ETV Bharat / bharat

పంజాబ్​లో ఎవరి బలం ఎంత? అమరీందర్ మేజిక్ చేసేనా?​

author img

By

Published : Jan 21, 2022, 5:10 PM IST

Who will come to power in Punjab?
పంజాబ్​ పీఠం ఎవరిది

Punjab assembly election 2022: దాయాది దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రంగా.. జాతీయ భద్రతలో కీలకమైన పంజాబ్‌లో అధికారం చేపట్టాలని ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. అయితే అక్కడ అధికారం చెపట్టడం అంత సులభం కాదనేది జగమెరిగిన సత్యం. దానికి కారణాలు ఏంటి? అక్కడి విభిన్న పరిస్థితులు పార్టీలకు ఎలాంటి సవాళ్లు విసురుతున్నాయి? అంతర్గత అంశాలు, రాజకీయ ఆకాంక్షలు ప్రభావం ఎన్నికలపై ఏ మేరకు ఉంటాయి? అసలు పంజాబ్‌ రాజకీయ ముఖ చిత్రమేంటి? సిక్కుల ఇలాఖాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీల బలాబలాలు ఏంటి?

Punjab assembly election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత ఆ స్థాయిలో కీలకంగా భావిస్తున్న రాష్ట్రం పంజాబ్. ఇందుకు కారణాలు అనేకం. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడం ఒక విషయమైతే.. కాంగ్రెస్‌ ముక్త్ భారత్‌ అంటూ తీవ్ర పోరుకు భాజపా సిద్థమవుతుండడం మరో కారణం. అంతే కాదు.. ఈ పార్టీల మధ్యలో ఆప్‌ తన పరిధుల్ని విస్తరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. దాయాది దేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రంగా.. జాతీయ భద్రతలో కీలకమైన పంజాబ్‌లో ఎన్నికలొస్తే.. ఎన్నో అంశాలు అటువైపు దేశం దృష్టి పడేలా చేస్తాయి.

మొదట ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు గురు రవిదాస్‌ జయంతి వేడుకలు ఉండటం వల్ల.. పోలింగ్​ తేదీని వాయిదా వేసింది ఈసీ. ఆ రోజుల్లో చాలా మంది ప్రజలు.. వారణాసి వెళతారని, వారంతా.. పోలింగ్‌కు దూరంగా ఉంటారని.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈసీని కోరాయి. దాంతో... పోలింగ్‌ను 6 రోజుల పాటు వాయిదా వేసి.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో నిర్వహించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం.

punjab assembly seats

22 జిల్లాలు.. 117 స్థానాలు..

22 జిల్లాలున్న పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్నాయి. సాధారణ ఆధిక్యం అందాలంటే కనీసం.. 59 సీట్లు దక్కించుకోవాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. చూసేందుకు చిన్న రాష్ట్రంగానే ఉన్నా.. ఎన్నో వైవిధ్యాలుంటాయి ఇక్కడ. చాలా రాష్ట్రాల్లో అయితే జాతీయ, లేదంటే స్థానిక పార్టీలు అధికారం కోసం పోటీ పడుతుంటాయి. కానీ.. ఇక్కడ జాతీయ, స్థానిక పార్టీల ఉనికి పోటాపోటీగా ఉంటోంది.

అమరీందర్​ సింగ్‌ రాకతో మారిన రాజకీయం

సాధారణంగా.. ఎన్నికల రేసులో గట్టి పోటీ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ, శిరోమణి అకాళీదళ్‌ పార్టీల మధ్యే ఉంటుంది. కానీ.. ఈ సారి ఆప్‌ రాకతో పోరు త్రిముఖంగా మారిపోయింది. అంతలోనే... కెప్టెన్‌ అమరీందర్​ సింగ్‌ నేతృత్వంలోని కూటమిలో భాగంగా భాజపా కూడా పంజాబ్‌ రాజకీయ తెరపై వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న అమరీందర్​ సింగ్‌ పోటీతో పంజాబ్‌ రాజకీయం మరింత ఆసక్తిగా మారిపోయింది.

