ETV Bharat / bharat

whatsapp: కేంద్రం X వాట్సప్‌.. ముదురుతున్న వివాదం

author img

By

Published : May 27, 2021, 7:32 AM IST

Updated : May 27, 2021, 9:15 AM IST

నూతన ఐటీ చట్టాలపై కేంద్రం-వాట్సాప్​ల మధ్య వివాదం ముదురుతోంది. ఐటీ నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ దిల్లీ హైకోర్టు(delhi high court)లో వాట్సప్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. మరోవైపు 'తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్​(facebook)తో తమ వినియోగదారుల సమాచారం పంచుకోవటం కోసం కొత్త గోప్యత నిబంధనలను(privacy policy) ప్రజలపై రుద్దుతున్న వాట్సప్‌.. దేశ భద్రత కోసం సమాచారం అడగటాన్ని మాత్రం తప్పుపడుతోందని' కేంద్రం దీటుగా స్పందించింది.

watsapp vs center
కేంద్రం X వాట్సప్‌

కొత్త ఐటీ నిబంధనలపై ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సప్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన వేళ.. వీటిలో ఒక రూల్‌ను సవాలు చేస్తూ వాట్సప్‌ (whatsapp​) దిల్లీ హైకోర్టుకెక్కింది. భారత ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ ఆరోపించింది. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు చేస్తున్నామని తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌ (facebook) చెప్పిన తర్వాత వాట్సప్‌ ఈ వాదన చేయటం విశేషం! మరోవైపు.. కేంద్రం కూడా అంతే దీటుగా స్పందించింది. వాట్సప్‌ వాదన తప్పంటూ.. కొత్త నిబంధనలతో ప్రజలకు, సామాజిక మాధ్యమ సంస్థలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టంచేసింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లోనే ప్రభుత్వం సమాచారం కోరుతుందని తేల్చిచెప్పింది. 'ఒకవంక తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌తో తమ వినియోగదారుల సమాచారం పంచుకోవటం కోసం కొత్త గోప్యత నిబంధనలను (privacy policy) ప్రజలపై రుద్దుతున్న వాట్సప్‌... దేశ భద్రత కోసం సమాచారం అడగటాన్ని మాత్రం తప్పుపడుతోంది. ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు.. ఇక్కడి చట్టాలను పాటించాలి' అని స్పష్టం చేసింది. అంతేగాకుండా.. కొత్త నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే.. వీలైతే నేడే తెలియజేయండని అన్ని సామాజిక మాధ్యమ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

ఇది ప్రజల గోప్యతను హరించటమే: వాట్సప్‌

భారత ప్రభుత్వం విధించిన కొత్త ఐటీ నిబంధనలను పూర్తిగా అమలు చేయటమంటే.. వినియోగదారుల గోప్యతకు భంగం కల్గించటమే అవుతుందని.. అందుకు తాము సిద్ధంగా లేమని వాట్సప్‌ స్పష్టంచేసింది. ఐటీ నిబంధనల్లోని 4(2) నియమం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని, దీన్ని కొట్టేయాలని కోరుతూ మంగళవారం దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయాన్ని వాట్సప్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. కొత్త నిబంధనల ప్రకారం.. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సదరు సోషల్‌మీడియా(social media) సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీన్ని వాట్సప్‌ వ్యతిరేకిస్తోంది!

ఇదీ చదవండి: ఖాతాల నిలిపివేతపై వాట్సాప్​ క్లారిటీ

ఇదీ చదవండి: 'ప్రైవసీ పాలసీతో ఐటీ చట్టం ఉల్లంఘన'

