ETV Bharat / business

Greenheirloom: అలనాటి పాత్రలతో ఆధునిక వ్యాపారం

author img

By

Published : Jul 25, 2021, 10:16 AM IST

‘ఆమె చేసే ఫలానా వంటకం ఎంత బావుండేదో. ఆ రుచే వేరు!’ చాలాసార్లు ఇంట్లో పెద్దవాళ్లు వాళ్ల అమ్మో, బామ్మో చేసే వంట గురించి ఇలా మాట్లాడుతుండటం వింటూనే ఉంటాం. కావ్యా చెరియన్‌కూ ఇలాంటి సందర్భం ఎదురైంది. కాకపోతే అది స్వీయానుభవం. తన బామ్మ చేతి రసం రుచి ఆమెకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పరిశీలిస్తే ఆమె ఉపయోగించే సంప్రదాయ వంట పాత్రలే కారణమనిపించింది. దాంతోపాటు ఒక వ్యాపార ఆలోచనా వచ్చింది. ఆపై ఏం చేసింది? తెలుసుకుందాం రండి.

green-heir-loom-owner-kavya-successfull-story
అలనాటి పాత్రలతో ఆధునిక వ్యాపారం

కావ్యా చెరియన్‌.. పోయిన ఏడాది తన బామ్మ ఇంటికి వెళ్లింది. అక్కడి వంట పాత్రలు భిన్నంగా ఉండటం గమనించింది. ఆమె చేతి వంట కూడా చాలా రుచిగా అనిపించింది. ముఖ్యంగా ఆమె చేసిన రసం తయారీని నేర్చుకుని ఇంటికొచ్చాక ప్రయత్నించింది. ఎన్నిసార్లు చేసినా ఆ రుచి మాత్రం రాలేదు. బామ్మకు సర్జరీ అయితే మళ్లీ వెళ్లింది. ‘బామ్మకి కంటికి ఆపరేషన్‌ అవ్వడంతో వంట చేయడం కుదిరేది కాదు. తను బయట కూర్చొని సూచనలిస్తే నేను ఆ ప్రకారం చేసేదాన్ని. సంప్రదాయ వంటపాత్రల్లో వండటం భలే అనుభూతినిచ్చింది. కొన్ని పాత్రలను తరాలుగా ఉపయోగిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయా’ అంటుందీ కేరళ అమ్మాయి.

‘గ్రీన్‌ హేర్‌లూమ్‌’

కొన్ని నచ్చినవాటిని తన ఇంటికోసం కొనుక్కోవాలనుకుంది. ఎన్నో పెద్ద సూపర్‌ మార్కెట్లకు వెళ్లినా దొరకలేదు. ఈ సంప్రదాయ సంపద కనుమరుగవుతోందని ఆమెకు అర్థమైంది. కావ్య.. ముంబయిలో ఓ ప్రముఖ సంస్థలో యాక్చూరియల్‌ అనలిస్ట్‌గా పనిచేసేది. ఒకేచోట కూర్చుని పనిచేయడం ఆమెకు నచ్చలేదు. దీంతో ఉద్యోగాన్ని వదిలేసింది. మనసుకి హాయినీ, సంతృప్తినీ ఇచ్చేదాన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంది. ‘ఈ సంప్రదాయ వంట పాత్రలనే ఇప్పటి తరాలకూ పరిచయం చేస్తే?’ అనే ఆలోచన వచ్చింది. పైగా ఇవి పర్యావరణానికి హాని కలిగించవు కూడా. గత ఏడాది ఆగస్టులో ‘గ్రీన్‌ హేర్‌లూమ్‌’ పేరిట నిర్వహణీయ, ఆర్గానిక్‌ కుక్‌వేర్‌ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో ప్రారంభించింది. ఆమె అమ్మేవన్నీ కంచు, మట్టి, ఇనుము, చెక్క, రాళ్లతో తయారైనవే. వీటికోసం దేశవ్యాప్తంగా మణిపుర్‌, మధురై, పాలక్కాడ్‌, సేలం, మన్నార్‌, మేఘాలయ మొదలైన ప్రాంతాల్లో వాటిని తయారుచేసే చేతివృత్తుల వారిని సంప్రదించి, ఒప్పందాలు చేసుకుంది.

మొదట 20 వస్తువులతో ప్రారంభం..

వీటిపై పూర్తి అవగాహనకు చాలా పరిశోధన చేసింది. తయారు చేసే వారి దగ్గరకు స్వయంగా వెళ్లి వాటిని పరీక్షించి మరీ నిర్ణయించుకునేది. మూడున్నర లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. వెబ్‌సైట్‌నూ ట్యుటోరియల్స్‌ ద్వారా నేర్చుకుని, సొంతంగా రూపొందించుకుంది. వ్యాపారం అనుకున్నట్టుగా సాగితే అప్పుడు పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్స్‌ సాయం తీసుకోవాలన్నది కావ్య ఆలోచన. అలా మొదట 20 వస్తువులతో ప్రారంభించింది. ఆపై కొత్తవి జోడిస్తూ వెళ్లింది. వాటి ధరలూ అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకుంది. వస్తువులు రవాణా సమయంలో దెబ్బతినకుండా ప్యాకేజింగ్‌పైనా ప్రత్యేక శ్రద్ధపెట్టింది. వాటిని సురక్షితంగా ఎలా ఉంచుకోవాలన్న దానిపై మాన్యువల్‌నూ జతచేస్తోంది. ఆసక్తికరమైన దాన్ని కెరియర్‌గా మలచుకోవడమే కాదు, తక్కువ శ్రమతో మూడురెట్ల లాభాల్నీ అందుకుంటున్నానంటూ సంతోషంగా చెబుతోంది.

‘మనం ప్రస్తుతం వాడుతున్న పాత్రల జీవితకాలం ఆరేళ్లలోపే. కానీ మా బామ్మ వాళ్లింట్లో ఆమె పుట్టక ముందు నుంచీ వాడుతున్నవీ ఉన్నాయి. వీటితో ఆరోగ్యానికి ఎన్నో లాభాలూ ఉన్నాయి. ఉదాహరణకు మట్టిపాత్రల్లో వండినపుడు వాటిలో ఉండే ఆల్కలైన్‌ ఆహారంలోకి చేరి, సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది’ అంటుంది కావ్య.

ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.