ETV Bharat / bharat

అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం.. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి

author img

By

Published : Mar 12, 2023, 10:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్​ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. మరోవైపు, కారు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది.

several dead in purvanchal expressway accident
several dead in purvanchal expressway accident

ఉత్తర్​ప్రదేశ్​లోని పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్​ను కారు ఢీకొట్టడం వల్ల ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. మృతులను సైనా ఖటూన్​(37), జమీలా(33), రుస్కార్​(31), సాహిల్​ ఖాన్(19) కారు డ్రైవర్​ షారుక్(25)గా పోలీసులు గుర్తించారు. సుల్తాన్​పుర్​లో ఆదివారం జరిగిందీ ప్రమాదం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్సర్​ కుమారుడు(3 ఏళ్లు) దిల్లీ ఎయిమ్స్​లో చనిపోయాడు. అనంతరం కుమారుడి మృతదేహంతో దిల్లీ నుంచి బిహార్​లోని ససరాంకు కారులో బయలుదేరారు. ఉదయం 11.45 నిమిషాల సమయంలో కారు పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే 183 మైలురాయి వద్ద ఆగి ఉన్న ట్రక్​ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు పోలీసులు.

కారు బోల్తా.. ముగ్గురు మృతి..
రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం సిరోహ్​ జిల్లాలోని బీవార్​-పింద్వారా హైవేపై జరిగిందీ ఘటన.
ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలో పడిపోయిందని వెల్లడించారు. మృతులు చురు జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్, కర్ణి సింగ్, శివశంకర్​ అని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పింద్వారాలోని మార్చురీలో భద్రపరిచామని.. పోస్టుమార్టం పరీక్షల అనంతరం వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు.

పల్లకిపైకి దూసుకెళ్లిన వ్యాన్​..
ఒడిశాలో విషాదం నెలకొంది. మతపరమైన పండుగలో భాగంగా పల్లకిని మోస్తున్న వ్యక్తులను పికప్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటన ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కేంద్రపార జిల్లాలో శనివారం రాత్రి జరిగిందీ ఘటన.
కటక్-చంద్‌బాలి రాష్ట్ర రహదారిపై వేగంగా వచ్చిన పికప్ వ్యాన్ ఐదుగురిని ఢీకొట్టింది. అందులో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మిగతావారిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. క్షతగాత్రులు కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. పికప్ వ్యాన్‌ను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.