ETV Bharat / business

'బడ్జెట్​'పైనే మధ్యతరగతి కోటి ఆశలు- ఊరట లభించేనా?

author img

By

Published : Jan 31, 2022, 4:23 PM IST

Budget 2022 expectations: దేశ బడ్జెట్‌ అంటే ప్రజల కళ్లన్నీ దానిపైనే. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి, నిరుద్యోగులు.. బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకుంటారు. ఆదాయ పన్ను శ్లాబుల తగ్గింపు, ఉద్యోగ కల్పనకు నిధులు, విద్య, ఆరోగ్య రంగంపై వరాలు.. ఇలా ఏ రకంగా ఊరట కల్పిస్తారో అని ఆయా వర్గాలు ఎదురుచూస్తుంటాయి. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్థిక స్థితి మరింత దెబ్బతిన్న వేళ.. నిర్మలమ్మ బడ్జెట్‌ నుంచి వారు ఏం ఆశిస్తున్నారు?

Budget 2022 expectations
వార్షిక బడ్జెట్​

Budget 2022 expectations: దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అంటే కత్తిమీద సాము లాంటిది. ఆదాయాలకు అనుగుణంగా జాగ్రత్తగా కేటాయింపులు, ఖర్చులు చేస్తూ ఉండాలి. కరోనా తర్వాత ఆదాయాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ కుదేలైన ప్రస్తుత సమయంలో నిర్వహణ సవాలే. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన బడ్జెట్‌ను జాగ్రత్తగా రూపొందిస్తేనే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడం సాధ్యం. ఈ సవాళ్ల మధ్యే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా కారణంగా ఊడిన ఉద్యోగాలు, దెబ్బతిన్న స్వయం ఉపాధి, ఉన్న ఉద్యోగాల్లోనూ జీతాల కోత, ఆరోగ్య పరిరక్షణకు పెరిగిన ఖర్చులు, దెబ్బతిన్న విద్యారంగం వంటివి మధ్యతరగతిని కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి రాబోయే బడ్జెట్‌లో తమకు ఏదైనా ఊరట లభిస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తోంది.

దేశ జనాభాలో మధ్యతరగతి వాటా 28శాతం. దేశ పన్ను చెల్లింపుదారుల్లో 79 శాతం వీరే. వినియోగ ఖర్చులో వీరిది 70శాతం వాటా. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తూ ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు కూడా ఉన్నారు. 2014లో మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు కనీస పన్ను మినహాయింపు పరిధి పెంపు, సెక్షన్‌ 80C కింద ఊరట, ప్రామాణిక పన్ను కోత విధానం, ఐచ్ఛిక పన్ను స్లాబు రేట్లను ప్రవేశపెట్టడం వంటి చర్యలు తీసుకుంది. కొవిడ్‌ తర్వాత పన్ను చెల్లింపుదారులకు దక్కిన ఊరట అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో వారి ఆదాయాలు అనుకున్నంతగా పెరగలేదు. అందువల్ల ఆదాయ పన్ను విషయంలో ఈ బడ్జెట్‌లో ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. ఐచ్ఛిక పన్ను స్లాబు రేట్ల వల్ల తరచూ ఇబ్బందులు వస్తున్నందున దాన్ని సులభతరం చేసేలా బడ్జెట్‌లో చర్యలు ఉండగలవని కోరుకుంటున్నారు.

విద్య, ఆరోగ్య రంగానికి తగిన కేటాయింపులు..

కరోనా కారణంగా వైద్యానికి చేసే ఖర్చు పెరగడం, పాఠశాలలు మూతపడి పిల్లల చదువులు దెబ్బతిన్న నేపథ్యంలో వీటి నుంచి బయటపడేందుకు ఆయా రంగాలకు కేటాయింపులు పెరగగలవని మధ్యతరగతి కోరుకుంటోంది. ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం 189 దేశాల్లో భారత్‌ 17వ స్థానంలో నిలిచింది. 2017 జాతీయ ఆరోగ్య విధానం.. వైద్య రంగంపై ఖర్చు 2025 నాటికి జీడీపీలో 2.5శాతం ఉండాలని సూచించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రజా ఆరోగ్యంపై చేసే ఖర్చు జీడీపీలో 0.9శాతం నుంచి కాస్త పెరిగింది. అయితే 2020-21లో అది జీడీపీలో 1.1.శాతం మాత్రమే ఉంది. ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహించిన సర్వేలో 40శాతం మంది ఈ సారి బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగానికి తగిన కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు.

వేతన జీవులు, నిరుద్యోగుల కోటి ఆశలు..

కరోనా కారణంగా నిర్వహణ సరిగా లేక అనేక సంస్థలు, పరిశ్రమలు తమ ఉద్యోగులను తొలగించాయి. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది. దేశ జనాభా ప్రకారం సగటున 60కోట్ల మందికి ఉద్యోగాలు ఉండాలి. కానీ ప్రస్తుతం 40కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్యపై ఎకనామిక్ టైమ్స్‌ సర్వే నిర్వహించగా, నలుగురిలో ఒకరికి ఉద్యోగాలు దొరకడం కష్టంగానే ఉందని తెలిపారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్‌ ముద్రా రుణ పథకం, జనధన్‌ పథకం వంటివి తీసుకువచ్చినా వాటి అమలు తీరులో లోపాల వల్ల ఆశించినంత ప్రయోజనం దక్కడం లేదనే వాదన ఉంది. మోదీ ప్రభుత్వ పాలనలో విధానాలు ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల రాష్ట్రాలు, స్థానిక స్థాయిలో పథకాలు సరిగా అమలు కావడం లేదన్నది విశ్లేషకుల మాట.

నిరుద్యోగ సమస్య వల్ల దేశంలో పేదరికం క్రమంగా పెరుగుతోంది. 2011లో 34కోట్ల మందిగా ఉన్న పేదల సంఖ్య 2019లో గణనీయంగా దిగి వచ్చినా కరోనా దెబ్బకు 2020లో 13కోట్ల 40లక్షలకు చేరింది. కరోనా వల్ల కార్మికులు, కూలీలు స్వస్థలాలకు వలస వెళ్లగా.. పరిశ్రమలు, నిర్మాణ రంగం నిర్వహణ సరిగా సాగడం లేదు. అందుకే ఈ పరిస్థితుల మధ్య ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై మధ్యతరగతి, వేతన జీవులు, నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కరోనా దాదాపు రెండేళ్లుగా జీవనాన్ని అన్ని విధాలా నష్టపరిచిన నేపథ్యంలో దాన్ని గాడిలో పెట్టేందుకు బడ్జెట్‌లో చర్యలు ఉండాలని ఆయా వర్గాలు ఆశిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.