ETV Bharat / bharat

జలియన్​ వాలాబాగ్​.. స్వాతంత్ర్యోద్యమంలో కీలక మలుపు

author img

By

Published : Sep 4, 2021, 6:08 AM IST

Updated : Sep 4, 2021, 6:39 AM IST

భరతమాత నుదుట రక్త తిలకం.. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఓ రక్తసిక్త అధ్యాయం.. జలియన్ వాలా బాగ్ దురంతం. జనరల్ ఓ డయ్యర్ సాగించిన మారణకాండలో వందలాది మంది నేలకొరిగిన విషాద ఘట్టం. అమరుల త్యాగాలతో దేశమంతా అట్టుడికింది. స్వరాజ్య సమరం ఉవ్వెత్తున ఎగసిపడింది. దేశమాత ‌స్వేచ్ఛకోసం సాగిన పోరాటాన్ని జలియన్ వాలాబాగ్ ఘటన కీలక మలుపు తిప్పింది.

The Jallianwala Bagh
జలియన్ వాలా బాగ్

దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక మలుపు..

భారత స్వాతంత్ర్యోద్యమంలో జలియన్ వాలాబాగ్ ఘటన ముఖ్యభూమిక పోషించింది. ఆనాటి విచక్షణారహిత మారణకాండతో దేశమంతా రగిలిపోయింది. పోరు మరింత ఉద్ధృతమైంది. జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారణమేమిటి? బ్రిటిషర్లు ఎందుకంత నిర్దయగా ప్రవర్తించారు? నేపథ్యాన్ని ఒక్కసారి పరిశీలించాలి.

1913లో ప్రారంభమైన గదర్ ఉద్యమం, 1914లో కొమగతమారు నౌక సంఘటనలతో పంజాబ్​లో ప్రజాగ్రహం ప్రజ్వరిల్లింది. విప్లవ భావాలు వెల్లువెత్తాయి. 1914లో మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. మనదేశం నుంచి బ్రిటిష్ సైన్యంలో మొత్తం లక్షా 95 వేలమంది ఉంటే.. అందులో లక్షా పదివేల మంది పంజాబీలే. సైనికుల్లో జాతీయభావాలు అంకురిస్తున్నాయి. దేశభక్తి ఉప్పొంగుతోంది. ఈ క్రమంలో సైనికులు తిరుగుబాటు చేస్తే వీరిని నిరోధించటం అసాధ్యమని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఒకవేళ తిరుగుబాటు చేసినా ..అప్పటికి వాటి అణచివేతకు గట్టి చట్టాలేమీ లేవు. పంజాబ్​లో క్రమక్రమంగా మారుతున్న పరిస్థితి బ్రిటిషర్లకు ఆందోళన కలిగించింది. కొత్తచట్టాలు తేవాలన్న ఆలోచనల ఫలితమే రౌలత్​ చట్టం. ఇందుకోసం తెల్లవాళ్ల ప్రభుత్వం సమాలోచనల్లో ఉంది. పౌరుల స్వేచ్ఛను హరించే ఈ నల్లచట్టం తెచ్చే యత్నాలపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కథనాలను అప్పటి ముద్రణా మాధ్యమాలు సవివరంగా ప్రచురించసాగాయి.

నల్లచట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు నిర్వహించారు. ఉద్యమ జ్వాలలు మిన్నంటాయి. ఇందులో భాగంగానే అమృతసర్​లోనూ నిరసన కార్యక్రమాలు తలపెట్టారు. ఇద్దరు సీనియర్ నాయకుల అరెస్టుతో అమృత్ సర్ అట్టుడికిపోయింది. కత్రా జైమల్ సింగ్, హాల్ బజార్, ఉఛాపుల్ ప్రాంతాలలో 20,000 మంది ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. ఒకటి రెండు హింసాత్మక ఘటనలతో.. పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఒ డయ్యర్ స్పందించాడు. పరిస్థితిని నియంత్రించేందుకు జలంధర్​లో ఉన్న సైనికాధికారి జనరల్‌ ఆర్. డయ్యర్​కు కబురుపెట్టాడు.

"జలంధర్ నుంచి ఆర్. డయ్యర్​ను రప్పించారు. అతడో వింత మనిషి. మనదేశ ప్రజల మీద తేలికపాటి భావం ఉంది. ఇది బ్రిటిషర్లు పాలిస్తున్న దేశం కాబట్టి.. భారతీయులంతా అణిగిమణిగి ఉండాలని, ఎదిరించేవారు పురుగులతో సమానమని అతడి అభిప్రాయం. ఉత్తరాది విభాగానికి చెందిన జనరల్ ఆర్ డయ్యర్ నీచ స్వభావం కలిగినవాడు".

