ETV Bharat / business

'సెస్సులో వాటా ఇప్పించలేం..ఆ అధికారం మాకు లేదు'

author img

By

Published : Feb 22, 2021, 4:31 PM IST

Updated : Feb 23, 2021, 11:50 AM IST

15వ ఆర్థిక సంఘం నివేదికను రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను ఈటీవీ భారత్​కు ప్రత్యేకంగా వివరించారు ఛైర్మన్​ ఎన్​కే సింగ్​. కరోనా సంక్షోభం అనంతరం నివేదికకు మార్పులు చేసినట్లు చెప్పారు. నివేదికలో పేర్కొన్న ద్రవ్యలోటుకు, బడ్జెట్ సందర్భంగా కేంద్రం అంచనా వేసిన ద్రవ్యలోటుకు వ్యత్యాసం ఎందుకుందో తెలిపారు.

Commission tries to strike balance between Centre and States' fiscal needs: NK Singh
​ ఎన్​కే సింగ్​తో ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అవసరాల మధ్య సమతుల్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్​ ఎన్​కే సింగ్. ఈటీవీ భారత్​తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్థిక సంఘం నివేదిక రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను వివరించారు. కరోనా సంక్షోభం అనంతరం నివేదికకు చేసిన మార్పుల గురించి చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నివేదికలో అంచనా వేసిన ద్రవ్యోలోటు(6.5శాతం)కు బడ్జెట్ సందర్భంగా కేంద్రం అంచనా వేసిన ద్రవ్యలోటు(9.5శాతం)కు మధ్య వ్యత్యాసానికి గల కారణాలను తెలిపారు.

15వ ఆర్థిక సంఘం ప్రత్యేకతలనూ సింగ్ వివరించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని నివేదిక రూపొందించామన్నారు. 1971 తర్వాత తాజా జనాభా లెక్కలను తీసుకోవడం ఇదే తొలిసారని చెప్పారు. రక్షణ రంగానికి కేటాయింపుల గురించి నివేదికలో పొందుపరచడం ఇదే మొదటిసారని వివరించారు. కరోనా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని నివేదికలో సిఫారసు చేసినట్లు చెప్పారు. స్థానిక సంస్థల అభివృద్ధికి అధిక కేటాయింపులు అవసరమని నీతి ఆయోగ్​ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం సరైందేనన్నారు. నివేదికకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

​ ఎన్​కే సింగ్​తో ఎక్స్​క్లూజివ్ ఇంటర్వ్యూ

కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల విభజన సూత్రాన్ని నిర్ణయించండం ఎంత క్లిష్టం?

మొదటి ఆర్థిక సంఘం నుంచి ఇది సవాల్​తో కూడుకున్న పనే. ప్రతి ఆర్థిక సంఘానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈసారి కొత్తగా రక్షణ రంగాన్ని చేర్చాం. ఎప్పటిలా ఐదేళ్లు కాకుండా ఆరేళ్ల పాటు సిఫారసులు చేశాం.

2017 నవంబర్​లో ఆర్థిక సంఘం ఏర్పాటైంది. నివేదిక సమర్పించడానికి ముందు కరోనా సంక్షోభం ముంచెత్తింది. దీనివల్ల జరిగిన మార్పులేంటి?

కరోనా సంక్షోభానికి మనమూ బాధితులమే. అందుకే నివేదికకు మార్పులు చేయడం అనివార్యమైంది. ఈసారి ప్రతి రాష్ట్రానికీ మేము రెవెన్యూ అంచనాలు ఇచ్చాం. ఈ ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా రెవెన్యూ అంకెలలో మార్పులు, ప్రతి రాష్ట్ర ఆదాయ, వ్యయంలో మార్పులు రావడం ఒక సమస్య.

మొట్టమొదటిసారిగా మేము కమిషన్ నివేదికలో ఆరోగ్య రంగానికి ఒక అధ్యాయాన్ని కేటాయించాం. ఆరోగ్యం కోసం, ముఖ్యంగా మూడో శ్రేణి కోసం ఖర్చులను తిరిగి లెక్కించాల్సిన అవసరం ఉంది.

మీ నివేదికలో ద్రవ్య లోటును 6.5 శాతంగా అంచనా వేశారు. కానీ బడ్జెట్లో ఇది 9.5 శాతానికి పెరిగింది?

కేంద్రానికి ఆర్థిక లోటు అంకెలను మనం అంచనా వేసిన దానికంటే తప్పుగా రూపొందించినట్లు కనిపిస్తాయి. 2017 ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీకి నేను నేతృత్వం వహించాను. ఆ 2018లో అంగీకరించారు. కమిటీకి, కమిషన్‌కు ఆందోళన కలిగించే ఒక అంశం ఆర్థిక డేటా. దానికి పారదర్శకత విశ్వసనీయత అవసరం.

పన్నుల్లో 50 శాతం వాటా కావాలని రాష్ట్రాలు అడిగాయి. దీన్ని ఎలా పరిష్కరించారు?

