ETV Bharat / bharat

30 పార్టీలతో కలిసి యోగిని ఢీకొడుతున్న 'భీమ్ ఆర్మీ' ఆజాద్

author img

By

Published : Jan 25, 2022, 4:56 PM IST

UP assembly election 2022: దళిత ఉద్యమంలో ఆయనొక సంచలనం. ఒక్క పిలుపునిస్తే గంటల్లో వేల సంఖ్యలో కదిలే అనుచరులు ఆయన సొంతం. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఎన్నిసార్లు జైలులో పెట్టినా భయపడకుండా.. ప్రజా ఉద్యమాలతో ముందుకుసాగారు. ఆయనే భీమ్​ ఆర్మీ చీఫ్​, ఆజాద్​ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్. మొదటిసారి ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా గోరఖ్​పుర్ స్థానం నుంచి పోటీ చేస్తూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్​ను ఢీకొనబోతున్నారు. ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఎలా ముందుకుసాగుతున్నారు? ఎస్పీతో పొత్తు ఎందుకు చెడింది? 30 పార్టీలతో ఆయన ప్రకటించిన కూటమి విజయం సాధిస్తుందా? ఆయన ఇంత పాపులర్​ కావడానికి కారణాలు ఏంటి?

up assembly election 2022
30 పార్టీలతో​ కూటమి

"యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నేను గెలవడం ముఖ్యం కాదు.

సీఎం యోగి ఆదిత్యనాథ్​ను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం ముఖ్యం.

అందుకే ఆయన పోటీ చేసే స్థానం కోసం ఎదురు చూసున్నా."

సరిగ్గా ఏడాది క్రితం.. యూపీ అసెంబ్లీ ఎన్నికలు, సీఎం యోగి ఆదిత్యనాథ్​పై పోటీ చేయడంపై దళిత నాయకుడు, భీమ్​ ఆర్మీ చీఫ్​ చంద్రశేఖర్​ ఆజాద్​ చెప్పిన మాటలు ఇవి.

UP assembly election 2022: నాడు చెప్పిన విధంగానే ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగుతున్నట్లు భాజపా స్పష్టం చేసిన వెంటనే.. తానూ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు భీమ్ ఆర్మీ చీఫ్​, ఆజాద్​ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్. దీంతో అయన ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు.

30 చిన్న పార్టీలతో జట్టు కట్టి.. 'సామాజిక్​ పరివర్తన్​ మోర్చా' పేరుతో కూటమిని ఏర్పాటు చేసి.. అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపాపై సమరశంఖం పూరించారు ఆజాద్.

వాస్తవానికి 2019 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని ఆజాద్​ అనుకున్నారు. దళితుల ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు.. పోటీకి దూరంగా ఉన్నారు. ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఏది ఏమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఆజాద్​.

ఉద్యమాలతో గుర్తింపు.

  • దళిత, ప్రజా ఉద్యమాలతో ఆజాద్​ ఎంతో గుర్తింపు పొందారు. 2014లో భీమ్ ఆర్మీని స్థాపించి.. దళితుల కోసం ఉచిత పాఠశాలలను నడుపుతున్నారు.
  • సహరన్‌పుర్ ఘటనలో దళితుల తరఫున నిలబడ్డారు. అ సమయంలో చంద్రశేఖర్‌ను జాతీయ భద్రతా చట్టం కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ ఘటనతో ఆజాద్​ దేశవ్యాప్తంగా దళిత నాయకుడిగా గుర్తింపు పొందారు. బెయిల్​పై బయటకు వచ్చినా.. వేరే కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
  • ఉత్తర్​ప్రదేశ్‌లోని హాథ్రస్​కు చెందిన 19 ఏళ్ల యువతి హత్యాచార కేసులోని దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఆజాద్​. ఏకంగా అమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఎందుట అందోళనకు దిగారు. ఆజాద్​ ఆందోళన దేశ రాజధానిలోని పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. నిరసనలో భాగంగా ఆయనకు జైలుకు కూడా వెళ్లారు.
  • సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాపంగా జరిగిన ఉద్యమాలకు భీమ్​ ఆర్మీ తరఫున మద్దతు ఇచ్చారు. అందులో భాగంగా హైదరాబాద్​ వచ్చిన అజాద్​ను పోలీసులు అరెస్టు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనల విషయంలో ఆజాద్​ను దిల్లీలో అడుగు పెట్టనివ్వకుండా ఉండేందుకు ఆయనపై ఆంక్షలు విధించారు.
  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో రైతు సంఘం నాయకుడు రాకేశ్​ టికాయిత్​కు మద్దతు నిలిచారు అజాద్​.