-- ప్రశాంత్ గౌరవ్, రచయిత

జలియన్ వాలా బాగ్ ఊచకోతకు సరిగ్గా ఒక్క రోజు ముందు జనరల్ ఆర్. డయ్యర్ తన సైనిక దళాలతో అమృతసర్​లో కవాతు నిర్వహించి.. కర్ఫ్యూ విధించాడు.

''అయితే కర్ఫ్యూ విధించిన సంగతి అమృత్‌ సర్‌ వాసుల్లో 90 శాతానికి తెలియనే తెలియదు. నిషేధాజ్ఞల సంగతి కేవలం పదిశాతం మందికే తెలిసింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది.''

-- ప్రశాంత్ గౌరవ్, రచయిత

సమాచార లోపం వల్ల ప్రజలు జలియన్ వాలాబాగ్​కు వచ్చారు. అదే రోజు పంజాబీలకు పెద్ద పండుగ వైశాఖీ ఉంది. శ్రీ హర్మిందర్ సాహిబ్​లో దైవప్రార్థనలకు వచ్చిన వారు తోటలో చేరారు. మరోవైపు గోవిందగఢ్‌ పశు మేళాకు వచ్చినవారూ ఇక్కడే సేదతీరారు. గూఢచారులు కుష్షాల్ సింగ్‌, మహ్మద్ పెహల్వాన్ , మిర్ రియాజుల్ హుస్సేన్‌ లు ప్రతినిమిషం జలియన్ వాలాబాగ్​లో ఏం జరుగుతోందో జనరల్ ఆర్ డయ్యర్​కు సమాచారం చేరవేస్తున్నారు.

The Jallianwala Bagh
జలియన్ వాలా బాగ్

"అంతే కాదు. జలియన్ వాలాబాగ్ లో స్థానిక మొహల్లాల పిల్లలు, మహిళలు, పెద్దలు గుమికూడారు. అక్కడ మైక్రో ఫోనులు అమర్చి ఉన్నాయి. వాటిని తమ వినోదం కోసమే పెట్టి ఉంచారని, ఏవో వినిపిస్తారని అక్కడికి వచ్చిన వారు అనుకుంటున్నారు. కానీ అక్కడ సత్యాగ్రహం చేసేవారి సమావేశం జరగనుందని 90శాతం మందికి తెలియదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రాసాగారు. వారు వస్తున్న సమాచారం క్షణక్షణానికి జనరల్ డయ్యర్ కు చేరిపోతోంది."

-- ప్రశాంత్ గౌరవ్, రచయిత

జలియన్ వాలాబాగ్​లో సత్యాగ్రహుల సమావేశం సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 3 గంటల నుంచే జనం పెద్ద సంఖ్యలో రాసాగారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల మధ్య.. పాతికేసి మంది సైనికులతో కూడిన నాలుగు సైనిక బృందాలతో జనరల్ ఆర్. డయ్యర్ జలియన్ వాలా బాగ్​కు చేరుకున్నాడు. బృందాలలో 50 మంది సైనికులు గూర్ఖా రెజిమెంట్​కు, అఫ్ఘాన్ రెజిమెంటుకు చెందిన వారున్నారు. జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్​కు వచ్చేశాడు. వెనువెంటనే కాల్పులకు ఆదేశించాడు.

ఎంత ఘోరమంటే.. కాల్పుల తర్వాత గాయపడిన వారికి దాహం తీర్చుకునేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరకలేదు. ఆ సమయంలో మంచినీరు, వైద్య సహాయం లభించి వుంటే అనేకమంది ప్రాణాలు దక్కివుండేవి.

జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత జనరల్ డయ్యర్ ఏమీ తెలియనట్లు ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. భారతీయులలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు చల్లార్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ డయ్యర్ ను సస్పెండ్ చేసింది. ఉధమ్‌ సింగ్‌ లండన్​లో 1940 మార్చి 13న డయ్యర్​ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. మృతవీరుల స్మృతి చిహ్నంగా జలియన్ వాలాబాగ్​లో భారత ప్రభుత్వం ఒక స్మారక స్థూపం నిర్మించింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఈ స్థూపాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి:- అందరికీ విద్య.. అంబేడ్కర్‌కు అండ.. ఈ మహారాజు చలవే!

Last Updated : Sep 4, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.