మునుపటి ఆర్థిక సంఘాలన్నీ రాష్ట్రాల వాటాను పెంచుకుంటూ పోయాయి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 32% నుంచి 42%కి పెంచింది. ఇది కేంద్రంపై భారాన్ని పెంచింది. రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించాలని కేంద్రం ఆశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల వాటా పెంచలేం. అలాగని తగ్గించలేం కూడా. అందుకే రాష్ట్రాల వాటాను 41 శాతానికి పరిమితం చేశాం.

అయిదేళ్ల కాలానికి స్థూలంగా ఆదాయం రూ.153.4 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశాం. కేంద్రానికి రిజర్వు బ్యాంకు ఇచ్చే డివిడెండు, కేంద్ర రంగ సంస్థలు ఇచ్చే లాభాలు, ఇతరత్రా ఆదాయాల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు. వాటిని మినహాయిస్తే మొత్తం పన్నుల వసూళ్లు రూ.135.4 లక్షల కోట్లుగా తేలుతుంది. ఇందులో నుంచి సెస్‌, సర్‌ఛార్జీలను తీసివేస్తే వాటాలు వేయాల్సిన ఆదాయం రూ.103 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 41 శాతం అంటే రూ.42 లక్షల కోట్లు రాష్ట్రాలకు వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా గ్రాంట్ల రూపంలో రూ.10.5 లక్షల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల సహాయం కింద రూ.1.22 లక్షల కోట్లు, రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు ఇవ్వాలని సూచించాం. వీటిని కూడా కలుపుకొంటే రాష్ట్రాలకు అందేది 41 శాతానికి మించే ఉంటుంది.

సెస్‌, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రం అధికంగా వసూలు చేస్తోందని, అందులో వాటా ఇవ్వడం లేదని రాష్ట్రాలు అంటున్నాయికదా?

రాష్ట్రాల అభ్యంతరాల్లో వాస్తవం ఉంది. సెస్సు, సర్‌ఛార్జీల రూపంలో జరిగిన వసూళ్లు 2010-11లో మొత్తం ఆదాయంలో 10.4%గా ఉండగా, 1920-21లో 19.9%కు పెరిగింది. అంటే దాదాపుగా రెట్టింపయ్యింది. సెస్సు, సర్‌ఛార్జీల ఆదాయాన్ని వాటా వేయడం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. 2000లో చేసిన రాజ్యాంగ 80వ సవరణ ద్వారా ఆ అవకాశాన్ని తొలగించారు. దీంట్లో మళ్లీ మార్పులు చేయాలంటే పార్లమెంటుకే ఆ అధికారం ఉంది.

2011 జనాభా లెక్కల ఆధారంగా సిఫార్సులు చేస్తే నష్టపోతామంటున్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను ఏవిధంగా పరిష్కరించారు?

దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయి. అయితే 2011 లెక్కల ప్రకారం జనాభా తగ్గడంతో ఆ మేరకు నిధులు తగ్గుతాయని ఆందోళన చెందాయి. దీనిని రెండు విధాలుగా పరిష్కరించాం. కొన్నింటికి జనాభాను పరిగణనలోకి తీసుకున్నాం. మరికొన్నింటికి జనాభా నియంత్రణకు పురస్కారంగా నిధులు పెంచాం. ఆ మేరకు నష్టం జరగకుండా చూశాం.

ఆ రాష్ట్రాల ఆవేదనను పూర్తిగా తీర్చారా?

పూర్తిగా అననుగానీ, బాధ్యతతో వ్యవహరించాం. జనాభాను నియంత్రించడం వల్ల ఒక్క నిధులే కాదు...పార్లమెంటు, అసెంబ్లీ సీట్లను నష్టపోతామన్న ఆందోళన కూడా వాటిలో ఉంది.

కొత్త ఆర్థిక సమాఖ్య వ్యవస్థలో అసౌకర్యంగా ఉన్నట్టు రాష్ట్రాలు భావిస్తున్నాయి కదా?

రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర అధికారాల విభజన జాబితా ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రాల పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయి. ఉద్యోగ కల్పన, ఆహారం, విద్య తదితరాలు ఈ కోవలోకి వస్తాయి. ఏడో షెడ్యూల్‌నే పునఃపరిశీలించాల్సి ఉంది.

భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక వనరులపై కేంద్ర పెత్తనం పెరుగుతుందని అనుకుంటున్నారా?

అలాంటిదేమీ ఉండదు. నిధుల వాటాలు వేసే ఆర్థిక సంఘం ఎలాంటి కేంద్రీకృత విధానాలను అనుసరించదు. అంతా పారదర్శకంగా, ఒక సూత్రం ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఇబ్బందులు ఉండవు.

ప్రత్యక్ష పన్నుల విధానంలో సుస్థిరత ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలా?

సుస్థిర పన్నుల విధానం ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎక్కువ మందిని పన్నుల పరిధిలోకి తీసుకురావాలని కొందరు కోరుతుంటే.. పన్ను మినహాయింపులు పెంచాలని ఇంకొందరు డిమాండు చేస్తుంటారు. మరింత మందిని పన్నుల పరిధిలోకి తెచ్చి, మినహాయింపులను క్రమేణా ఎత్తివేయాలన్నదే నా అభిప్రాయం. అప్పుడే పన్నుల్లో సుస్థిరత కనిపిస్తుంది.

Last Updated : Feb 23, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.