ETV Bharat / business

ఆరోగ్య సంరక్షణకే 'బడ్జెట్​'లో అధిక కేటాయింపులు!

author img

By

Published : Jan 20, 2021, 7:06 AM IST

కరోనా కారణంగా ఆరోగ్యవ్యవస్థలో ఉన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య సంరక్షణ సేవలకు మరిన్ని నిధులు కేటాయించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. 2021-22 బడ్జెట్​లో వైద్య రంగానికి కేటాయింపులు ఎలా ఉంటాయనే అంశంపై సంబంధిత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మరిన్ని తలెత్తవని చెప్పడానికీ లేదు. అందువల్ల వైద్య సేవల రంగాన్ని బలోపేతం చేయాలనే అందరూ ఆకాంక్షిస్తున్నారు.

how the allocations to the medical sector will be in the 2021-22 budget
ఆరోగ్య సంరక్షణకు అధిక కేటాయింపులపై ఆశాభావం

'కొవిడ్‌' మహమ్మారి ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థల్లో ఉన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రభుత్వ - ప్రైవేటు ఆసుపత్రులు.. వాటిల్లోని వైద్యులు అందించే సేవలు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య, ఆరోగ్య సంరక్షణ సేవలకు మరిన్ని నిధులు కేటాయించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. 2021-22 బడ్జెట్టులో వైద్య రంగానికి కేటాయింపులు ఎలా ఉంటాయనే అంశంపై సంబంధిత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మరిన్ని తలెత్తవని చెప్పడానికీ లేదు. అందువల్ల వైద్య సేవల రంగాన్ని బలోపేతం చేయాలనే అందరూ ఆకాంక్షిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవీ..

  • గ్రామీణ వైద్య సేవల విస్తరణకు పెద్దపీట వేయాలి.
  • వైద్య సేవలపై వ్యయం 2025 నాటికి జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది 1 శాతమే ఉంది. వచ్చే బడ్జెట్‌ నుంచే కేటాయింపులు పెంచాలి.
  • వైద్య రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలనే డిమాండ్‌ ఎంతో కాలంగా ఉంది. ఇందువల్ల కేంద్ర ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. దీన్ని సాకారం చేస్తారేమో చూడాలి.
  • 'కరోనా' నిరోధానికి టీకా అభివృద్ధి చేయడంలో దేశీయ బయోటెక్‌/ ఫార్మా కంపెనీలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తయారు చేసిన ‘కరోనా’ టీకాలను అత్యవసర వినియోగ అనుమతి కింద ప్రజలకు చేస్తున్నారు. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. కరోనా వ్యాధి బారిన పడిన వారిని సంరక్షించే మందులు తయారు చేసి అందించడంలో దేశీయ ఫార్మా కంపెనీలు ఎంతో ముందున్నాయి. పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌ సహా పలు యాంటీ-బయాటిక్‌ ఔషధాలు, విటమిన్‌ టాబ్లెట్లను ఎన్నో దేశాలకు సరఫరా చేశాయి. కరోనా వ్యాధికే ప్రత్యేకించిన ఫావిపిరవిర్‌, రెమ్‌డిసివిర్‌ ఔషధాలనూ దేశీయ ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున తయారు చేశాయి. రెండు, మూడు దశాబ్దాలుగా దేశీయ ఔషధ రంగం ఎదిగిన ఫలితంగా ఇవి సాధ్యమయ్యాయి.

పరిశోధనలకు సహకారం కావాలి..

క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనువైన సదుపాయాలు పెంపొందించడానికి, ఔషధ పరిశోధనలు పెదఎత్తున నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు పెంచాలని, రాయితీలు/ ప్రోత్సాహకాలు కల్పించాలని డిమాండ్‌ వస్తోంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా మన ఔషధ కంపెనీలు విస్తరించడంతో పాటు, ఇంకా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.

వైద్య సేవల్లో టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. టెలిమెడిసిన్‌ గ్రామీణ ప్రాంతాలకూ చేరుతోంది. ఐఓటీ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం నిపుణులైన వైద్యుల సలహాలు, సేవలు అందించే అవకాశం ఏర్పడుతోంది. వైద్య రంగంలో ఐటీ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే ప్రతిపాదనలు బడ్జెట్‌లో ఉంటే బాగుంటుంది.

ఉపకరణాల తయారీలోనూ ముందడుగేయాలి

కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఆరోగ్య సేవల రంగానికి రూ.67,484 కోట్లు కేటాయించింది. కరోనా ముప్పు వల్ల ఈ సొమ్ము ఏమూలకూ సరిపోలేదు. అందువల్ల ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు తప్పనిసరిగా అధికంగా ఉంటాయని ఆశిస్తున్నారు. స్పెషాలిటీ వైద్య విభాగాల్లో ప్రైవేటు రంగం క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రాథమిక, ప్రాంతీయ వైద్య సేవలకు ప్రభుత్వ వైద్య రంగమే ప్రధానం. అందువల్ల ప్రభుత్వ వైద్య వసతులను బలోపేతం చేయాలి. ఇప్పటివరకు దిగుమతులపై ఆధార పడుతున్న వైద్య ఉపకరణాల (టెస్టింగ్‌ కిట్లు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులు) రంగంలోనూ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ‘కరోనా’ నొక్కి చెప్పింది. ప్రపంచ దేశాలకు ఎన్నో రకాలైన మందులు, టీకాలు సరఫరా చేస్తున్న మనదేశం, వైద్య ఉపకరణాల తయారీలోనూ అదే ప్రగతి చూపాల్సిన అవసరం ఉంది. వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌ ద్వారా ప్రయత్నించాలి.

ఇదీ చూడండి: 'గూగుల్‌ పే'ను దాటేసిన ఫోన్‌ పే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.