ETV Bharat / bharat

అవినీతి నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటా..!

author img

By

Published : Sep 6, 2021, 6:15 AM IST

బంగాల్​ బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మేనల్లుడు, ఎంపీ అభిషేక్​ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిజమని తేలితే.. బహింరంగంగానే ఉరి వేసుకుంటానని అన్నారు. భాజపా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

Abhishek Banerjee
ఎంపీ అభిషేక్​ బెనర్జీ

తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిజమని తేలితే బహిరంగంగానే ఉరి వేసుకుంటానని బంగాల్‌ సీఎం మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన భారతీయ జనతా పార్టీ.. రాజకీయంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకోవడం తప్ప భాజపాకు మరోపని లేదని విరుచుకుపడ్డారు. మనీ లాండరింగ్‌ కేసులో విచారణకు హాజరయ్యేందుకు దిల్లీ వెళుతున్న సందర్భంలో విలేకరులతో మాట్లాడారు.

'ఏదైనా కేసులో నేను అవినీతికి పాల్పడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో రుజువైతే.. నేరుగా పోడియం మీదకు వెళ్లి బహిరంగంగా అందరిముందే ఉరి వేసుకుంటాను. ఇందుకు సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు అవసరం లేదు. ఎన్నికల ముందు బహిరంగ సభల్లోనూ నేను చెప్పిన మాటలను పునరుద్ఘాటిస్తున్నా' అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎలాంటి దర్యాప్తులనైనా ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనన్నారు. అయితే, రాజకీయంగా వేధించేందుకే భాజపా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో కేసుకు సంబంధించి దిల్లీలో విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పిలవడమే ఇందుకు నిదర్శనమని కేంద్రం తీరును దుయ్యబట్టారు.

బంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన ఓ మనీ లాండరింగ్‌ కేసులో సెప్టెంబర్‌ 6న విచారణకు హాజరు కావాలంటూ అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు ఇచ్చింది. సోమవారం నాడు జరిగే ఈడీ విచారణకు హాజరయ్యేందుకు దిల్లీ బయలుదేరిన ఆయన.. కోల్‌కతా విమానాశ్రయంలో విలేకరులతో పై విధంగా మాట్లాడారు.

ఇదీ చూడండి: సీఎం తండ్రిపై కేసు.. 'చట్టానికి ఎవరూ అతీతులు కారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.