ETV Bharat / bharat

'నైట్రోజన్ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి!'

author img

By

Published : May 3, 2021, 4:34 PM IST

Updated : May 3, 2021, 6:16 PM IST

నైట్రోజన్​ ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్​ ఉత్పత్తి చేసే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇందుకోసం నైట్రోజన్​ ప్లాంట్లను గుర్తించామని చెప్పింది. మరోవైపు.. 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్​ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 7 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష చొప్పున యాక్టివ్​ కేసులు ఉన్నాయని పేర్కొంది.

corona
'12 రాష్ట్రాల్లోనే లక్ష యాక్టివ్​ కేసులు'

దేశంలో మెడికల్​ ఆక్సిజన్ కొరత తీర్చే చర్యల్లో భాగంగా.. నైట్రోజన్​ ప్లాంట్లలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయటంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామనని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందుకోసం పీఎస్​ఏ నైట్రోజన్​ ప్లాంట్లు ఉన్న 14 పరిశ్రమలతో పాటు మరో 37 పరిశ్రమలను గుర్తించామని చెప్పింది. 1,500 పీఎస్​ఏ ఆక్సిజన్​ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

అప్పుడే ఏం చెప్పలేం...

దేశంలో 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్​ కేసులు ఉన్నాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. 7 రాష్ట్రాల్లో 50 వేల నుంచి ఒక లక్ష చొప్పున యాక్టివ్​ కేసులు ఉన్నట్లు చెప్పింది.

"దిల్లీ, మధ్యప్రదేశ్​ వంటి రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. పరిస్థితిలో మార్పుపై ఇప్పుడే ఓ స్పష్టమైన అభిప్రాయానికి రాలేం. కొత్తగా నమోదవుతున్న కేసులతో పోల్చితే.. రికవరీల సంఖ్య అధికంగా ఉండటం సానుకూలాంశమే. అయితే.. అదే సమయంలో యాక్టివ్​ కేసులు సంఖ్యా పెరుగుతోంది."

-లవ్​ అగర్వాల్​, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

వారికి సీటీ స్కాన్​ అవసరం లేదు..

కొవిడ్​ లక్షణాలు స్వల్పంగా ఉంటే.. సీటీ స్కాన్​ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఒక్క సీటీ స్కాన్​ వంద ఎక్స్​రేలతో సమానం అని పేర్కొంది. చిన్న వయస్సులో తరచూ సీటీ స్కాన్​లు చేస్తే.. క్యాన్సర్​ బారిన పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.

హోం ఐసోలేషన్​లో ఉన్న వ్యక్తుల్లో.. ఆక్సిజన్ స్థాయులు పడిపోవటం, అధిక అలసట వంటి లక్షణాలు ఎదురైనప్పడు ఆస్పత్రిలో తప్పనిసరిగా చికిత్స పొందాలని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు.. 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ చేయడాన్ని 12 రాష్ట్రాలు ప్రారంభించాయని చెప్పింది.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 3.68 లక్షల‬ మంది వైరస్ బారిన పడినట్లు నిర్ధరణ అయ్యింది.​ కొవిడ్​ కారణంగా మరో 3,417 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 34,13,642 యాక్టివ్​ కేసులు ఉన్నాయని చెప్పింది.

Last Updated : May 3, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.