ETV Bharat / bharat

పక్కా స్కెచ్​తోనే గోరఖ్​పుర్​ బరిలో యోగి- 62 సీట్లపై భాజపా గురి!

author img

By

Published : Feb 4, 2022, 6:37 PM IST

yogi-from-gorakhpur
పక్కా స్కెచ్​తోనే గోరఖ్​పుర్​ బరిలో యోగి

UP Elections 2022: పక్కా వ్యూహంతోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ గోరఖ్​పుర్​ నుంచి బరిలోకి దిగుతున్నారా? ఈ ప్రాంతంలోని 62 సీట్లు దక్కించుకునేందుకే భాజపా ఈ నిర్ణయం తీసుకుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. 2017లో యోగి ఈ ప్రాంతంలో విస్తృత ప్రచారం చేసి 44 స్థానాల్లో పార్టీని గెలిపించారని.. ఈసారి అంతకుమించిన ఫలితాలు రాబట్టాలనే ఆయనకు అత్యంత ఆదరణ ఉన్న గోరఖ్​పుర్ స్థానాన్ని ఎంపిక చేశారని తెలుస్తోంది. కానీ.. కీలక ఓబీసీ నేతలు భాజపాను వీడాక.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది?

UP Assembly Polls: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​​ గోరఖ్​పుర్ స్థానం నుంచి పోటీ చేయడం భాజపా వ్యూహాత్మక నిర్ణయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఆయనకు విశేష ఆదరణ ఉందని, 62 స్థానాలు కొల్లగొట్టాలనే లక్ష్యంతోనే ఏరికోరి ఈ స్థానాన్ని ఎంపిక చేసిందని చెబుతున్నారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్​ ఈ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయన వల్లే గోరఖ్​పుర్​ సహా చుట్టుపక్కల జిల్లాల్లో 62 స్థానాలకు గానూ భాజాపా 44 స్థానాలు కైవసం చేసుకుందని తెలిపాయి.

అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన నేతలు పార్టీని వీడారు. స్వామి ప్రసాద్ మౌర్య, దారా సింగ్ చౌహాన్​ సమాజ్​వాదీ పార్టీలో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కూటమిలో ఉన్న రాజ్​భర్​ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెగదెంపులు చేసుకున్నారు. మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. అయితే ఓబీసీల్లో మంచి ఆదరణ ఉన్న కాంగ్రెస్​ నేత ఆర్​పీఎన్​ సింగ్ భాజపాలో చేరడం పార్టీకి కలిసొచ్చే అంశం.

Yogi Adithyanath Gorakhpur

మహారాజ్ జీ..

ఆదిత్యనాథ్​ను గోరఖ్​పుర్​ ప్రాంతంలో 'మహారాజ్​ జీ' అని పిలుస్తుంటారు. ప్రఖ్యాత గోరఖ్​నాథ్ ఆలయ మఠాధిపదిగా అయన సేవలందించినందుకే అక్కడ అంత గుర్తింపు. అంతేగాకుండా 1998 నుంచి వరుసగా ఐదు సార్లు గోరఖ్​పుర్​ నుంచే లోక్​సభకు ఎన్నికై సత్తా చాటారు. 2002లో యోగి స్థాపించిన హిందూ యువ వాహిని ప్రభావం కూడా గోరఖ్​పుర్​లో బాగానే ఉంది. అది కూడా భాజపాకు కలిసిరానుంది.

ఇదీ చదవండి: యోగి కోసం రంగంలోకి 'మానసపుత్రిక'.. అప్పుడు భాజపాకు ఝలక్.. ఇప్పుడు..

గోరఖ్​పుర్​ ప్రాంతంలో భాజపా అభ్యర్థుల ఎంపికలో యోగి ప్రమేయం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. భాజపా రాష్ట్ర ఎన్నికల కమిటీలో యోగి సభ్యుడని, అభ్యర్థుల ఎంపిక విషయంలో కచ్చితంగా కీలక పాత్ర ఉందని చెప్పాయి.

ఉత్తర్​ప్రదేశ్‌లో భాజపా తన సంస్థాగత నిర్మాణాన్ని ఆరు భాగాలుగా విభజించింది. అవి వెస్ట్ జోన్, బ్రజ్ ప్రాంతం, కాన్పూర్-బుందేల్‌ఖండ్, అవధ్, కాశీ, గోరఖ్‌పుర్. గోరఖ్​పుర్​ ప్రాంతంలో మొత్తం 10 జిల్లాలు ఉన్నాయి. గోరఖ్​పుర్​ సహా మహారాజ్​గంజ్​, దేవరియా, ఖుషీనగర్​, బస్తి, సంత్ కబీర్​నగర్​, సిద్ధార్థ్​నగర్​, ఆజంగఢ్​, బలియా, మవు ఈ ప్రాంత పరిధిలోకే వస్తాయి. ఆరు, ఏడు దశల్లో మార్చి 3, 7న ఇక్కడ పోలింగ్ జరగనుంది.

UP Assembly Elections 2022

ప్రచారకర్త..