గత ఎన్నికల్లో అమరీందర్​ సింగ్‌ సారథ్యంలో ఎన్నికల పోరులో నిలిచిన కాంగ్రెస్‌.. ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ మంచి ఫలితాలు రాబట్టింది. మొత్తం 117 సీట్లకు గానూ సొంతగానే 77 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని పంజాబ్‌లో అధికార పీఠాన్ని అధిరోహించింది.

ఆప్​ దూకుడు

దిల్లీకి దగ్గరగా ఉండడం వల్ల పంజాబ్‌ రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ కారణంగానే.. నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తోంది. అలా 2017 ఏడాదికి గానూ.. ఏకంగా 20 సీట్లలో అభ్యర్థుల్ని గెలిపించుకుని సత్తా చాటింది. మిగతా పార్టీల్ని పక్కకు నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఎన్నికల్లోనే భాజపా అనుకున్న స్థాయిలో అసెంబ్లీ స్థానాలు నెగ్గుకు రాలేకపోయింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ కూటమి 15 సీట్లను మాత్రమే గెలుచుకుంది. విడిగా చూస్తే భాజపా 23 స్థానాల్లో పోటీ చేసి 3 స్థానాలే గెలుచుకుంది.

సీట్ల లెక్కన కంటే.. ఓట్ల వారీగా చూస్తే పార్టీల అసలు బలాలు బయటపడతాయి అంటారు చాలామంది విశ్లేషకులు. ఎందుకంటే.. పోటీలో తక్కువ వ్యత్యాసంతో ఓడిపోయే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. అందుకే.. ప్రతి పార్టీకి పోలైన ఓట్ల శాతం పరిశీలించాలి.

Punjab assembly elections 2017 vote share

2017 ఎన్నికల్లో ఓట్ల శాతం..

  • కాంగ్రెస్‌ పార్టీకి.. 38.5శాతం ఓట్లు
  • శిరోమణి అకాళీదళ్‌కు 25.2శాతం ఓట్లలు
  • ఆమ్‌ ఆద్మీ పార్టీకి 23.7శాతం ఓట్లు
  • భారతీయ జనతా పార్టీకి 5.4శాతం ఓట్లు
  • బహుజన్‌ సమాజ్‌ పార్టీకి 1.5శాతం ఓట్లు
  • అయితే ..సీట్ల పరంగా శిరోమణి అకాళీదళ్‌ కంటే... 5 స్థానాలు ఎక్కువ గెలుకోగలిగింది ఆప్​.

ఈ గణాంకాలు పరిశీలిస్తే.. చాలా స్వల్ప తేడాలతోనే పార్టీల తలరాతలు మారాయి. ఈ గణాంకాలు ప్రతి ఎన్నికల్లో అప్పటి పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి. అలా.. మరికొన్ని వారాల్లో జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో.. కచ్చితంగా చెప్పలేమంటున్నారు నిపుణులు.

  • రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏ అంశాలు కీలకంగా మారనున్నాయి అనే అంశాలపై ఇప్పటికే.. పలు సంస్థలు సర్వేలు చేశాయి.
  • ఈ సర్వేల్లో నిరుద్యోగ అంశమే కీలకంగా భావించారు. ఆర్థిక అస్థిరత కూడా ఓటింగ్‌ను ప్రభావితం చేయొచ్చు. సర్వేల్లో.. 39 శాతం మంది ఈ రెండు విషయాల్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
  • ఆ తర్వాత ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యవసర ధరలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రధాన పార్టీలన్నీ.. ఈ అంశాల్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావిస్తున్నాయి.
  • రైతు సాగు చట్టాలపై జరిగిన పోరు అంశంపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. ఈ అంశం ఆధారంగా... ఓట్లు వేస్తామంటూ.. ఇప్పటికే 14శాతం మంది వెల్లడించారని.. పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి.
  • సరిహద్దుల్లోని ఉగ్రవాదం, మాదకద్రవ్యాల చిచ్చు వంటి అంశాల్ని ఓటర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: Election 2022 India: ఎన్నికల గోదాలో గెలిచేదెవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.