ETV Bharat / bharat

యూపీ సీఎంగా యోగి పట్టాభిషేకం.. అంబానీ, అదానీ, సినీ తారలు హాజరు!

author img

By

Published : Mar 24, 2022, 5:30 PM IST

Updated : Mar 24, 2022, 9:07 PM IST

Yogi Adityanath
యూపీ సీఎంగా యోగి ఏకగ్రీవం

Yogi Adityanath oath date: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్​ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 50 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలు, అంబానీ, అదానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్​ తారలు హాజరవుతున్నట్లు పేర్కొన్నాయి.

Yogi Adityanath oath date: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భాజపా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మళ్లీ యోగి ఆదిత్యనాథ్​ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. గురువారం సాయంత్రం లఖ్​నవూలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రితో పాటు ప్రమాణం చేయనున్న మంత్రుల పేర్లను కూడా భాజపా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Yogi Adityanath
యోగి చెవి పోగులకు క్రేజ్​

గవర్నర్​ను కలిసిన యోగి: భాజపా శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం గవర్నర్​ ఆనందిబెన్​ పటేల్​ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు యోగి ఆదిత్యనాథ్​. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాను లఖ్​నవూ విమానాశ్రయానికి తీసుకెళ్లి దిల్లీకి పంపించాక.. అక్కడి నుంచి నేరుగా రాజ్​భవన్​కు వెళ్లారు యోగి. అంతకుముందే ఎన్​డీఏ ప్రతినిధులు గవర్నర్​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ లేఖ అందించారు.

కేబినెట్​ కూర్పుపై విస్తృత చర్చలు: యూపీ కొత్త మంత్రివర్గ కూర్పుపై బుధవారం దిల్లీ వెళ్లిన ఆదిత్యనాథ్​.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాలతో విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో భాజపా నేతలు ధర్మేంద్ర ప్రధాన్​, బీఎల్ సంతోష్ భాగమయ్యారు. ఈ సమావేశంలోనే మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారని, 70 మంది పేర్లను ప్రతిపాదించగా.. అందులో 50 మంది పేర్లకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Yogi Adityanath
చెవి పోగులు పెట్టుకుంటున్న యువకుడు
  • పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు.. ప్రముఖలు హాజరు: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన సందర్భంగా.. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, భాజపా అగ్రనేతలు సహా పలువురు పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు.
  • కేంద్ర హోమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్, భాజపా పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే.. ఎన్‌. చంద్రశేఖరన్‌, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, గౌతమ్‌ అదానీ, ఆనంద్‌ మహీంద్రా, సంజీవ్‌ గొయెంకా తదితర 60 మంది పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో కొందరు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మోదీ, అమిత్​ షా, యోగిల కటౌంట్లు సహా స్టేడియం మొత్తం కాషాయమయంగా మారిపోయింది.
  • యోగి ఆదిత్యనాథ్​ వ్యక్తిగతంగా మరో 50 మంది అయోధ్య, మథుర, వారణాసికి చెందిన ఆధ్యాత్మిక గురువులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. శ్రీ రామ్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడికి ఆహ్వానం అందినట్లు విశ్వహిందూ పరిషత్​ సభ్యుడు దినేశ్​ శంకర్​ తెలిపారు. 13 అఖాడాల ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్‌ నుంచి 500 మంది ప్రత్యేక అతిథులు రానున్నట్లు సమాచారం. మొత్తం 20వేల మంది ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
  • ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, ఆర్​ఎల్​డీ చీఫ్​ జయంత్​ చౌదరి నిర్ణయించారు. తాము ప్రమాణ స్వీకారానికి వెళ్లటం లేదని ప్రకటించారు. 2017లో జరిగిన ప్రమాణస్వీకారానికి తన తండ్రి ములాయం సింగ్​ యాదవ్​తో కలిసి హాజరయ్యారు అఖిలేశ్​.
  • బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, అజయ్‌ దేవగణ్‌, బోనీ కపూర్‌తో పాటు ఇటీవల సంచలన విషయం సాధించిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్‌, ఆ చిత్రబృందం ప్రత్యేక అతిథులుగా ప్రమాణస్వీకారానికి రానున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల నుంచి భాజపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. 50వేల మంది వరకు హాజరయ్యేందుకు ఈ స్టేడియంలో సౌకర్యాలు ఉన్నాయి.
Last Updated :Mar 24, 2022, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.