ETV Bharat / business

ఈ వేసవిలో ఎలాంటి కూలర్ కొనాలనుకుంటున్నారు?

author img

By

Published : Mar 7, 2020, 7:13 PM IST

Updated : Mar 11, 2020, 12:22 PM IST

cooler
కూలర్​

వేసవికాలం ప్రారంభమైంది. ఎండలు ఇప్పటికే మండిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇంకా తీవ్రతరం కానున్నాయి. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తప్పదు. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు కూలర్లు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. అయితే మార్కెట్లో ఉన్న వాటిలో వేటిని ఎంచుకోవాలి? ఏఏ అంశాలపై ధర ఆధారపడి ఉంటుంది? అందులో రకాలేంటి?

ఈ వేసవిలో ఎలాంటి కూలర్ కొనాలనుకుంటున్నారు?

వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు ఉన్నాయి. అయితే అందుబాటు ధరల్లో ఉంటాయన్న కారణంతో సామాన్య ప్రజలు ఏసీల కంటే కూలర్ల కొనుగోలుకే మొగ్గుచూపుతుంటారు. ఏసీతో పోల్చితే దాదాపు నాలుగో వంతు ధరకే కూలర్లు దొరుకుతాయి. దీనితో పాటు కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ. అదే ఏసీకైతే జేబులకు చిల్లు పడాల్సిందే. అంతేకాకుండా తేమ తక్కువున్న ప్రాంతాల్లో కూలర్లే మంచి ప్రభావం చూపెడుతాయి.

ఏ రకం తీసుకోవాలి?

కూలర్లు రెండు రకాలు అవి డిసర్ట్ కూలర్లు, రూమ్ కూలర్లు. డిసర్ట్ కూలర్లు ఎక్కువ గాలినిస్తాయి. వీటితో పోల్చితే రూమ్ కూలర్ల సామర్థ్యం తక్కువ. మన అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. కూలింగ్ ప్యాడ్ కూడా ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. హనీ కొంబ్ ప్యాడ్, యాస్పెన్ గడ్డి ప్యాడ్​లు ఉంటాయి. ఇందులో హనీకొంబ్ ప్యాడ్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. మూడు నుంచి ఐదు సీజన్ల వరకు ఇది మన్నికనిస్తుంది. అదే సమయంలో యాస్పెన్ ప్యాడ్​కు నిర్వహణ ఖర్చు ఎక్కువ. సాధారణంగా దీన్ని ప్రతి సీజన్​లో మార్చాల్సి ఉంటుంది.

కొన్ని సంవత్సరాల నుంచి కంపెనీలు అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో మొదటిది రిమోట్ కంట్రోల్​ కాగా.. తాజాగా ఐఓటీ కూలర్లు కూడా వచ్చాయి. ఇన్వర్టర్​పై నడిచే కూలర్లూ మార్కెట్లో ఉన్నాయి. వీటితో పాటు మిగతా ఫీచర్లు కూడా అధునాతన కూలర్లలో ఉంటున్నాయి.

అసెంబుల్​ చేసినవా లేక బ్రాండెడా?

మార్కెట్లో బ్రాండెడ్ కూలర్లతో పాటు వ్యాపారులు సొంతంగా తయారు చేసిన కూలర్లు ఉన్నాయి. వ్యాపారులు చేసిన కూలర్లు తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ కారణంతో ఎక్కువ మంది ప్రజలు వీటినే కొనుగోలు చేస్తున్నారు. వీటిలో వారంటీ తక్కువగా ఉండటం లాంటి సమస్యలున్నాయి. బ్రాండెడ్ కూలర్లకు ధర ఎక్కువ అయినప్పటికీ… వాటిపై వచ్చే విద్యుత్ బిల్లు, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు ఇలా..

కూలర్​ ధర ప్రధానంగా వాటర్ ట్యాంక్ సామర్థ్యం, మోటారు తిరిగే స్పీడ్​పై ఆధారపడి ఉంటుందని దుకాణదారులు చెబుతున్నారు. ఫీచర్లతోనూ ధర మారుతుంటుంది. అసెంబుల్​ చేసిన వాటితో పాటు బ్రాండెడ్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే.. కూలర్ల ప్రారంభ ధర రూ.3500గా ఉంది.

కంపెనీల కూలర్లయితే ఆయా కంపెనీలను బట్టి రూ.5వేలు, రూ.6వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా ధరతో పాటు ఫీచర్లు, నిర్వహణ ఖర్చు, కావాల్సిన సైజు తదితర విషయాలు చూసుకొని కొనుగోలు చేయాలని విక్రేతలు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ విక్రయాలు..

భారత దేశంలో ఎక్కువ కూలర్లు అమ్ముడుపోయేది తెలుగు రాష్ట్రాల్లోనే. కూలర్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్ తెలంగాణ, ఏపీల్లోనే ఉంది. ఉభయ రాష్ట్రాలు కలిపితే మొత్తంగా 4.5 లక్షల కూలర్లు అమ్ముడుపోతున్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణలో 2 లక్షల కూలర్లు, ఆంధ్రప్రదేశ్​లో 2.5 లక్షల కూలర్లు కొనుగోలు అవుతున్నాయి.

దేశవ్యాప్తంగా సగటున ఏడాదికి 27 నుంచి 30 లక్షల యూనిట్లు అమ్ముడుపోతున్నాయి. కూలర్లకు సంబంధించి 2 వేల కోట్ల విలువైన మార్కెట్ ఉంది. అయితే ఇదంతా వ్యవస్థీకృత మార్కెట్​కు సంబంధించినదే. అవ్యవస్థీకృత మార్కెట్ దీనికి రెండింతలు ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే క్రమక్రమంగా వ్యవస్థీకృత మార్కెట్ వైపు వినియోగదారులు మళ్లుతున్నారని పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

Last Updated :Mar 11, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.