ETV Bharat / business

ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల్లో వాటా ప్రైవేటుకు!

author img

By

Published : Apr 26, 2021, 6:34 AM IST

దేశంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల్లో కొంత వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓఎన్‌జీసీ వే ఫార్వర్డ్‌ అనే ప్రణాళికను అమలు చేయాలని సూచించింది.

ongc oil fields
ఓఎన్‌జీసీ

చమురు ఉత్పత్తి క్షేత్రాల్లో వాటాను ప్రైవేటు కంపెనీలకు విక్రయించాలని ఓఎన్‌జీసీకి చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే కేజీ క్షేత్రాల్లో విదేశీ భాగస్వాములను తెచ్చుకోవాలని; ప్రస్తుత మౌలిక వసతులను నగదీకరించుకోవాలని; డ్రిల్లింగ్‌, ఇతర సేవలను ప్రత్యేక కంపెనీకి బదిలీ చేసి ఉత్పత్తి పెంచుకోవాలని కూడా తెలిపింది. ఆ మేరకు 'ఓఎన్‌జీసీ వే ఫార్వర్డ్‌' పేరిట ఒక ఏడు సూత్రాల ప్రణాళికను ఏప్రిల్‌ 1న ఓఎన్‌జీసీ ఛైర్మన్‌, ఎండీ సుభాశ్‌ కుమార్‌కు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శి(తవ్వకం) అమర్‌ నాథ్‌ లేఖ రాశారు.

తద్వారా 2023-24 కల్లా చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని మూడో వంతు పెంచుకోవచ్చని అందులో తెలిపారు. పన్నా-మక్తా, రత్న, ఆర్‌ సిరీస్‌ వంటి క్షేత్రాల్లో వాటాను విక్రయించాలని, పనితీరు సరిగా లేని క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని వివరించారు.

మూడో ప్రయత్నం..

ఓఎన్‌జీసీకి చెందిన చమురు, గ్యాస్‌ క్షేత్రాలను ప్రైవేటీకరించడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న మూడో ప్రయత్నం ఇది. అక్టోబరు 2017లోనూ 15 క్షేత్రాలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రయత్నించారు. అయితే ఓఎన్‌జీసీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను విరమించారు. ఆ తర్వాతి ఏడాది సైతం 149 చిన్న, మధ్య స్థాయి క్షేత్రాలను ప్రైవేటు, విదేశీ కంపెనీలకు ఇవ్వడానికి గుర్తించారు. ఫిబ్రవరి 19, 2019న 64 మధ్య స్థాయి క్షేత్రాలను విక్రయించడానికి యత్నించినా.. టెండర్లకు పెద్దగా స్పందన రాలేదు. 2020-21లో ఓఎన్‌జీసీ 20.2 మిలియన్‌ టన్నుల చమురును ఉత్పత్తిని చేయగా.. అంతక్రితం ఏడాది 21.1 మి. టన్నులను ఉత్పత్తి చేయగలిగింది.

ఇవీ చదవండి: ఓఎన్‌జీసీ ఆదాయాల్లో భారీ కోత!

ప్రభుత్వ లాభసాటి సంస్థల్లో ఓఎన్​జీసీ నెం.1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.