ETV Bharat / bharat

గెలుపోటములు తేల్చేది గజరాజేనా.. అందరి చూపు బీఎస్పీపైనే!

author img

By

Published : Mar 2, 2022, 10:21 AM IST

up elections
bsp mayavathi

UP Election 2022: యూపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధానంగా భాజపా, ఎస్పీల మధ్యే పోటీ కనిపిస్తున్నప్పటికీ.. బీఎస్పీని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఎస్పీ 18% ఓట్లు సాధించి.. ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని నిపుణులు తెలుపుతున్నారు.

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు ప్రధానంగా భాజపా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్యే కనిపిస్తున్నప్పటికీ.. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీని (బీఎస్పీ) ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గజరాజు (బీఎస్పీ ఎన్నికల గుర్తు) చీల్చే ఓట్లు అనేక నియోజకవర్గాల్లో ఇతర పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశముందని సూచిస్తున్నారు. ముఖ్యంగా గెలుపు అంతరం 10 వేల ఓట్ల కంటే తక్కువగా ఉండే స్థానాల్లో విజేతను నిర్ణయించబోయేది బీఎస్పీయేనని చెబుతున్నారు.

bsp mayavathi
బీఎస్పీ 'గజరాజు'

దళితుల మద్దతుపై ధీమా..

తాజా ఎన్నికల్లో యూపీ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా బరిలో నిలిచింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. తమ ప్రధాన ఓటుబ్యాంకుగా పేరున్న దళితులతోపాటు ఓబీసీల్లోని కొన్ని వర్గాల మద్దతునూ తిరిగి కూడగట్టుకోవడంలో మాయావతి సఫలీకృమవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు 10%గా ఉన్న జాతవ్​లు (దళితుల్లో ప్రధాన వర్గం) ఈ ఎన్నికల్లో బీఎస్పీకి అండగా నిలవబోతున్నట్లు విశ్లేషణలొస్తున్నాయి. మాయావతి ఈ సామాజికవర్గానికి చెందినవారే. రాష్ట్రంలో జాతవేతర దళితులు 11% ఉండగా.. వారిలో 25-30% మంది బీఎస్పీ వైపే మొగ్గుచూపుతున్నారు. జాతవ్‌లలో అత్యధికులు, జాతవేతర దళితుల్లో కొన్నివర్గాలవారు.. ఎస్పీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. అగ్రవర్ణాలవారితో (వీరు ఎక్కువగా భాజపాకు మద్దతిస్తుంటారు) పోలిస్తే.. యాదవులే (ప్రధానంగా ఎస్పీకి అండగా ఉంటారు) తమపై ఎక్కువగా అణచివేతకు పాల్పడుతుంటారన్న భావనే అందుకు కారణం.

bsp
గత ఎన్నికల్లో సాధించిన ఫలితాలు
అభ్యర్థుల పట్టిక
బీఎస్పీ అభ్యర్థుల వివరాలు

ఓబీసీల్లోనూ..

దళితులే కాకుండా.. యాదవేతర, జాట్‌యేతర ఓబీసీల్లోని కొన్ని వర్గాల ప్రజలూ బీఎస్పీకి మద్దతు పలుకుతుంటారు. ఓబీసీల్లో యాదవులు, జాట్‌లు, కుర్మీల వంటి వర్గాలవారు తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారన్న ఆగ్రహమే అందుకు కారణం. తాజా ఎన్నికల్లో బీఎస్పీ 114 మంది ఓబీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా.. వారిలో అత్యధికులు- ఓబీసీల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్న మౌర్య, కుశ్వాహ, శాక్య, కశ్యప్‌, బఘేల్‌, సైనీ వంటి వర్గాలకు చెందినవారే. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులను బీఎస్పీ 110 స్థానాల్లో బరిలో దించింది. రాష్ట్రంలో మరే పార్టీ కేటాయించనంత అధికంగా 86 స్థానాల్లో ముస్లింలకు టికెట్లు (ఎస్పీ 63 టికెట్లు) ఇచ్చింది. తద్వారా అటు అగ్రవర్ణాలు, ఇటు ముస్లింల మనసు గెల్చుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు- ఎస్పీ తరఫున టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీలో చేరి పోటీ చేస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ పరిణామాలన్నీ బీఎస్పీకి సానుకూలంగా మారే అవకాశముంది. అయినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గజరాజు దాదాపు 18% ఓట్లు సాధించడం ద్వారా.. భాజపా-ఎస్పీ మధ్య నువ్వా-నేనా అన్న తరహాలో పోటీ ఉన్న స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ విజయావకాశాలను అది దెబ్బతీయొచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: మోదీ వరుస భేటీలు.. ఉక్రెయిన్ పొరుగుదేశాలకు కేంద్ర మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.