ETV Bharat / bharat

నిరుద్యోగులకు నిర్మలమ్మ గుడ్​న్యూస్​.. 38,800 టీచర్ జాబ్స్ భర్తీ

author img

By

Published : Feb 1, 2023, 11:58 AM IST

Updated : Feb 1, 2023, 2:50 PM IST

union budget of india 2023
భారత యూనియన్ బడ్జెట్ 2023

నూతన బడ్జెట్‌లో కేంద్రం విద్యా, నైపుణ్యాలకు పెద్దపీట వేసింది. పరిశ్రమల అవసరాల మేరకు యువతకు మూడేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్ యోజన 4.0ను ప్రవేశ పెట్టనుంది. చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనుంది. ఫార్మారంగంలో పరిశోధనలకు పెద్దపీట వేయడం సహా.. ఐసీఎమ్​ఆర్​ ల్యాబ్‌లలో పరిశోధనలకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు అనుమితివ్వనున్నారు. సికెల్‌సెల్‌ ఎనిమాయాను 2047 నాటికి నిర్మూలించే మిషన్‌ను కేంద్రం ప్రారంభించనుంది.

విద్యారంగానికి 2023-24 బడ్జెట్‌లో.. ఆర్థికమంత్రి లక్షా 12 వేల 899 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరం లక్షా 4 వేల 278 కోట్లు కేటాయించినా తర్వాత 99 వేల 881 కోట్లకు సవరించారు. విద్యాబోధనలో నూతన విధానాలు సహా.. పరిశ్రమల అవసరాలకు తగినట్లు యువతను తీర్చిదిద్దేందుకు నూతన కోర్సులు, నైపుణ్యాల పెంపునకు కృషిచేయనున్నట్లు స్పష్టంచేశారు.

ముఖ్యాంశాలు..

  • 740 మోడల్‌ ఏకలవ్య పాఠశాలల్లోని.. 3.5 లక్షల గిరిజన విద్యార్థులకు బోధించేందుకు 3,800 ఉపాధ్యాయులు, సహాయ సిబ్బంది భర్తీ
  • ఉన్నత విద్యాసంస్థల్లో కృత్రిమ మేథకు సంబంధించిన మూడు కేంద్రాలు ఏర్పాటు
  • వృత్తి నైపుణ్యాలు, ఇన్‌ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ విధానాలను పెంచే విధంగా నవీన పద్దతుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ
  • జిల్లా విద్యాశిక్షణా సంస్థలను ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా అభివృద్ధి

కొత్త అవకాశాలను కల్పన, నూతన వ్యాపార పద్దతులు, ఉద్యోగాలు సృష్టించేలా 5జీ సర్వీసులను ఉపయోగించుకుని యాప్‌లను అభివృద్ధి చేసేందుకు ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల్లో వంద ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, సమతుల్య సాగు, రవాణా వ్యవస్థలకు సంబంధించిన యాప్‌లు కూడా వీటి ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

వైద్య రంగానికి..
వైద్య రంగానికి కూడా ఈసారి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యం ఇచ్చారు. 88 వేల 956 కోట్ల రూపాయలు కేటాయించారు. గతేడాది 86 వేల 606 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించి తర్వాత 77 వేల 351 కోట్లకు సవరించారు.

  • 2014 నుంచి ఏర్పాటు చేసిన 157 వైద్య కళాశాలలకు అనుబంధంగా 157 నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు
  • ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో బోధనా సిబ్బందికి ఎంపిక చేసిన ఐసీఎమ్​ఆర్​ ల్యాబ్‌లలో పరిశోధన చేసేందుకు అనుమతి
  • పరిశోధనల, ఆవిష్కరణలకు ప్రైవేటు బృందాలను ప్రోత్సహం
  • వైద్య సంస్థల్లో భవిష్యత్‌ మెడికల్ టెక్నాలజీ, ఉత్తమ ఉత్పత్తులు, పరిశోధనలకు అవసరమైన నిపుణుల కోసం మెడికల్ డివైస్‌లను ఉపయోగించడంలో వివిధ కోర్సులను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.
  • 2047 నాటికి సికెల్‌సెల్‌ ఎనిమియా వ్యాధిని నిర్మూలించేందుకు మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఏజన్సీ ప్రాంతాల్లో సున్నా నుంచి 40 ఏళ్ల వయసున్న 7 కోట్ల మంది గిరిజనులకు పరీక్షలను నిర్వహిస్తామన్నారు. వ్యాధిపై అవగాహన కౌన్సిలింగ్‌ ఇస్తామని వివరించారు. ఫార్మారంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ద్వారా ప్రమోట్‌ చేయనున్నట్లు ఆర్థికమంత్రి వివరించారు. ప్రాధాన్య రంగాల్లో పరిశోధనా, అభివృద్ధి కోసం పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.

యువత నైపుణ్యాభివృద్ధికి..
యువత సాధికారత, ఉద్యోగాల సృష్టికి వచ్చే మూడేళ్ల పాటు లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్ యోజన-4.0ను అమలుచేస్తామని ప్రకటించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లు యువతకు ఇచ్చే ఉద్యోగ శిక్షణలో పరిశ్రమలను భాగస్వామ్యం చేయనున్నట్లు చెప్పారు. ఈ శిక్షణలోకోడింగ్, కృత్రిమ మేథ, రోబోటిక్, ఎలక్ట్రానిక్స్‌, త్రీడీ ప్రింటింగ్‌, డ్రోన్ టెక్నాలజీ వంటి కొత్త తరం కోర్సులు ఉంటాయన్నారు.

యువతకు అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్‌ అప్రెంటైజ్‌షిప్‌ ప్రమోషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 47 లక్షల మంది యువతకు స్టైపెండ్‌ను 3ఏళ్ల పాటు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.

Last Updated :Feb 1, 2023, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.