ETV Bharat / bharat

వేటగాళ్లకు సింహస్వప్నం.. పులుల్ని, చిరుతలను సంరక్షిస్తున్న శునకం!

author img

By

Published : Dec 24, 2022, 8:00 PM IST

శత్రువుల బారి నుంచి రాజ్యంలోని కాపాడుకునే బాధ్యత రాజుకు ఉంటుంది. అయితే తన భూభాగంలోకి శత్రువులను చొరబడకుండా 'రాణి' కాపాడుతోంది. ఉత్తరాఖండ్ రాజాజీ టైగర్​ రిజర్వ్​లోకి అక్రమంగా చొరబడే దుండగులను పోలీసులకు పట్టిస్తోంది ఈ రాణి అనే శునకం. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

dog-rani-in-rajaji-tiger-reserve
dog-rani-in-rajaji-tiger-reserve

పులుల్ని, చిరుతలను సంరక్షిస్తున్న శునకం!

పులులు, చిరుతలను వేటగాళ్ల నుంచి కాపాడే బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది ఓ శునకం. ఉత్తరాఖండ్​లోని రాజాజీ టైగర్ రిజర్వ్​లో జంతువులకు రక్షణగా.. రాణి అనే శునకం అనుక్షణం కాపలా కాస్తోంది. వణ్య ప్రాణులకు ఆపద కలిగితే గుర్తించేలా ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ శునకం.. అటవీ అధికారులు, టైగర్ రిజర్వ్ సిబ్బందికి తోడుగా గస్తీ నిర్వహిస్తోంది.

ప్రస్తుతం రాణికి తొమ్మిదేళ్లు. వన్యప్రాణుల చర్మం, అవయవాలను గుర్తించేలా మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో.. రాణి తొమ్మిది నెలల పాటు శిక్షణ తీసుకుంది. వేటగాళ్లను, స్మగ్లర్లను గుర్తించడం రాణికి కొట్టిన పిండి. ఇప్పుటి వరకు తన నైపుణ్యంతో అనేక మంది స్మగ్లర్లను గుర్తించింది. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే.. వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది.

"ఇలాంటి కుక్కలకు ట్రాఫిక్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్​ అనే సంస్థల ద్వారా శిక్షణ ఇచ్చాం. మా స్నిఫర్ డాగ్ బృందం సైతం ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చింది. వేటగాళ్లు, స్మగ్లర్లను ఎలా గుర్తించాలో నేర్పిస్తాం. వాటికి మూడు రకాల ట్రైనింగ్ ఇస్తాం. సాధారణ శిక్షణతో పాటు వాసన చూసి పసిగట్టడం.. ట్రాకింగ్ చేయడం నేర్పుతాం. ఇలా ట్రైనింగ్ తీసుకున్న శునకాలను స్మగ్లర్లను పట్టుకునేందుకు ఉపయోగిస్తాం."
-సాకేత్ బడోలా, రాజాజీ టైగర్ రిజర్వ్ డైరెక్టర్

రాజాజీ టైగర్​ రిజర్వ్​ చాలా విశాలమైన ప్రదేశం. ఇక్కడ 30 పులులు, 200 చిరుతలు ఉన్నాయి. వీటితో పాటు 500 ఏనుగులు, అనేక రకాల వన్యప్రాణులు, పక్షిజాతులు ఉన్నాయి. రాష్ట్రంలో గత 20 ఏళ్లలో అనేక పులులు, చిరుతలను వేటగాళ్లు చంపేశారు. 41 తోడేళ్లు, 9 ఏనుగులు సైతం వేటగాళ్ల బారిన పడి మరణించాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో.. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను రాణి కొంతమేరకు తగ్గిస్తోందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.