ETV Bharat / business

ఆర్‌సెప్‌ ఒప్పందం ఖరారు- 15 దేశాల సంతకం

author img

By

Published : Nov 16, 2020, 7:59 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందంగా భావిస్తున్న ఆర్​సెప్​ ఓ కొలిక్కి వచ్చింది. అతిపెద్ద వాణిజ్య ఒడంబడికపై 15 ఆసియా-పసిఫిక్‌ దేశాలు సంతకాలు చేశాయి. ఎనిమిదేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది. ఒప్పందం ద్వారా చైనాకే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుందని తెలుస్తోంది. పలు అభ్యంతరాలున్న నేపథ్యంలో గతేడాది ఈ ఒప్పందం చర్చల నుంచి భారత్ బయటకు వచ్చింది.

15 nations seal RCEP deal, India stays out
ఆర్‌సెప్‌ ఒప్పందం ఖరారు- 15 దేశాల సంతకం

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన 15 దేశాలు ఆదివారం భారీస్థాయి వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా దీనిని భావిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు చర్చలు కొనసాగిన తర్వాత ఈ 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య' (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్‌) ఒప్పందం కొలిక్కి వచ్చింది. దీనిపై సంతకం చేయడానికి భారత్‌ మాత్రం నిరాకరించింది. కొవిడ్‌-19 వల్ల దెబ్బతిన్న ఆర్థిక రంగం కోలుకునేందుకు ఒప్పందం దోహదపడుతుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి.

కరోనా తీవ్రత దృష్ట్యా ఈసారి ఆగ్నేయాసియా దేశాల, ఇతర ప్రాంతీయ భాగస్వాముల వార్షిక శిఖరాగ్ర భేటీని దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక రంగంలో దాదాపు మూడోవంతు ఈ ఒప్పంద పరిధిలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో రుసుములను తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒప్పందంపై సంతకాలు చేసిన రెండేళ్లలో ఆయా దేశాలన్నీ దానిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అప్పుడు అది అమల్లోకి వస్తుంది.

భారత్‌ చేరికపై ఆశాభావం

ఒప్పందంపై చైనా ప్రభావం ఉంది. ధరవరల తొలగింపు వల్ల దిగుమతులు వెల్లువెత్తితే అది దేశీయ ఉత్పత్తిదారులకు హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆర్‌సెప్‌ చర్చల నుంచి భారత్‌ గత ఏడాదే వైదొలగింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా వదిలేయడంతో చివరకు ఒప్పందానికి దూరమైంది. దీనిలో భారత్‌ పాల్గొనేందుకు ఇంకా అవకాశం ఉందని ఇతర దేశాలు గతంలో ఆశాభావం వ్యక్తం చేశాయి. ఏదో ఒక దశలో భారత్‌ కూడా దీనిలో చేరితే ఆసియాలో ప్రాంతీయ సహకారం పరిపూర్ణమవుతుందని సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. '15 ఆసియా-పసిఫిక్‌ దేశాల మొత్తం జీడీపీ 26 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.1950 లక్షల కోట్లు). ప్రపంచ జీడీపీలో 29 శాతాన్ని ఈ ఒప్పందం ప్రతిఫలిస్తుంది. ప్రపంచ వృద్ధి మందగమనంలో ఉన్న తరుణంలో ఈ ఒప్పందం ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిపోతుంది. 46 విడతల చర్చల్లో ఎంతోమంది చేసిన గొప్ప ప్రయత్నంతో ఇది సాకారమయింది' అని చెప్పారు.

భారీగా తగ్గనున్న దిగుమతి సుంకం

చైనా నుంచి ఎక్కువ దేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతున్నందువల్ల తాజా ఒప్పందం ద్వారా ప్రధానంగా ఆ దేశానికే ప్రయోజనం కలగవచ్చని భావిస్తున్నారు. కొత్త ధరవరలు 2022లో మొదలయ్యాక వివిధ సుంకాలు 2014 స్థాయికి పడిపోనున్నాయి. దిగుమతి సుంకాలు దాదాపు 80-90% మేర తగ్గిపోతాయి. పెట్టుబడుల నిబంధనలు సరళతరమవుతాయి. ఆర్‌సెప్‌లో చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌, బ్రూనై, వియత్నాం, లావోస్‌, మయన్మార్‌, కాంబోడియా ఉన్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.