ETV Bharat / business

వాహన కాలుష్యానికి కళ్లెం... బీఎస్​-6 ప్రమాణం

author img

By

Published : Apr 7, 2020, 7:34 AM IST

కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం వల్ల వాహనాల కొనుగోళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ గడ్డు పరిస్థితుల నేపథ్యంలో పేరుకుపోయిన బీఎస్‌-4 స్టాకును అమ్ముకోవడానికి మూడు నెలల గడువు పొడిగించాలంటూ భారతీయ వాహన డీలర్ల సంఘం (ఫడా), భారతీయ వాహన తయారీ దారుల సమాఖ్య (సియామ్‌) రెండుసార్లు సుప్రీంకోర్టు గడప తొక్కాయి. వారు చెబుతున్న లెక్కల ప్రకారం లక్షలకుపైగా వాహనాలు గోదాములు, షోరూంలలో నిల్వ ఉన్నాయి. వీటిని అమ్ముకోవడానికి అనుమతించకపోతే దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానానికి తెలిపాయి. మొదట్లో గడువు పెంచడానికి ససేమిరా అన్నా... ప్రస్తుత కఠిన పరిస్థితుల నేపథ్యంలో కోర్టు... లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 30 వరకు పాత వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. కొద్ది రోజుల్లో కాలుష్యకారక బీఎస్‌-4 వాహనాల ఉత్పత్తి ఆగిపోతుంది. బీఎస్‌-6 అమలులోకి వస్తుంది.

To reduce pollution the government has approved only to sale Bs-6 engine vehicles
వాహన కాలుష్యానికి కళ్లెం

వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా 14లక్షల మంది మరణిస్తున్నారని 'స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2019' పేర్కొంది. ఈ పాపంలో అత్యధిక వాటా వాహన కాలుష్యానిదేనని పర్యావరణవేత్తల మాట. ఇది ఒప్పుకొని తీరాల్సిన కఠిన వాస్తవం. ఈ సమస్య మన దేశానికే పరిమితం కాదు. వాహనాల సంఖ్య ఇలాగే ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతే భూతాపం తీవ్రమై ప్రకృతి విపత్తులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి- ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఒకటి ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణ కార్యక్రమ ప్రాజెక్టు. ఇదే లక్ష్యంతో వియన్నాలో జరిగిన సదస్సులో భారత్‌ సహా 170 దేశాలు పాల్గొన్నాయి. కాలుష్యం తగ్గించడానికి కంకణబద్ధులమై ఉంటామని పతినబూనాయి. ఆ ఒప్పందానికి అనుగుణంగా పదిహేడేళ్ల కిందట భారత ప్రభుత్వం జాతీయ వాహన విధానాన్ని ప్రకటించింది. దీని ద్వారా యూరోస్టేజ్‌ ప్రమాణాలకు సరితూగేలా ‘భారత్‌ స్టేజ్‌’ దశలను నిర్ధారించింది. దానికనుగుణంగా వాహనాల ఇంజిన్లలో సాంకేతిక మార్పులు చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ఇంధనాల్లో కాలుష్య కారకాలైన సీసం, గంధకాల మోతాదు క్రమేపీ తగ్గిస్తున్నారు. దీని అమలులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆటోమొబైల్‌ కంపెనీలు బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన వాహనాలే తయారు చేయాలి. చమురు సంస్థలు బీఎస్‌-6 పెట్రోలు, డీజిల్‌ మాత్రమే అమ్మాలి.

కొత్త ప్రమాణాల అమలు తేదీలు ముందే నిర్ధారణ కావడం వల్ల కొన్ని వాహన తయారీ సంస్థలు తదనుగుణంగా ముందే సిద్ధమయ్యాయి. కార్ల అమ్మకాల్లో ముందున్న మారుతి సుజుకి పదినెలల కిందటే బీఎస్‌-6 మోడల్‌ తీసుకొచ్చింది. మిగతా కంపెనీలూ దాన్ని అనుసరించాయి. ద్విచక్రవాహనాల విభాగంలో హోండా మోటార్స్‌ గతేడాది అక్టోబరులో యాక్టివా బీఎస్‌-6 మోడల్‌ని విపణిలోకి విడుదల చేసింది. బజాజ్‌, కేటీఎం, టీవీఎస్‌, యమహా, మహింద్రా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆఖర్లో హీరో మోటార్స్‌ హోండా బాటలో పయనించాయి. అయితే బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌ సాంకేతికతను మార్చడం, సిద్ధమైన ప్రతి మోడల్‌ను ‘ఆటొమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (అరాయ్‌)’ పరీక్షలకు పంపించి అనుమతులు పొందడం వాహన సంస్థలకు ఆర్థికంగా పెను భారమే. వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో పలు కంపెనీలు డీజిల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. ప్రస్తుతం విపణిలో అందుబాటులో ఉన్న 86 డీజిల్‌ కార్లలో 42 మళ్లీ రోడ్లపై కనిపించబోవని మారుతి సుజుకి మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ చెబుతున్నారు. వాటి స్థానంలో కాలుష్యానికి చోటు లేని సీఎన్‌జీ, ఎలెక్ట్రిక్‌ బ్యాటరీ రకాలపై కంపెనీలు దృష్టి సారించనున్నాయి. డీజిల్‌ వాహనాల వాడకం ఎంత తగ్గితే- వాతావరణ కాలుష్యమూ అంతగా నెమ్మదిస్తుంది.

