ETV Bharat / bharat

బడ్జెట్ సమావేశాలకు అంతా రెడీ.. అదానీ ఇష్యూపై విపక్షాల గురి

author img

By

Published : Jan 30, 2023, 7:24 PM IST

union budget session 2023
union budget session 2023

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. మంగళవారం సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆదానీ గ్రూప్​పై వచ్చిన ఆరోపణలు, చైనా దురాక్రమణ, బీబీసీ డాక్యుమెంటరీ వంటి అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు, ఈ సమావేశాల్లో 36 బిల్లులు ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్.. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను సభ ముందుంచనున్నారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాల కోసం ఉభయ సభలు మార్చి 12న భేటీ కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్ 6 వరకు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో 27సార్లు ఉభయసభలు భేటీ కానున్నాయి. ఈ సెషన్​లో 36 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, అదానీ గ్రూపుపై హిండెన్​బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఆయా అంశాలపై చర్చించాలని..కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. నియమనిబంధనలకు లోబడి సభాపతి అనుమతించే ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధమని మోదీ సర్కార్‌ ప్రకటించింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు లైబ్రరీ హాలులో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మినహా 27 పార్టీలకు చెందిన 37 మంది నాయకులు హాజరయ్యారు. భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ కోసం కశ్మీర్ వెళ్లిన కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి లేఖ పంపారు.

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలువురు మంత్రులు కేంద్రం తరపున భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణకు సంబంధించి సమావేశాల్లో చర్చించాలని బీఎస్పీ ప్రతినిధులు కోరగా.. భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలు సభలో చర్చించలేమని ప్రభుత్వం స్పష్టంచేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ వెల్లడించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని ఆమ్‌ ఆద్మీ సభ్యుడు సంజయ్‌ సింగ్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే, వామపక్షాలు, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి.

"స్టాక్‌మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని ఒక కార్పొరేట్‌ సంస్థకు సంబంధించి బయటకు వచ్చిన నివేదిక దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశం. ఎల్‌ఐసీ, ఎస్బీఐలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయి. స్టాక్‌ మార్కెట్లోనూ అవి ఎక్కువ నష్టపోవడం ఆందోళనకరం. గవర్నర్‌ల తీరుపై అనేక రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కొందరు గవర్నర్లు టీవీ డిబేట్లలో కూర్చుని కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వివాదం సృష్టిస్తున్నారు. అది దృష్టిసారించాల్సిన అంశం."
-ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ (ఉద్ధవ్ వర్గం)

నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులకు సంబంధించిన సమస్యలు, బీబీసీ డాక్యుమెంటరీ వంటి అంశాలను సైతం చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. 'నిరుద్యోగ సమస్యను చాలా మంది ప్రస్తావించారు. బీబీసీ డాక్యుమెంటరీ కూడా ప్రధాన సమస్యే. దాన్ని ఎందుకు నిషేధించాల్సి వచ్చింది. ఈ సంఘటనలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నిటిపైనా చర్చించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కోరాయి' అని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ ఝా తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జేడీయూ, ఆర్జేడీ, వైకాపా.. తదితర పార్టీలు కోరాయి. బీజేడీ, బీఆర్ఎస్, తృణమూల్‌ తదితర పార్టీలు ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశాయి. 'ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బిజూ జనతా దళ్‌ ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి మేం ప్రయత్నిస్తాం. కలిసి వచ్చే పార్టీలతో ఏకాభిప్రాయం సాధించి బిల్లు ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని బీజేడీ సభ్యుడు సస్మిత్‌ పాత్ర అన్నారు.

'అన్ని అంశాలపై చర్చిద్దాం!'
విపక్షాల డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు. ఉభయసభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. 'గతంలో శీతాకాల సమావేశాలు జరిగినప్పుడు రెండు స్వల్పకాలిక చర్చలు నిర్వహించాం. అనుబంధ పద్దులపైనా విపక్షాలతో కలిసి చర్చ జరిపాం. 12, 13 గంటలు చర్చించాం. అప్పుడు అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ఈసారి కూడా చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం. నియమ నిబంధనల ప్రకారం సభాపతి అనుమతించే ఏ అంశంపైనా అయినాసరే చర్చకు మాకు ఎలాంటి అభ్యంతరంలేదు' అని ప్రహ్లాద్‌ జోషి స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.