ETV Bharat / business

అనుసంధానం చేయని 18 కోట్ల పాన్​ కార్డులపై వేటు!

author img

By

Published : Aug 21, 2020, 12:45 PM IST

పాన్​ను ఆధార్​తో లింక్​ చేసుకోని వారికి ఐటీ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ఆధార్​తో లింక్ చేసుకోని పాన్​ కార్డులు 18 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. వారంతా 2021 మార్చి 31లోపు అనుసంధానం చేసుకోని వాటన్నింటిని నిర్వీర్యం చేస్తామని స్పష్టం చేసింది.

18 Crores PANs Could Become Defunct
18 కోట్ల పాన్ కార్డ్​లపై వేటు

పాన్‌ కార్డులను ఆధార్‌ కార్డుతో 2021 మార్చి 31లోగా అనుసంధానం చేసుకోవాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు గుర్తు చేసింది. అయితే ప్రస్తుతం ఆధార్​తో లింక్‌ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని ఇటీవల వెల్లడించింది. గడువు ముగిసేలోగా వాటిని ఆధార్​తో జోడించకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ హెచ్చరించింది.

ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ... పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్‌ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌, క్రెడిట్‌-డెబిట్‌ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి.. ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌ (ఎస్‌ఎఫ్టీ) సహాయంతో సంబంధిత వ్యక్తులను గుర్తించనున్నారు.

పన్ను చెల్లింపులపై ప్రధాని ఆవేదన..

సుమారు 130 కోట్ల జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారని ప్రధాని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం.. "పారదర్శక పన్ను విధానం.. నిజాయితీపరులకు గౌరవం (ట్రాన్సపరెంట్‌ ట్యాక్సేషన్‌...హానరింగ్‌ ద హానెస్ట్‌)" అన్న ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌ను ప్రారంభించింది.

అంతేకాకుండా పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ చర్యను చేపట్టామని ఆయన అన్నారు. దీనిద్వారా పన్నుల విధానం సులభం, పారదర్శకం కానుందని.. అదేసమయంలో పౌరులు కూడా బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని, తద్వారా దేశ ప్రగతికి చేయూతనివ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రూ.88.6 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.