లయితే ఇంజిన్​లోకి నీరు చేరుతుంది. దానివల్ల ఇంజిన్ డ్యామేజీ అవుతుంది. దీన్నే హైడ్రో స్టాటిక్ లాక్ అంటారు. ఇలాంటపుడు చాలా ఎక్కువ మొత్తం ఇంజిన్ రిపేరుకు భరించాల్సి ఉంటుంది. కాబట్టి నీట మునిగిన వాహనాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. నీట మునిగిన వాహనాన్ని గ్యారేజీకి తరలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రోడ్డుపై పారే వరద నీటిలో ప్రయాణం చేసినట్లయితే కారు డ్యామేజీ అయ్యే ఆస్కారం ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే హైడ్రో స్టాటిక్ లాక్ అవ్వొచ్చు అని వాహన సర్వీస్ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. వాహనం నీటి గుండా పోతున్నప్పుడు ఆగిపోయినట్లయితే... స్టార్ట్ చేసేందుకు ఎక్కువ సార్లు ప్రయత్నించొద్దని వారు సూచిస్తున్నారు. ఈ సందర్భాల్లో కూడా వాహనాన్ని పక్కకు తీసి.. గ్యారేజీకి తరలించాలని చెబుతున్నారు.

నీట మునిగినట్లయితే కారులో విడిభాగాలు డ్యామేజీ అవుతాయి. దీనితో పాటు ఎలక్ట్రికల్స్ పాడవుతాయి. వీటికి సంబంధించిన రిపేరును తప్పించే ఆస్కారం లేదు. కానీ భారం పడకుండా.. బీమాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో కూడా పూర్తిగా కవరేజీని ఇచ్చే విధంగా పాలసీ ఎంచుకోవాలని కోరుతున్నారు.

బీమా ఇలా..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా ఉండాలి. దీనితో వాహనాలకు థర్డ్ పార్టీ బీమా(Flooded vehicle insurance ) ఉంటోంది. వాహన డ్యామేజీకి సంబంధించి ఓన్ డ్యామేజీ కవరేజీ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కాంప్రెహెన్సివ్ బీమా అంటారు. దీన్ని తీసుకోవటం వల్ల వాహన డ్యామేజీకి కూడా బీమా లభిస్తుంది.

సమగ్ర బీమా ద్వారా వాహనం విలువ ఆధారంగా మాత్రమే కవరేజీ లభిస్తుంది. అంటే విడిభాగాలకు, వాహన వయస్సుతో పాటు తగ్గే విలువ పరిగణన ద్వారా బీమా ఉంటుంది. పూర్తిగా బీమా అందేందుకు జీరో డిప్ పాలసీ యాడ్ ఆన్ ఉంటుంది. దీని వల్ల విడిభాగాల పూర్తి విలువను బీమా సంస్థలు భరిస్తాయి.

ఇంజిన్​లో నీరు వెళ్లినట్లయితే సమగ్ర బీమా ద్వారా కవరేజీ ఉండదు. దీనికోసం ఇంజిన్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా దాదాపు అన్ని సందర్భాల్లో ఇంజిన్ డ్యామేజీని బీమా సంస్థలు భరిస్తాయి.

వాహనంతో పాటు రాని ఎలక్ట్రికల్స్, ఎక్స్ ట్రా ఫిటింగ్స్ విషయంలో కూడా సమగ్ర బీమా కవరేజీ అందించకపోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా యాడ్ ఆన్ తీసుకోవచ్చు. ఖరీదైన ఎలక్ట్రికల్స్ ఉన్నట్లయితే దీనిని తీసుకోవటం వల్ల భారం తగ్గించుకోవచ్చు.

ఇదీ చూడండి: వర్షా కాలం వచ్చేసింది.. వాహన బీమా సరిచూసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.