ETV Bharat / business

శుభవార్త: కరోనా చికిత్సకు మరో ఔషధం

author img

By

Published : Jun 21, 2020, 5:23 AM IST

Updated : Jun 21, 2020, 5:15 PM IST

కరోనా​ చికిత్సకు గ్లెన్​మార్క్​ సంస్థ ఫవిపిరవిర్​ ఔషధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో కీలక ముందడుగు పడింది. యాంటీవైరల్​ డ్రగ్​ 'రెమిడెసివిర్​' తయారీ, మార్కెటింగ్​కు​ దేశీయ ఫార్మా దిగ్గజాలు హెటెరో, సిప్లా సంస్థలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో త్వరలోనే ఈ ఔషధం అందుబాటులోకి రానుంది.

remdesivir
కరోనా చికిత్సకు త్వరలోనే మార్కెట్లోకి మరో ఔషధం

కరోనా వైరస్​ చికిత్స కోసం భారత ఫార్మా దిగ్గజం గ్లెన్​మార్క్​ కొత్త ఔషధాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే మరో డ్రగ్​ 'రెమిడెసివిర్​​'కు అనుమతులు లభించాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యాంటీవైరల్​ ఔషధానికి డ్రగ్స్​ కంట్రోలర్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఏ) నుంచి తయారీ, మార్కెటింగ్​ అనుమతులు పొందాయి దేశీయ ఫార్మా సంస్థలు హెటెరో, సిప్లా.

కొవిడ్​-19 బారినపడి తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో బాధపడుతున్న వారికి పరిమిత అత్యవసర వినియోగం (రిస్ట్రిక్టెడ్​ ఎమర్జెన్సీ యూస్​) కోసం రెమిడెసివిర్​​కు డీసీజీఏ అనుమతులు ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే.. రెమిడెసివిర్​​ వినియోగంపై ప్రతి రోగి రాతపూర్వక అనుమతితో పాటు అదనపు క్లినికల్​ ట్రయల్స్​, మార్కెటింగ్​ నిఘా సమాచారం వంటి నివేదిక సమర్పించాలని తెలిపారు.

కేంద్ర ఆరోగ్య శాఖ 'క్లినికల్​ మేనేజ్​మెంట్​ ప్రోటోకాల్స్​ ఫర్​ కోవిడ్​-19'లో భాగంగా అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు అధికారులు. తీవ్రమైన మూత్రపిండ, కాలేయ వ్యాధులతో బాధపుడుతున్నవారు, గర్భిణీలు, పాలిచ్చే మహిళలు, 12 ఏళ్లలోపు వయస్సు వారికి ఈ మందును వినియోగించకూడదని సూచించారు.

ఇంజక్షన్​ రూపంలోని రెమిడెసివిర్​​ ఔషధాన్ని రోగులకు తొలుత 200ఎంజీ డోస్​ ఇవ్వాలి. ఆ తర్వాత ఐదు రోజుల పాటు 100 ఎంజీ డోస్​ కొనసాగించాలని ఫార్మా సంస్థలు తెలిపాయి.

దేశీయ ఫార్మా సంస్థలు రెమిడెసివిర్​​ తయారీ, మార్కెటింగ్​ కోసం అమెరికాకు చెందిన గిలిడ్​ సైన్సెస్​తో నాన్​ ఎక్స్​క్లూజివ్​ లైసెన్స్​ ఒప్పందం కుదుర్చుకున్నాయి. రెమిడెసివిర్​ను భారత్​లోకి తీసుకొచ్చేందుకు మే 29నే భారత డ్రగ్​ నియంత్రణ సంస్థ సీడీఎస్​సీఓకు దరఖాస్తు చేసుకుంది గిలిడ్​ సంస్థ. జూన్​ 1న అనుమతులు లభించాయి. హెటెరో, సిప్లాతో పాటు మరో మూడు సంస్థలు బీడీఆర్​, జుబిలాంట్​, మైలాన్​, డాక్టర్​ రెడ్డీస్​ లాబ్స్​ గిలిడ్​తో ఒప్పందం చేసుకున్నాయి. అయితే.. వాటి దరఖాస్తులను పరిశీలన చేస్తోంది డీసీజీఏ.

ఇదీ చూడండి: ఇకపై హైదరాబాద్​లో ఆ కీలక డ్రగ్​ తయారీ..!

Last Updated : Jun 21, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.