ETV Bharat / business

నవంబరు 1 నుంచి భారీ మార్పులు.. ఆ ఫోన్లలో వాట్సాప్ బంద్

author img

By

Published : Oct 31, 2021, 10:36 AM IST

నవంబరు 1 నుంచి వివిధ అంశాల్లో కొన్ని మార్పులు రానున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు తన సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. అంతేకాక నవంబర్‌ 1 నుంచి మరోసారి గ్యాస్‌ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

whatsapp
వాట్సాప్

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ కీలక ప్రకటన చేసింది. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్‌ 9, కాయ్‌ 2.5.1 వెర్షన్‌ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్‌, ఫీచర్‌ ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్‌లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదలచేసింది.

గ్యాస్‌ దరువు తప్పదా..?

నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఎల్​పీజీ ధరలు ఈ మధ్య తోడయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో సిలిండర్‌ ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారాయి. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతి 15 రోజులకోసారి ఎల్పీజీ ధరలను సవరిస్తుంటాయి. ఈ క్రమంలో నవంబర్‌ ఒకటిన మరోసారి గ్యాస్‌ ధరను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నష్టాల నుంచి గట్టేందుకు ఏకంగా బండపై వంద రూపాయలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసింది. ఒకవేళ ప్రభుత్వం ఓకే అంటే గ్యాస్‌ బండ కోసం ఇకపై వెయ్యి రూపాయలకు పైగా సమర్పించుకోవాల్సిందే.

పెన్షనర్లకు ఎస్‌బీఐ ఊరట

పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్​బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించేందుకకు పింఛన్‌దారులు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండా వీడియో కాల్‌ సదుపాయాన్ని కల్పిస్తోంది. నవంబర్‌ 1 నుంచి ఈ సేవలకు ఎస్‌బీఐ శ్రీకారం చుడుతోంది. వృద్ధులకు నిజంగా పెద్ద ఊరటనే చెప్పాలి.

విత్‌డ్రాకైనా.. డిపాజిట్‌కైనా

నవంబర్‌ 1 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఛార్జీలు వడ్డించేందుకు సిద్ధమైంది. నెలలో మూడు కంటే ఎక్కువ సార్లు సొమ్ము డిపాజిట్‌ చేస్తే రూ.40 రుసుము చెల్లించాలి. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు (ఏటీఎం నుంచి కాదు) సొమ్ము విత్‌ డ్రా చేస్తే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

జన్‌ధన్‌ అకౌంట్లకు ఇది వర్తించదు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, యాక్సిస్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ సైతం ఈ తరహా ఛార్జీలకు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.

ఐపీవోలు ఊరిస్తున్నాయ్‌..

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త. నవంబర్‌ నెలలో పలు కంపెనీలు ఐపీవోకి రానున్నాయి. పాలసీ బజార్‌ ఐపీవో నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. పేటీఎం ఐపీవో సైతం నవంబర్‌ 8 నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఇవి కాకుండా నైకా, ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజ్‌, సిగాచీ ఇండస్ట్రీస్‌ వంటివి కూడా ఐపీవోకు రానున్నాయి. మదుపు చేయాలనుకునే వారికి ఇదో అవకాశం.

ఇదీ చూడండి: రేషన్​ దుకాణాల ద్వారా వంట గ్యాస్ సిలిండర్ల విక్రయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.