ETV Bharat / bharat

స్మార్ట్​ సిటీలో యువకులకు పెళ్లి కష్టాలు.. నీళ్లే కారణం!

author img

By

Published : Jun 2, 2022, 3:45 PM IST

గ్వాలియర్ వాసులను నీటి కొరత వేధిస్తోంది. తాగేందుకు నీరు దొరకకపోవడం ఒక కష్టమైతే... దీనికి అనుబంధంగా మరో సామాజిక సమస్య వారిని పీడిస్తోంది. నీటి కొరత ఉన్న ప్రాంత యువకులకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు.

water-crisis-in-gwalior
water-crisis-in-gwalior

నీటి కష్టాలు.. యువకులకు నో పెళ్లి

Madhya Pradesh Water crisis: మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్... దేశంలోని దిగ్గజ రాజకీయ నాయకుల స్వస్థలం... సింధియా వంశస్థులు ఏలిన నేల... కానీ అక్కడి సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికీ గుక్కెడు మంచినీరు కోసం అల్లాడాల్సిన పరిస్థితి. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోని ప్రజలు అధికంగా కరవు బారిన పడుతున్నారు. వీటితో పాటు మరో సామాజిక సమస్య ఇక్కడి ప్రజలను వేధిస్తోంది. అతికష్టం మీద మంచినీరు దొరికే ఈ ప్రాంతంలోని యువకులకు పెళ్లి కావడం గగనమైపోతోంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇక్కడి యువకులకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు వెనకాడుతున్నారు.

gwalior water crisis
వాటర్ డ్రమ్ములను తీసుకెళ్తున్న యువకుడు

Gwalior youth marriage problems: గ్వాలియర్ స్మార్ట్ సిటీ, ఆదిత్యాపురంలోని పటేల్ నగర్ ప్రాంతంలో ప్రజలు ఈ అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోని అమృత్ పథకంలో భాగంగా ఇక్కడ నీటి సరఫరా కోసం పైప్​లైన్లు వేశారు. కానీ, కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో వీరికి నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ వాటర్ ట్యాంకర్ 15 రోజులకు ఒకసారి వస్తోందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నీటిని నిల్వ చేసుకొని పరిమితంగా వాడుకుంటున్నా.. 15 రోజుల పాటు ఎలా గడపాలని ఆవేదన చెందుతున్నారు.

gwalior water crisis
ఇంటి ముందు వాటర్ ట్యాంక్

"బయట నుంచి వచ్చినవారు ఇళ్ల ముందు డ్రమ్ములను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నీరు అందుబాటులో లేని ప్రాంత యువకులతో పెళ్లిళ్లు ఎలా జరిపించాలని అడుగుతారు. వివాహం జరిపిస్తే.. నీటిని మోస్తూ డ్రమ్ములు నింపాల్సిందేనా అని ప్రశ్నిస్తారు. ఇదో పెద్ద సమస్యగా తయారైంది. వివాహం విషయంలో కూడా ఇది ఇబ్బందులకు దారితీస్తోంది."

-స్థానికుడు

నీటి సమస్య ఒకఎత్తైతే.. ఇక్కడ పెళ్లిళ్లు జరగకపోవడం మరో సమస్య అని స్థానికులు చెబుతున్నారు. బకెట్లు పట్టుకొని నీటి వేటకు బయల్దేరుతున్న యువకులకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని అంటున్నారు.

gwalior water crisis
స్కూటీపై వాటర్ డ్రమ్మును తీసుకెళ్తున్న యువకుడు

"పదిహేను రోజులకు ఓసారి పెద్ద వాటర్ ట్యాంకు వస్తుంది. నీళ్లు పట్టుకొనేందుకు మహిళలు గొడవపడతారు. అక్కడక్కడా ఆగుతూ వచ్చేసరికి నీళ్లు అయిపోతాయి. రూ.పది లక్షలు ఇచ్చినా యువకులకు పెళ్లిళ్లు జరగడం లేదు."
-స్థానిక మహిళ
"యువత వివాహం గురించి కొందరు జోక్ చేస్తే.. మరికొందరు మాత్రం సీరియస్​గానే చెబుతుంటారు. ఇక్కడి యువకులకు పిల్లను ఇవ్వొద్దనే అంటారు. ఇక్కడ నీళ్లు లేకపోవడమే పెద్ద సమస్య."
-స్థానిక మహిళ

అధికారులతో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు వారు హామీలు ఇస్తారని, అయితే అవి వాస్తవరూపం దాల్చడం మాత్రం గగనమేనని అంటున్నారు.

gwalior water crisis
నీటి డ్రమ్ములు
నగరంలో నీటి సమస్యను తగ్గించేందుకు చేపట్టిన చంబల్ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలన్న ప్రతిపాదన పేపర్​కే పరిమితమైంది. రూ.700 కోట్లు ఖర్చు పెట్టినా.. నీటి సమస్య పరిష్కారం కాలేదని సమాచారం. మరోవైపు, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో విమర్శలు, ప్రతివిమర్శలకు దారితీస్తోంది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్​ నీటి సమస్యపై సరైన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు, భాజపా నాయకులు వీరికి కౌంటర్లు ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.