రాజ్యాంగ విరుద్ధం

"కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఏ సందేశం గురించి అడిగితే- దాని మూలం ఏంటో, ఎవరి నుంచి మొదట సందేశం వచ్చిందో తెలియజేయాల్సి ఉంటుంది. అంటే మేం అనుసరిస్తున్న ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (సందేశం వివరాలు పంపేవారికి, స్వీకరించేవారికి తప్ప ఇతరులకు తెలియకపోవటం) తొలగించటమే. ఇలా చేయటం వినియోగదారుల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు భంగం కల్గించటమే అవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా! జర్నలిస్టులు, పౌరసంఘాలు, వివిధ మతసంఘాలు, సంస్థలు, ఉద్యమకారులు, నిపుణులు, కళాకారులు.. ఇలా అన్నిరకాల ప్రజలు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ కారణంగా తమ భావస్వేచ్ఛను నిర్భయంగా వ్యక్తంజేస్తుంటారు. వాట్సప్‌లో చాట్స్‌కు సంబంధించిన ఆనుపానులు చెప్పటమంటే.. మేం ఇక ప్రతి మెసేజ్‌పైనా నిఘావేసి ఉంచాలి. ఇదొకరకంగా మూకుమ్మడిగా అందరిపై నిఘా నేత్రమే! అంతేగాకుండా ఇలా చేయాలంటే రోజూ కొన్ని వందల కోట్ల సందేశాలను పర్యవేక్షిస్తూ, వాటిని అడిగినప్పుడు ఇచ్చేలా దాచిపెట్టాలి. అంటే చట్ట సంస్థలు ఎప్పుడో అడిగే సమాచారం కోసం అనవసరమైన డేటాను సేకరించి, నిక్షిప్తం చేయాల్సి వస్తుంది. ఇది ప్రజల ప్రాథమిక ప్రైవసీ హక్కుకు భంగం కల్గించే చర్య. ప్రజల వ్యక్తిగత సందేశాల గోప్యతను కాపాడటానికి వాట్సప్‌ కట్టుబడి ఉంటుంది. ప్రజల సందేశాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ఆచరణ సాధ్యమైన పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో( india govt) చర్చలు కొనసాగిస్తాం. న్యాయబద్ధమైన కేసుల్లో మావద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంటూనే ఉంటాం'' అని వాట్సప్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి: ప్రైవసీ పాలసీపై టెలిగ్రామ్​, వాట్సాప్ మీమ్స్ వార్​!

కొత్త ప్రైవసీ పాలసీలపై వాట్సాప్​కు కేంద్రం వార్నింగ్!

గోప్యతకు భంగం లేదు: కేంద్రం

కొత్త డిజిటల్‌ నిబంధనలు ప్రజల వ్యక్తిగత ప్రైవసీకి భంగం కల్గిస్తాయని, భావప్రకటన స్వేచ్ఛను హరిస్తాయన్న వాట్సప్‌ వాదనను కేంద్ర ఐటీశాఖ (it ministry) కొట్టిపారేసింది. ''కొత్త నియమాలతో ప్రజల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. కేవలం దేశ సార్వభౌమత్వానికి, ప్రజాపాలనకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో మాత్రమే ప్రభుత్వం విచారణ, వివరాలు కోరుతుంది. ప్రజల భావప్రకటన స్వేచ్ఛను భారత ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుంది. కొత్త ఐటీ నిబంధనలు అమలులోకి రాకుండా ఉండేందుకు చివరి నిమిషంలో వాటిని న్యాయస్థానంలో వాట్సప్‌ సవాలు చేయటం దురదృష్టకరం'' అని ఐటీ శాఖ పేర్కొంది. ''అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడాల్లో సామాజిక మాధ్యమ సంస్థలు చట్టబద్ధ సంస్థల విచారణకు కట్టుబడి ఉంటున్నాయి. ఇతర దేశాలు అడుగుతున్న దానికంటే భారత్‌లో ప్రభుత్వం కోరుతున్నది చాలా స్వల్పం. భారత నిబంధనలపై వాట్సప్‌ వాదన తప్పు. కొత్త డిజిటల్‌ నిబంధనను.. భావప్రకటన స్వేచ్ఛకు భంగం కల్గించేదిలా చిత్రీకరించటం తప్పుదోవ పట్టించటమే’’ అని ఐటీ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. బుధవారం నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనల ప్రకారం అన్ని సామాజిక మాధ్యమ సంస్థలు తమ చిరునామాలను, బాధ్యుల పేర్లను ఆయా వేదికలపై తెలియజేయాలి. ఏవైనా అభ్యంతరాలుంటే వాటిపై స్పందించేందుకు, చర్యలు తీసుకునేందుకు అంతర్గతంగా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ఆ వివరాలు నెలనెలా ప్రభుత్వానికివ్వాలి.. ఇవన్నీ పాటించకుంటే ఇన్నాళ్ళూ వేదికలకు లభించిన మధ్యవర్తి హోదా కోల్పోతారు. అంటే... ఆయా వేదికలపై సందేశాల గురించి వివాదం తలెత్తితే.. ఆయా సంస్థలపై కూడా క్రిమినల్‌, ఇతరత్రా చట్ట పరమైన చర్యకు ఆస్కారం ఉంటుంది.

"ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల వల్ల వాట్సప్‌ రోజువారీ కార్యకలాపాలకు, సామాన్య ప్రజల సందేశాలకు వచ్చిన ముప్పేమీ లేదు. వాటిపై ఎలాంటి ప్రభావం పడదు. ప్రజలందరి వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదే సమయంలో.. దేశ భద్రత, శాంతిభద్రతల నిర్వహణ కూడా ప్రభుత్వ బాధ్యత."

- ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

ధిక్కారం ఆ రూల్‌పైనే.. ఏమిటీ 4(2)?

కేంద్రం జారీ చేసిన కొత్త నిబంధనల్లోని 4(2) నియమం ప్రకారం- ప్రభుత్వ లేదా కోర్టు ఉత్తర్వుల ద్వారా అడిగినప్పుడు... సామాజిక మాధ్యమ సంస్థలు... నిర్దిష్టమైన సందేశం మూలాలను.. అంటే ఎక్కడి నుంచి ఆ సందేశం మొదలైందో తెలియజేయాల్సి ఉంటుంది.

వాట్సప్‌ ఏమంటోంది?

వాట్సప్‌లో చాట్స్‌కు సంబంధించిన ఆనుపానులు చెప్పటమంటే.. మేం ఇక ప్రతి మెసేజ్‌పైనా నిఘావేసి ఉంచాలి. ఇదొకరకంగా మూకుమ్మడిగా అందరిపై నిఘా ఉంచటమే! వినియోగదారుల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు భంగం కల్గించటమే అవుతుంది. ఈ నిబంధన వల్ల ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తంజేసుకోవటానికి జంకుతారు.

ప్రభుత్వ వాదనేంటి?

కేవలం దేశ సార్వభౌమత్వానికి, ప్రజాపాలనకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో మాత్రమే ప్రభుత్వం విచారణ, వివరాలు కోరుతుంది. భావప్రకటన స్వేచ్ఛకు భంగం కల్గించేదిలా ఈ రూల్‌ను చిత్రీకరించటం తప్పుదోవ పట్టించటమే. అమెరికా, యూకేల్లో ఇంతకంటే ఎక్కువ సమాచారాన్ని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

"సామాజిక మాధ్యమ సంస్థలను భయపెట్టడానికి, కట్టడి చేయటానికే కేంద్రం కొత్త ఐటీ నిబంధనలు ప్రవేశపెట్టింది. దేశంలో భావప్రకటన స్వేచ్ఛ నోరునొక్కేయటానికి నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది."

-కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి

"వాట్సప్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. అమెరికా ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. అమెరికా భద్రతా సంస్థలకు వాట్సప్‌ డేటాపై పూర్తి నియంత్రణుంది. మనదేశంలోని కోట్ల మంది డేటా వాట్సప్‌ వద్ద ఉంది. అలాంటప్పుడు ఇక గోప్యత ఎక్కడుంది? ఈ దేశంలో నిబంధనలేం ఉండాలో ప్రైవేటు సంస్థ నిర్ణయిస్తుందా? ప్రభుత్వమా?"

-ఐటీ ప్రముఖుడు మోహన్‌దాస్‌పాయ్‌

ఇవీ చదవండి: కొత్త ఐటీ నిబంధనలపై హైకోర్టుకు వాట్సాప్​

'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

సామాజిక సంస్థలకు కేంద్రం చివరి అవకాశం

Last Updated :May 27, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.