ETV Bharat / business

తెలంగాణకు 'మేఘా' ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకులు

author img

By

Published : May 23, 2021, 6:55 AM IST

ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను సత్వరం ఆసుపత్రులకు చేర్చేందుకు కావాల్సిన క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొరత ఎదురవుతోంది. తెలంగాణలో ఈ సమస్యను పరిష్కరించేందుకు థాయ్‌లాండ్‌ నుంచి 11 ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకులను మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ దిగుమతి చేసుకుంటోంది. వీటిని తెలంగాణ ప్రభుత్వానికి ఉచితంగా అందించబోతోంది. తొలిదశలో భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో మూడు ట్యాంకులు హైదరాబాద్‌కు శనివారం చేరుకున్నాయి.

MEIL
మేఘా ఆక్సిజన్‌

దేశీయంగా వైద్య అవసరాలకు తగినట్లు లిక్విడ్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతున్నా, సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయి. కొవిడ్‌-19 బాధితులకు ఆక్సిజన్‌ అవసరాలు బాగా పెరిగిన నేపథ్యంలో, ఆసుపత్రులకు సమయానికి సరఫరా చేయలేకపోతే పెనుకష్టాలు తప్పడం లేదు. ప్రాణనష్టమూ సంభవిస్తోంది. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆక్సిజన్‌ను సత్వరం ఆసుపత్రులకు చేర్చేందుకు కావాల్సిన క్రయోజనిక్‌ ట్యాంకర్ల కొరతా ఎదురవుతోంది. తెలంగాణా రాష్ట్రంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు థాయ్‌లాండ్‌ నుంచి 11 ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకులను మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) దిగుమతి చేసుకుంటోంది. వీటిని తెలంగాణ ప్రభుత్వానికి ఉచితంగా అందించబోతోంది. వీటివల్ల రాష్ట్రంలోని ఆసుపత్రులకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుందని ఎంఈఐఎల్‌ తెలిపింది.

ఐఏఎఫ్​ ప్రత్యేక విమానంలో..

తొలిదశలో భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్‌ చేరుకున్నాయి. మరో ఎనిమిది ట్యాంకులు 3-4 రోజుల్లో ఇక్కడికి రానున్నాయని ఎంఈఐఎల్‌ వెల్లడించింది. ఒక్కో ట్యాంకులో ఆక్సిజన్‌ను -109 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. ఫలితంగా అవసరమైన ఆసుపత్రులు, నిల్వ కేంద్రాలకు ఒక్కో ట్యాంకు నుంచి 1.40 కోట్ల లీటర్ల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయొచ్చు. 11 ట్యాంకుల ద్వారా కలిపి దాదాపు 15.40 కోట్ల లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు వీలవుతుందని ఎంఈఐఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజేశ్‌ రెడ్డి తెలిపారు.

భారీమొత్తంలో సరఫరా చేసేందుకు..

ఎంఈఐఎల్‌ యాజమాన్యంతో పాటు, తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసిందని రాజేశ్‌ రెడ్డి తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ రవాణా, నిల్వ అనేది సమస్యగా ఉన్న నేపథ్యంలో, భారీమొత్తంలో సరఫరా చేసేందుకు ఈ ట్యాంకులు ఉపయోగ పడతాయన్నారు. దేశీయంగా ఒక్కో క్రయోజనిక్‌ ట్యాంకు తయారు చేయడానికి 3 నెలలు పడుతున్నందున, తక్షణ అవసరాల దృష్ట్యా బ్యాంకాక్‌ నుంచి దిగుమతి చేసుకున్నామని తెలిపారు.

3 కోట్ల లీటర్ల ఉత్పత్తి

హైదరాబాద్‌ బొల్లారంలోని తమ ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రంలో మే 9-21 మధ్య 29,694 మెట్రిక్‌ టన్నుల (2.97 కోట్ల లీటర్ల) లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కోటి 7000 లీటర్ల సామర్థ్యం కలిగిన 4242 ఆక్సిజన్‌ సిలిండర్లను ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారని వివరించారు.

ఇదీ చూడండి: బ్యాంకు లావాదేవీలపై ఛార్జీలు ఎంతో తెలుసా?

ఇదీ చూడండి: 'వైద్యశాస్త్రంపై రాం​దేవ్​కు దురుద్దేశమేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.