ETV Bharat / bharat

'కాంగ్రెస్​తో దోస్తీకి రెడీ.. వారూ సహకరించాలి'.. పొత్తులపై దీదీ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : May 15, 2023, 11:01 PM IST

mamata banerjee on congress
mamata banerjee on congress

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట తాము మద్దతు ఇస్తామని తెలిపారు. అలాగే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు.

బంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తాము మద్దతిస్తామని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట త్యాగాలకు సిద్ధపడాలని ఆమె కోరారు. 2024 లోక్​సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న వేళ.. విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ తొలిసారి తన వైఖరికి తెలియజేశారు.

'2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న చోట.. మేం వారికి మద్దతిస్తాం. అందులో తప్పులేదు. అలాగే కాంగ్రెస్​ కూడా.. ఇతర ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలి. ఏదైనా మంచి జరగాలి అంటే మరో చోట త్యాగాలు తప్పవు. దేశంలో 200 చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్​వాదీ పార్టీ బలంగా ఉంది. అక్కడ ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా దిల్లీలో ఆప్‌, బంగాల్​లో తృణమూల్‌కు, బిహార్‌లో జేడీయూ- ఆర్జేడీ కూటమికి మద్దతివ్వాలి.'
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

అలాగని పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీని పోటీ చేయొద్దని తాను చెప్పడం లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సీటు షేరింగ్‌ ఫార్ములాను అనుసరించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాల ఐక్యతకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్​, డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కృషి చేస్తున్న వేళ మమతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండబోదని కొన్నాళ్లు క్రితం వరకు తెగేసి చెప్పిన.. కర్ణాటక ఫలితాల అనంతరం తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం.

ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నీతీశ్..
మరోవైపు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్.. విపక్షాల ఐక్యతకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఏప్రిల్​లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఐక్యంగా పని చేయడంపై చర్చించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దే దించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. బీజేపీని గద్దే దించేందుకు మరిన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.