భీమ్ ఆర్మీ స్థాపించిన అనతి కాలంలోనే చంద్రశేఖర్​ చాలా పాపులర్​ అయ్యారు. అయన సభ పెడితే.. దిల్లీలో గంటల తరబడి అనుచరులు వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పిలుపునిస్తే.. వేల సంఖ్యలో జనం గుమిగూడిన రోజులు ఎన్నో ఉన్నాయి.

టైమ్ మేగజైన్​లో చోటు..

'2021 టైమ్ 100 నెక్స్ట్​' పేరుతో ప్రఖ్యాత టైమ్ మేగజైన్ రూపొందించిన జాబితాలో భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చోటు సంపాదించారు. విద్య పేదరికాన్ని జయిస్తుందని నమ్మి.. దళితుల కోసం భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పాఠశాలలు నడపడం.. కుల హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.. హాథ్రస్​లో దళిత యువతిపై గ్యాంగ్​రేప్ కేసులో న్యాయం కోసం పోరాడిన నేపథ్యంలో అజాద్​కు ఈ గౌరవం లభించినట్లు టైమ్స్​ పేర్కొంది.

ఇలా ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆజాద్​ పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలో యూపీ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొనాలని భావించి.. ఆజాద్​ సమాజ్ పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా 30 చిన్న పార్టీలతో జట్టు కట్టారు.

''ఉత్తర్​ప్రదేశ్​లో పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు రావని.. మాకు అనుభవం ద్వారా తెలిసింది. అందుకే 30 చిన్న పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మేము చిన్న పార్టీలను కలుపుకుని సామాజిక్​ పరివర్తన్​ మోర్చా కూటమిని ఏర్పాటు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాం."

-చంద్రశేఖర్ ఆజాద్, ఆజాద్​ సమాజ్ పార్టీ అధ్యక్షుడు

తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్​తో సంప్రదింపులు జరపగా.. చర్చలు సఫలం కాలేదు. దీంతో వెనక్కి తగ్గిన ఆజాద్​ సొంతంగా కూటమిని ఏర్పాటు చేశారు. అయితే అఖిలేశ్​పై తమ అభ్యర్థిని మాత్రం నిలబెట్టబోమని ప్రకటించారు.

"అఖిలేశ్​పై నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఆయన నాకు అన్నయ్య లాంటి వారు. ఆయనపై ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టను.

పొత్తు గురించిన సమాచారం తెలిశాఖ వామపక్ష నేతలు కూడా మాతో కలవడానికి ముందుకొచ్చారు. సామాజిక్ ​పరివర్తన్ మోర్చా.. చిన్న నదులను కలుపుకొని.. సముద్రంగా మారబోతుంది."

- చంద్రశేఖర్ ఆజాద్, ఆజాద్​ సమాజ్ పార్టీ అధ్యక్షుడు

లోక్‌తాంత్రిక్ సురక్షా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, భారతీయ వీర్ దళ్, న్యాయ్ పార్టీ ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిథ్యం వహించే పార్టీలు సామాజిక పరివర్తన్​ మోర్చాలో ఉన్నాయి.

ఇదీ చూడండి: UP assembly elections : 159 మంది అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.