ETV Bharat / bharat

గుజరాత్‌, హిమాచల్‌లో 2017 ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయా?

author img

By

Published : Dec 5, 2022, 9:46 PM IST

Gujarat Himachal Exit Polls:
Gujarat Himachal Exit Polls:

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరిచాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమయ్యాయా..? లేదా..? అనే విషయాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.

Gujarat Himachal Exit Polls: అభివృద్ధి, పథకాలపై రాజకీయ పార్టీలు ఎన్ని హామీలు గుప్పించినప్పటికీ ఓటరు నాడిని అంచనా వేయడం కష్టమే..! ఈ క్రమంలో పోలింగ్‌ తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ పేరుతో పలు సంస్థలు వెల్లడించే సర్వే నివేదికలపై ఆసక్తి నెలకొంటోంది. చాలా సార్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజమే అయినప్పటికీ.. మరికొన్ని సార్లు బోల్తాకొట్టాయి. తాజాగా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో గెలుపోటములపై పలు సర్వే అంచనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో గతంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమయ్యాయా..? లేదా అనే విషయాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.

గుజరాత్‌లో..
2017లో గుజరాత్‌లో భాజపానే స్వీప్‌ చేయనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఆ పార్టీ 112 నుంచి 116 స్థానాల్లో గెలుస్తుందని లెక్కకట్టాయి. అందుకు విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో భాజపా గెలిచింది. తొలి దశ పోలింగ్‌ జరిగిన 89 స్థానాల్లో 48 గెలుచుకోగా రెండో దశ పోలింగ్‌లో 51 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్‌కు 65 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు చెప్పగా.. 77 స్థానాల్లో గెలుపొందింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో..
హిమాచల్‌ ప్రదేశ్‌లో 2017లో భాజపా అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. అప్పట్లో కాంగ్రెస్‌ అధికారం ఉంది. భాజపా 47చోట్ల గెలుస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు సుమారు 22 సీట్లు వస్తాయని చెప్పాయి. అందుకు తగ్గట్లుగానే భాజపాకు 44 సీట్లు వచ్చాయి. అయితే, దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ ఈసారి గుజరాత్‌, హిమాచల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించి విస్తృత ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.