ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానానికి ముకేశ్‌!

author img

By

Published : Jul 14, 2020, 6:48 PM IST

Mukesh Ambanis wealth beats tech giants Elon Musk and Google founders
ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానానికి ముకేశ్‌!

భారత దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ... సంపన్నుల జాబితాలో కొత్త రికార్డును సృష్టించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానానికి చేరుకున్నారు. మార్చి నుంచి సంస్థ షేర్ల విలువ 120శాతం ఎగబాకడమే సంపద ఈ స్థాయిలో పెరిగేందుకు కారణం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సంపన్నుల జాబితాలో మరో రికార్డు సృష్టించారు. టెక్ దిగ్గజాలు ఎలన్‌ మస్క్‌, ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రైన్‌, లారీ పేజ్‌ను వెనక్కి నెట్టి మరింత ముందుకు దూసుకుపోయారు. దీంతో ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా ముఖేశ్‌ అవతరించారు.

గత వారమే ఆయన ప్రముఖ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం అంబానీ సంపద 72.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. మార్చి నుంచి ఇప్పటి వరకు సంస్థ షేర్ల విలువ రెట్టింపునకు పైగా పెరిగింది. గత శుక్రవారం రిలయన్స్‌ మార్కెట్‌ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది.

భారత్‌లో కొవిడ్‌ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో రిలయన్స్‌ షేర్ల విలువ బాగా తగ్గింది. ఒక దశలో రూ.1000లోపునకు వచ్చింది. కానీ, ఆ తర్వాత నుంచి మెల్లగా పుంజుకుంది. ఫేస్‌బుక్‌తో డీల్‌ తర్వాత షేర్ విలువ వేగంగా పెరిగింది. మార్చి నుంచి ఇప్పటి వరకు 120శాతం పెరిగింది. దీనికి తోడు మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా అవతరిస్తానని ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది.

ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధర- నేటి లెక్కలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.