ETV Bharat / bharat

కాంగ్రెస్ చరిత్రలోనే చెత్త రికార్డు​- 97% అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు!

author img

By

Published : Mar 13, 2022, 6:19 PM IST

UP assembly election 2022
UP assembly election 2022

UP election 2022: ఇటీవల జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండే స్థానాలకే పరిమితమై పేలవ ప్రదర్శన చేసిన కాంగ్రెస్​.. అదే ఎన్నికల్లో మరోచెత్త రికార్డు నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 97 శాతం మంది హస్తం పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత స్థానంలో బీఎస్​పీలో 72 శాతం మంది డిపాజిట్లు కోల్పోయి.. అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు.

UP election 2022: స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్​ వరకు దాదాపు అన్ని ఎన్నికల్లోనూ భాజపా దూసుకుపోతుంటే.. ప్రత్యర్థి కాంగ్రెస్​ మాత్రం అందుకు విరుద్ధంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. దాదాపు 70 ఏళ్లు దేశంలో చక్రం తిప్పిన హస్తం పార్టీ.. ఇప్పుడు ఘోర పరాభవాన్ని చవిచూస్తోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే పునరావృతం​ అయింది. ముఖ్యంగా.. ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్ అభ్యర్థులు రికార్డు స్థాయిలో డిపాజిట్​ కోల్పోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దపడుతోంది.

కాంగ్రెస్​ 97 శాతం

399 స్థానాల్లో కాంగ్రెస్​ తమ అభ్యర్థులను బరిలో దించగా.. 387 (97శాతం) మందికి దరావతు కూడా దక్కలేదు. రెండు స్థానాల్లో అతి స్వల్ప అధిక్యంతో గెలిచింది. మొత్తంగా కాంగ్రెస్‌కు 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీలో హస్తం పార్టీ ఇంతటి ఘోర పరాజయాన్ని ఎన్నడూ చూడలేదు. ఏ స్థానంలోనైనా డిపాజిట్ కాపాడుకోవాలంటే అభ్యర్థి మొత్తం ఓట్లలో 16.66శాతం పొందాలి.

బీఎస్పీ 72 శాతం

అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బరిలోకి దిగిన బహుజన్​ సమాజ్​​ పార్టీ(బీఎస్​పీ) కేవలం ఒక్కటంటే ఒకే స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి చెందిన 290 (72 శాతం)మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

ఎస్​పీ కూటమిలో ఎంతమందంటే..?

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్​పీ) 347 మంది అభ్యర్థులను ఎన్నికల బరిలోకి ఉంచగా.. వారిలో ఆరుగురు అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఎస్​పీ మిత్రపక్షమైన సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, అప్నాదళ్​ (కామెరవాదీ) మొత్తం 25 మంది అభ్యర్థులను నిలబెట్టగా.. అందులో 8 మంది డిపాజిట్లు కోల్పోయారు.

భాజపాలో ముగ్గురే

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారాన్ని నిలబెట్టుకుంది భాజపా. 376 స్థానాల్లో భాజపా తమ అభ్యర్థులను బరిలోకి ఉంచగా.. ముగ్గురు మాత్రమే డిపాజిట్లు కోల్పోయారు. అయితే భాజపా మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్​), నిషాద్ పార్టీ అభ్యర్థులలో ఒక్కరు కూడా తమ డిపాజిట్లను కోల్పోలేదు.

ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసింది భాజపా. 403 నియోజకవర్గాలకుగానూ 255 స్థానాలను కైవసం చేసుకుంది. 125 సీట్లు దక్కించుకున్న ఎస్పీ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

ఇదీ చూడండి: పంజాబ్​లో 'ఆప్' మార్క్.. వారికి భద్రత కట్.. ప్రజాసేవకు వందలాది పోలీసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.