ETV Bharat / bharat

YS Viveka Case Updates: వివేకా హత్య కేసు దర్యాప్తునకు నేటితో ముగియనున్న గడువు..విచారణ కొలిక్కి వచ్చిందా..? లేదా ?

author img

By

Published : Jun 30, 2023, 8:14 AM IST

YS Viveka Murder Case Updates
YS Viveka Murder Case Updates

YS Viveka Murder Case Updates: వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా..? లేక సుప్రీంకోర్టును మరింత గడువు కోరతారా అనే సందిగ్ధత కొనసాగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరిపై నేడు లేదా వారం, పది రోజుల్లో ఛార్జిషీట్ వేసే అవకాశం కనిపిస్తోంది. జైళ్లో ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్ ముగిసినందున.... నేడు సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు.

వివేకా హత్య కేసు దర్యాప్తునకు నేటితో ముగియనున్న గడువు..

YS Viveka Murder Case Updates: వివేకా హత్య కేసు దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని, 16న వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు చేసిన 90 రోజుల్లో నిందితులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేయాల్సి ఉంటుంది. వారిద్దరిపై జులై 12లోగా ఛార్జిషీట్ దాఖలు చేయకపోతే డీఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ పై జులై 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో భాస్కర్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరిపై అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. జులై 3న సుప్రీంకోర్టుకు దర్యాప్తు పురోగతి వివరించి మరింత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది.

పులివెందులలో 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగ్గా... కేసు నాలుగేళ్లుగా అనేక మలుపులు తిరుగుతోంది. మొదట రాష్ట్ర పోలీసుల సిట్ దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 209 జూన్ 13న కొత్త సిట్ ఏర్పాటైంది. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2020లో కేసు సీబీఐకి చేరింది. దర్యాప్తు చేసిన సీబీఐ 2021 అక్టోబరు 26న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిపై ఛార్జి షీట్ వేసింది. మరో నిందితుడు డి.శివశంకర్ రెడ్డిపై 2022 ఫిబ్రవరి 3న అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డిని A6గా.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఏడో నిందితుడిగా చేర్చి ఇద్దరినీ అరెస్టు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది.

వివేకా హత్య కేసును ఏప్రిల్ 30నాటికే పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. తర్వాత ఆ గడువును నేటి వరకు పొడిగించింది. అనేక పరిణామాల తర్వాత కేసు హైదరాబాద్ బదిలీ అయ్యాక దర్యాప్తు వేగం పుంజుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సి అవసరం ఉందని పలు సందర్భాల్లో న్యాయస్థానాల్లో సీబీఐ గట్టిగా వాదించింది. అవినాష్ రెడ్డి ఎనిమిదో నిందితుడిగా సీబీఐ పేర్కొంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాహ్య ప్రపంచం కన్నా ముందే వివేకా హత్య విషయం తెలుసుననీ ఇటీవల సీబీఐ ప్రస్తావించింది. సీఎంకు ఎవరు చెప్పారో దర్యాప్తు జరుగుతోందని కోర్టుల్లో సీబీఐ పేర్కొంది. ఒక దశలో అవినాష్ రెడ్డిని నేరుగా అరెస్టు చేసేందుకు కర్నూలుకు దర్యాప్తు అధికారులు వెళ్లారు. అయితే మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈనెలలో ప్రతి శనివారం సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరయ్యారు.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 3న విచారణ జరగనుంది. అయితే సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనున్నందున.. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి సుప్రీంకోర్టును మరింత గడువు కోరే అవకాశం కనిపిస్తోంది. చంచల్ గూడ జైళ్లో ఉన్ననిందితుల రిమాండ్ నేటితో ముగియనున్నందున వారిని ఇవాళ సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు. నిందితులందరి రిమాండ్ ను పొడిగించాలని కోర్టును సీబీఐ కోరనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.