ETV Bharat / business

ఐటీ కంపెనీలు తగ్గేదేలే.. యువ ఉద్యోగులకు భారీ అవకాశాలు!

author img

By

Published : Dec 19, 2021, 7:02 AM IST

ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఐటీ కంపెనీల ఆదాయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇంటి నుంచే పని విధానం అమలు అవుతుండటం వల్ల ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసొస్తోంది. నియామకాల విషయంలోనూ సంస్థలు జోరు కనబరుస్తున్నాయి. దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది.

it companies
ఐటీ కంపెనీలు

కొవిడ్‌ ఒమిక్రాన్‌ ప్రభావంతో పలు రంగాలు కుదేలవుతుంటే.. ఐటీ రంగం మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. సంప్రదాయ కంపెనీలు సైతం డిజిటల్‌ బాట పట్టడం ఐటీ రంగానికి వరంగా మారింది. ప్రస్తుత ఖాతాదారుల నుంచి ప్రాజెక్టుల పొడిగింపు లభిస్తుండగా.. కొత్తగా వస్తున్న భారీ ఆర్డర్లను నెరవేర్చేందుకు, నియామకాల విషయంలోనూ సంస్థలు జోరు కనబరుస్తున్నాయి. దేశీయంగా యువ ఉద్యోగుల నియామకాల్లో ఐటీ రంగం ముందుస్థానంలో నిలుస్తోంది. కొవిడ్‌-19 కారణంగా మొదలైన ఇంటి నుంచే పని విధానంతో ఖర్చులు తగ్గడం కూడా వీటికి కలిసొస్తోంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో కంపెనీలు భారీగా ఆదాయ వృద్ధిని నమోదు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆశలు పెంచిన యాక్సెంచర్‌..

ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ పీఎల్‌సీ సెప్టెంబరు- నవంబరుకు ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఆదాయంలో 27 శాతం వృద్ధి సాధించిన సంస్థ.. కొత్తగా 1680 కోట్ల డాలర్ల ఆర్డర్లును దక్కించుకుంది. ఆర్థిక సంవత్సరం (సెప్టెంబరు-ఆగస్టు) మొత్తానికి 12-15 శాతం ఆదాయ వృద్ధి అంచనా వేసిన యాక్సెంచర్‌, తాజా దానికి 19-22 శాతానికి పెంచింది. భవిష్యత్‌పై ఆ సంస్థ ప్రకటించిన సానుకూల అంచనాలు బలమైన గిరాకీ పరిస్థితులను సూచిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులతో భారతీయ ఐటీ కంపెనీలు కూడా ఇదేవిధంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశీయ ఐటీ కంపెనీలు ఆదాయ అంచనాలను పెంచే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

పెద్ద కంపెనీలకు ధీటుగా..

2021-22 సెప్టెంబరు త్రైమాసికంలో మొత్తం ఐటీ రంగం బలమైన ఆదాయ వృద్ధి సాధించింది. త్రైమాసిక ఆదాయం, మార్జిన్‌ల విస్తరణ పరంగా అగ్రగామి కంపెనీలకు ధీటుగా ద్వితీయ శ్రేణి కంపెనీలు రాణించాయి. క్లౌడ్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ వంటి విభాగాలకు గిరాకీ స్థిరంగా పెరుగుతూ వస్తోంది. చిన్న ఐటీ కంపెనీలు సైతం కొత్త టెక్నాలజీలపై దృష్టి పెట్టడంతో భారత ఐటీ కంపెనీల వృద్ధి జోరు కొనసాగుతుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం కీలకం కానుందని భావిస్తున్నారు. భారత ఐటీ సేవలకు ఉన్న గిరాకీతో 2022-23 మరో బలమైన ఏడాది కానుందని అంటున్నారు.

రూపాయి క్షీణత మంచిదే..

డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే అంశమే. విదేశీ కరెన్సీ రూపంలో ఈ కంపెనీలు భారీగా ఆదాయాన్ని ఆర్జించడమే ఇందుకు కారణం. అమెరికా ఫెడ్‌ బాండ్ల కొనుగోలును తగ్గించడం, భారత్‌లో వాణిజ్య లోటు పెరగడంపై ఆందోళనలతో కొన్ని రోజులుగా రూపాయి బక్కచిక్కుతోంది. రాబోయే రోజుల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 78 స్థాయికీ వెళ్లొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రూపంలో ఐటీ కంపెనీల ఆదాయం మరింత పెరగనుంది.

పరుగులు తీస్తున్న షేర్లు..

యాక్సెంచర్‌ ఫలితాల ప్రకటన తర్వాత దేశీయ ఐటీ షేర్లు శుక్రవారం పరుగులు తీశాయి. మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడైనా.. ఐటీ షేర్లు రాణించాయి. విప్రో, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, ఎంఫసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోఫోర్జ్‌ షేర్లు 2-5% వరకు లాభాలు నమోదుచేశాయి. టెక్‌ మహీంద్రా, బిర్లా సాఫ్ట్‌ షేర్లు 52 వారాల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.