ETV Bharat / bharat

'హిందువా.. ముస్లిమా అనవసరం- మేజర్లా.. కాదా?'

author img

By

Published : Nov 24, 2020, 5:57 PM IST

love jihad case
లవ్‌ జిహాద్‌

దేశవ్యాప్తంగా లవ్‌ జిహాద్‌, మతాంతర వివాహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఉత్తర్​ప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివాహాల్లో హిందువా, ముస్లిమా అనేది న్యాయస్థానం చూడదని.. కేవలం వారు మేజర్లా? కాదా? అనేదే ముఖ్యమని తెలిపింది. మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని పేర్కొంది.

ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని ఏ వ్యక్తి గానీ, కుటుంబం గానీ, రాష్ట్రం గానీ వ్యతిరేకించకూడదని స్పష్టం చేసింది యూపీ అలహాబాద్​ హైకోర్టు. వివాహాల్లో మతానికి న్యాయస్థానం ప్రాధాన్యం ఇవ్వదని.. వాళ్లు మేజర్లా కాదా అనేదే ముఖ్యమని తెలిపింది. హిందూ యువతిని వివాహమాడిన ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసుపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించింది.

యూపీలోని కుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ.. అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు మతం మారిన ప్రియాంక తన పేరును కూడా ఆలియాగా మార్చుకున్నారు. కాగా.. ఈ పెళ్లిపై ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ అయిన తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి జరిపించారంటూ సలామత్‌, మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టారు. దీంతో సలామత్‌.. ప్రియాంక దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు కొట్టేసి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

కొట్టేసిన కోర్టు..

సలామత్‌ పిటిషన్‌పై అలహాబాద్‌ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. వివాహ సమయంలో ప్రియాంక అలియాస్‌ ఆలియా వయసు 21 అయినందున ఆమె మైనర్‌ కాదని పేర్కొంది. అలియా తన భర్తతో కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి కల్పించింది. అంతేగాక, ఈ కేసులో పోస్కో చట్టం వర్తించదని చెప్పిన న్యాయస్థానం.. సలామత్‌, ఇతరులపై ఉన్న కేసును కొట్టివేసింది.

మేజర్లయితే చాలు..

మేజర్లయిన ఇద్దరు వ్యక్తులు తమ అభీష్టం మేరకు బంధం ఏర్పరుచుకోవచ్చని, ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. అలా చేస్తే వారి హక్కులను భంగపరిచినట్లేనని చెప్పింది. మత మార్పిడి వివాహాల చెల్లుబాటుపై తాము ఇప్పుడు స్పందించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో హిందువా.. ముస్లిమా అనేది చూడమని, వారు మేజర్లా కాదా అనేదే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.

కొన్ని రోజులుగా మతాంతర వివాహాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్, యూపీ, హరియాణా లాంటి రాష్ట్రాలు ఏకంగా లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని యోచనలో ఉన్నాయి.

ఇదీ చూడండి: ఇది భర్త కోసం భార్య నిర్మించిన తాజ్​ మహల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.