యోగి 2017లో భాజపా ప్రముఖ ప్రచారకర్తగా ఉండటం వల్ల పార్టీకి ఎంతో ప్రయోజనం జరిగిందని, మరీ ముఖ్యంగా గోరఖ్​పుర్​లో ఆయన ప్రభావం అద్భుతమని ఈ ప్రాంత భాజపా ఉపాధ్యక్షుడు సత్యేంద్ర సిన్హా తెలిపారు. ఇప్పుడు గోరఖ్​పుర్​(అర్బన్​) నుంచి ఆయనే స్వయంగా పోటీ చేస్తున్నందున ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

modi with yogi
మోదీతో యోగి

స్వామి ప్రసాద్ మౌర్య ఎస్పీలో చేరడం వల్ల భాజపాకు ఏం నష్టం లేదని, ప్రధాని మోదీ, సీఎం యోగి అభివృద్ధి పనులే పార్టీని గెలిపిస్తాయని భాజపా పంచాయతీ సెల్​ ప్రాంతీయ కోఆర్డినేటర్​ అజయ్ తివారీ అన్నారు.

modi with yogi
మోదీతో యోగి

62 సీట్లకు 44

2017 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్​పుర్​ ప్రాంతంలో 62 స్థానాలకు భాజపా 44 చోట్ల విజయం సాధించింది. ఎస్పీ, బీఎస్పీ ఏడు స్థానాల చొప్పున గెలుచుకున్నాయి. కాంగ్రెస్​, స్వతంత్రులు ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు. అంతేగాక అప్పుడు భాజపా మిత్రపక్షాలుగా ఉన్న సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(SBSP), అప్నా దళ్​(సోనెలాల్​) ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే ఎస్​బీఎస్​పీ ఈసారి ఎస్పీతో జతకట్టింది.

  • గోరఖ్​పుర్​ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్లు 52శాతం
  • ఎస్సీ ఓటర్లు 20శాతం
  • బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి ఉన్నత వర్గాల ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.
  • ఈ ప్రాంతంలోని 15 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఉంటుంది.

UP Politics

బరిలో కీలక నేతలు..

గోరఖ్​పుర్​లోని ముఖ్య స్థానాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా బరిలో ఉన్నారు. మౌర్య(పడ్రౌనా), చౌహాన్​(మధుబన్), అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రామ్​ గోవింద్​ చౌదరి(బాంస్​హీడ్​), రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్​ కుమార్ లల్లు(తమ్​కుహీరాజ్​), బీఎస్పీ నేత ఉమా శంకర్​ సింగ్​(రస్డా), మాఫియా నుంచి రాజకీయ నేతగా మారిన ముఖ్తర్​ అన్సారీ(మవు) ఈ ప్రాంతంలోని వివిధ జిల్లాల నుంచి పోటీ చేస్తున్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్​ కూడా గోరఖ్​పుర్ ప్రాంత పరిధిలోనే ఉంది. అయితే ఆయన మెయిన్​పుర్ జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

గోరఖ్​పుర్​లో మౌర్య, కుశ్వాహా, నోనియా-చౌహాన్​ వర్గాల ఓట్లు కూడా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. అందుకే ఎస్పీ తమకు స్వామిప్రసాద్ మౌర్య, దారా చౌహన్​లున్నారనే ధైర్యంతో భాజపాకు సవాల్ విసురుతోంది.

ఎస్పీ ఏమంటోంది?

ఈసారి గోరఖ్​పుర్​లో భాజపా దారుణ పరాభవం చవి చూస్తుందని ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జియాల్​ ఇస్లాం ధీమగా చెబుతున్నారు. ఆ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసిందని, రైతులు, యువత, దళితులు, వెనకబడిన వర్గాలు, మైనారిటీలను పట్టించుకోలేదని ఆరోపించారు.

ఎస్పీ హయాంలో జరిగిన అభివృద్ధి, మౌర్య, చౌహాన్ వంటి నాయకుల బలంతో తమ పార్టీ గోరఖ్​పుర్​ ప్రాంతంలో అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పడ్రౌనా నియోజకవర్గం నుంచి కుర్మీ సామాజిక వర్గానికి చెందిన ఆర్​పీఎన్ సింగ్​ను బరిలోకి దించడం వల్ల ఓబీసీల మద్దతు తిరిగి పొందగలమని భాజపా విశ్వాసంతో ఉంది. సింగ్ కాంగ్రెస్ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఖుషీనగర్​ నుంచి ఎంపీగా గెలిచారు. పడ్రౌనా నుంచి ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు. పూర్వాంచల్​ ప్రాంతంలో సీనియర్ నాయకుడు. దీంతో ఇవన్నీ తమకు అనుకూలంగా మారతాయని కమలం పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్​ ఏమంటోంది?

భాజపా అంచనాలు ఈసారి తలకిందులు అవుతాయని యూపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విశ్వవిజయ్ సింగ్​ పేర్కొన్నారు. గోరఖ్​పుర్​ ప్రాంతానికి చెందిన ఈయన.. యోగి ఆదిత్యనాథ్​, ఆర్​పీఎన్ సింగ్​ ఓటర్లను ప్రభావితం చేయలేరని అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల కాలంలో యువతను నిర్లక్ష్యం చేయడమే గాక నిరుద్యోగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రియాంక గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. ఈసారి కాంగ్రెస్​ ప్రభావం ఉంటుందని చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు.

ఇదీ చదవండి: 30 పార్టీలతో కలిసి యోగిని ఢీకొడుతున్న 'భీమ్ ఆర్మీ' ఆజాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.