ETV Bharat / bharat

విద్యార్థుల కుటుంబాలకు టీచర్ల అండ- 150 ఇళ్లు కట్టించి ఫ్రీగా...

author img

By

Published : Sep 19, 2021, 6:09 PM IST

Kerala teachers
కేరళ టీచర్లు

పాఠాలు చెప్పడమే వృత్తిగా భావించలేదు. విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు తమ వంతు సాయంగా వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు కేరళకు(Kerala Teacher News) చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు. ఓ ప్రాజెక్టు ప్రారంభించి ఏకంగా 150 ఇళ్లు కట్టించారు. ఎంతో మంది విద్యార్థులు కుటుంబాలకు వసతి కల్పించి ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచారు.

విద్యార్థుల కోసం శ్రమిస్తోన్న ఆదర్శ ఉపాధ్యాయులు

ఇద్దరు సామాన్యులు.. నెల జీతంపైనే ఆధారపడే ఉపాధ్యాయులు.. అలాంటి వారు ఏకంగా 150 కుటుంబాల్లో వెలుగు నింపారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా.. వారి కష్టాలు తీర్చేందుకు తమవంతు సాయం చేస్తున్నారు కేరళ(Kerala Teacher News) కొచ్చికి చెందిన సిస్టర్​ లిస్సీ ఛక్కలక్కల్​, లిల్లీ పాల్​. సరైన ఆవాసం లేని వారికి 'హౌస్​ ఛాలెంజ్​ ప్రాజెక్ట్​'తో ఇళ్లు కట్టించి.. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఓసారి పాఠశాలలోని ఓ విద్యార్థి కుటుంబం కనీస వసతులు లేకుండా జీవిస్తోందని తెలిసి చలించిపోయారు. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. వాటితో ఓ ఇల్లు నిర్మించి ఆ విద్యార్థికి ఇచ్చారు. అంతటితో వారు ఆగిపోలేదు. ఆ తర్వాత.. అలాంటి కష్టాలు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం 'హౌస్​ ఛాలెంజ్​ ప్రాజెక్ట్​'ను తమ భుజాల మీద వేసుకున్నారు. 2014లో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఇప్పటివరకు 150 ఇళ్లు నిర్మించారు. అనేక మంది విద్యార్థుల కుటుంబాలకు వసతి కల్పించి తమ ఉదార స్వభావాన్ని, అంకిత భావాన్ని చాటుకున్నారు.

kerala teachers
150 ఇళ్లు కట్టించిన ఉపాధ్యాయురాళ్లు

"కనీస అవసరాలు లేని విద్యార్థులకు ఇళ్లు కట్టేందుకు ఈ హౌస్​ ఛాలెంజ్ ప్రాజెక్టు ప్రారంభించాం. సమాజంలో నిరాశ్రయులు ఉండకూడదనేదే మా లక్ష్యం. ఇప్పటివరకు 150 ఇళ్లు నిర్మించాం. ప్రస్తుతం చాలా మంది భూమి దానం చేస్తున్నారు. ఆరంభంలో ఇంటి స్థలమున్న వారికే ఇళ్లు నిర్మించేవాళ్లం. తర్వాత ఇంటి స్థలం కూడా లేనివారు చాలా మంది ఉన్నారని గుర్తించాం. అందుకే దాతల కోసం ఎదురుచూస్తున్నాం. భూమి దానం చేసేవారు దొరికితే.. నిరాశ్రయులుండకూడదనే మా లక్ష్యం నెరవేరుతుంది."

--సిస్టర్ లిస్సీ ఛక్కలక్కల్, ఉపాధ్యాయురాలు.

ఇంటికి స్థలం ఇవ్వాలని కోరుతూ చాలా మంది వ్యాపారవేత్తలను, ఇతర ప్రముఖులను కలిసినట్లు చెప్పారు సిస్టర్ లిస్సీ. తాము నిర్మించిన ఒక్కో ఇంటికి రూ. 6 నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 80 మంది విద్యార్థులకు ఆవాసం కల్పించినట్లు పేర్కొన్నారు.

kerala teachers
విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపిన టీచర్లు

రంజీన్​ వర్గీస్​ అనే ఓ దాత 70 సెంట్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం దానం చేశారని.. ఆ స్థలంతో 12 ఇళ్లు నిర్మించామని వెల్లడించారు సిస్టర్ లిల్లీ.

"టీచర్​ అంటే కేవలం పాఠాలు చెప్పే వారు మాత్రమే కాదు. చుట్టుపక్కల వారికి సహాయం చేయడం కూడా వారి బాధ్యతే. మా పాఠశాల విద్యార్థులు.. పుట్టినరోజు వంటివి జరుపుకుంటే కొంత డబ్బు ఈ ప్రాజెక్టు కోసం ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ వివిధ పనులు చేసే వాళ్లున్నారు. ప్లంబర్లు, ఎలక్ట్రిక్​ వర్క్​లు చేసేవారున్నారు. వారు కూడా ఈ ఇళ్ల నిర్మాణం పనుల్లో సాయం చేస్తారు. వివిధ వర్గాల వారు సాయం చేస్తుంటేనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతోంది."

--లిల్లీ పాల్, ఉపాధ్యాయురాలు.

తమకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకొస్తున్నారని.. తమకు చాలా సంతోషంగా ఉందని వీరు చెబుతున్నారు.

ఇదీ చదవండి:శునకం కోసం విమానం బిజినెస్​ కేబిన్​ బుకింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.