చమురు కంపెనీలు బీఎస్‌-6 ప్రమాణాలతో పెట్రోలు, డీజిల్‌ తయారీకి ముందే సన్నద్ధమయ్యాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ గడువుకంటే రెండు వారాల ముందే దేశవ్యాప్తంగా ఉన్న 28 వేల పెట్రోలు బంకుల్లో బీఎస్‌-6 ఇంధనం సిద్ధం చేసింది. 2019 డిసెంబరు చివరినాటికే తమ చమురుశుద్ధి కర్మాగారాల్లో ‘అల్ట్రా లో సల్ఫర్‌’తో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభించామని ఐవోసీ ఛైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సైతం గడువుకు ముందే శుద్ధీకరించిన ఇంధన అమ్మకాలు మొదలు పెడతామని ప్రకటించాయి. బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6కు సాంకేతికత బదలాయింపు కోసం చమురు సంస్థలు దాదాపు రూ.60వేల కోట్లు వ్యయం చేశాయి. ఈ మార్పుతో పెట్రోలు కార్ల నుంచి 25శాతం, డీజిల్‌ కార్ల నుంచి 70శాతం మేర ఉద్గారాలు తగ్గనున్నాయి. బీఎస్‌-4 పెట్రోలు వాహనంలో బీఎస్‌-6 పెట్రోలును నిరభ్యంతరంగా వాడొచ్చు. కానీ, బీఎస్‌-4 డీజిల్‌ ఇంజిన్‌లో బీఎస్‌-6 డీజిల్‌ని వాడితే ఫ్యూయల్‌ ఇంజెక్టర్‌లో సమస్యలు ఏర్పడి దీర్ఘకాలంలో ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

ఆర్థిక మందగమనం కారణంగా కార్లు, మోటార్‌సైకిళ్లు, వాణిజ్య వాహనాల అమ్మకాలు నెమ్మదించాయి. ఈ గండం నుంచి గట్టెక్కకముందే కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకు పడింది. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో కొనుగోళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ గడ్డు పరిస్థితుల నేపథ్యంలో పేరుకుపోయిన బీఎస్‌-4 స్టాకును అమ్ముకోవడానికి మూడు నెలల గడువు పొడిగించాలంటూ భారతీయ వాహన డీలర్ల సంఘం (ఫడా), భారతీయ వాహన తయారీ దారుల సమాఖ్య (సియామ్‌) రెండుసార్లు సుప్రీంకోర్టు గడప తొక్కాయి. వారు చెబుతున్న లెక్కల ప్రకారం 15 వేల వాణిజ్య వాహనాలు, 12 వేల ప్రయాణికుల వాహనాలు, ఏడు లక్షలకుపైగా ద్విచక్రవాహనాలు గోదాములు, షోరూంలలో నిల్వ ఉన్నాయి. వీటిని అమ్ముకోవడానికి అనుమతించకపోతే దాదాపు ఎనిమిదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానానికి తెలిపాయి. మొదట్లో గడువు పెంచడానికి ససేమిరా అన్నా... ప్రస్తుత కఠిన పరిస్థితుల నేపథ్యంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం- లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 30 వరకు పాత వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాహన తయారీ సంస్థలు, డీలర్లకు ఇదొక ఊరటగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో కాలుష్యకారక బీఎస్‌-4 వాహనాల ఉత్పత్తి ఆగిపోతుంది. బీఎస్‌-6 అమలుతో జనం హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ స్కిల్స్​: ఆన్​లైన్​లో ఇవి నేర్చుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.