ETV Bharat / bharat

పశ్చిమ యూపీలో వ్యతిరేక పవనాలు- భాజపా గట్టెక్కేనా?

author img

By

Published : Feb 4, 2022, 1:51 PM IST

UP Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ముఖ్యంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. యూపీలో అన్నదాతల ఆగ్రహంతో భాజపాకు కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. లఖింపుర్​ ఖేరీ ఘటన కూడా వారికి ప్రతికూలాంశమే. అందుకే.. హిందువుల ఓట్లను సంఘటితం చేసుకునేందుకు ఎన్నికల ప్రచారంలో కైరానా వలసలు, మథుర వంటి మతపరమైన అంశాల ప్రస్తావన తీసుకొస్తోంది భాజపా.

UP Election 2022

UP Election 2022: శ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి! 2013 నాటి ముజఫర్‌నగర్‌ అల్లర్లు, 2014-16 మధ్యకాలంలో కైరానా నుంచి హిందువుల వలసలు, శ్రీకృష్ణ జన్మభూమి (మథుర), దేవ్‌బండ్‌లో ఉగ్ర నిరోధక దళం-ఏటీఎస్‌ కేంద్రానికి శంకుస్థాపన (జాతీయభావాన్ని ప్రస్తావించేందుకు వీలుగా) వంటి అంశాలను భాజపా నేతలు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తద్వారా హిందువుల ఓట్లను తమకు అనుకూలంగా సంఘటితం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

భాజపా ప్రచారాస్త్రాలు అవే..

ముస్లింలు భయభ్రాంతులకు గురిచేస్తుండటంతో హిందువులు వలసబాట పడుతున్నారని కైరానా మాజీ ఎంపీ హుకుం సింగ్‌ (భాజపా) చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనం సృష్టించాయి. జాట్లు, ముస్లింల మధ్య చీలిక తీసుకురావడం, హిందువుల ఓట్లను తమవైపు తిప్పుకోవడమే అప్పట్లో ఆయన ప్రధాన ఉద్దేశం! కానీ మెల్లగా అది శాంతిభద్రతలకు సంబంధించిన అంశంగా మారిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కమలనాథులు ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జాట్లు, ముస్లింలు ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి వైపు మొగ్గకుండా చూడాలన్నదే వారి అభిమతమని అర్థమవుతోంది! కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కైరానా వలసల ప్రభావిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి ప్రజలు ఇంకెంతమాత్రమూ భయంభయంగా జీవించాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మరో అడుగు ముందుకేసి.. ''వాళ్లు ఇక్కడ కైరానా ద్వారా కశ్మీర్‌ను సృష్టించాలని కలలు కంటున్నారు'' అని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Farmers Protest: అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం

వివాదాస్పద సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 700 మందికి పైగా రైతులు అసువులు బాశారు. ఆ విషయాన్ని అన్నదాతలు అంత త్వరగా మర్చిపోరు. లఖింపుర్‌ ఖేరీలో తమ సహచరులను అత్యంత కర్కశంగా కారుతో తొక్కించి చంపిన వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రపై మోదీ సర్కారు చర్యలేవీ తీసుకోకపోవడంపై కూడా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కైరానా వలసలు, మథుర వంటి మతపరమైన అంశాల ప్రస్తావనతో వారి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. అయితే, భాజపా ప్రయత్నాలు అంతగా సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అలా చీలితే.. భాజపాకు లాభమే

ముస్లిం అభ్యర్థులు అధిక సంఖ్యలో ఎన్నికల బరిలో దిగడం కమలదళానికి సానుకూల పరిణామంలా కనిపిస్తోంది. ఈ నెల 10న తొలి విడతలో పోలింగ్‌ జరిగే పశ్చిమ యూపీ జిల్లాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. దీంతో ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ, బీఎస్పీ, ఎంఐఎంల తరఫున ఆ సామాజికవర్గం నుంచి పలువురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తొలి విడతలో పోలింగ్‌ జరగనున్న 58 స్థానాలకుగాను.. ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి 13 చోట్ల, బీఎస్పీ 17 సీట్లలో ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించాయి. 8 స్థానాల్లో ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ, బీఎస్పీ రెండూ ఆ వర్గంవారినే పోటీలో నిలిపాయి. ఇది ముస్లిం ఓట్ల చీలికకు కారణమై.. భాజపాకు లబ్ధి చేకూర్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ముస్లింలు బీఎస్పీ వైపు మొగ్గితే.. ఓబీసీల ఓట్లను సంఘటితం చేయగలిగినా ఎస్పీకి పెద్దగా ఒనగూడే ప్రయోజనమేమీ ఉండదు! ప్రస్తుతం చాలామంది మాయావతి పార్టీని (బీఎస్పీ) భాజపా బి-జట్టుగా చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా.. ఓట్లను చీల్చడం ఎస్పీని ఆ పార్టీ దెబ్బకొడుతుందన్న విశ్లేషణలున్నాయి. 2017 ఎన్నికల్లో అలాంటి చీలికే భాజపాకు వరంగా మారింది.

'భాజపా అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య ఎన్నికలివి'

యూపీ అసెంబ్లీ బరిని భాజపా అనుకూల, వ్యతిరేక ఓటర్ల మధ్య జరిగే ఎన్నికలుగా రైతు నాయకుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) మీడియా వ్యవహారాల బాధ్యుడు ధర్మేంద్ర మాలిక్‌ ఇటీవల అభివర్ణించారు. సాగుచట్టాలపై సుదీర్ఘంగా సాగిన పోరాటం- అన్నదాతలను భాజపాకు దూరం చేసిందని పేర్కొన్నారు. అది నిజమే అయితే.. పశ్చిమ యూపీలో 2017 నాటి ఫలితాలను భాజపా పునరావృతం చేయడం అసాధ్యం! నాటి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మొత్తం 70కిగాను 51 స్థానాలను కమలనాథులు దక్కించుకున్నారు. ప్రస్తుతమిక్కడ మెజార్టీ సీట్ల సాధనలో విఫలమైతే.. భాజపాకు, ఆ పార్టీలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్‌ షాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే.

ఇవీ చూడండి: UP Election 2022: హత్యలు, అత్యాచార కేసుల నిందితులే అభ్యర్థులు!

Anupriya Patel: 'అభివృద్ధికే పట్టం- మళ్లీ మాదే అధికారం'

UP Polls 2022: నామినేషన్​ దాఖలు చేసిన సీఎం యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.