ETV Bharat / bharat

'అగ్రదేశాల కంటే వేగంగా ఎదుగుతున్నాం.. పైచేయి మనదే'

author img

By

Published : Feb 11, 2022, 6:49 AM IST

Indian economy Growth: మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు.

Indian economy
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Indian economy Growth: మహమ్మారి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ మిగతా ప్రపంచ దేశాల కంటే కిందికి పడిపోయినప్పటికీ అంతే వేగంగా పైకి వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న అమెరికా, ఐరోపా దేశాల కంటే మన ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. 2022-23 బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చకు ఆమె గురువారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు.

"స్వాతంత్య్రానంతరం దేశంలో నాలుగుసార్లు జీడీపీ వృద్ధిరేటు మందగించింది. 1973-74లో ప్రపంచ చమురు సంక్షోభంతో, 1979-80లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం వల్ల, 2008-09లో ప్రపంచ ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ వృద్ధిరేటు తగ్గింది. అంతేగానీ ఎన్నడూ నెగెటివ్‌లోకి వెళ్లలేదు. కొవిడ్‌ సంక్షోభం కారణంగా 2020-21లో జీడీపీ వృద్ధిరేటు మైనస్‌ 6.6% మేర పడిపోయింది. ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 2008-09లో ఆర్థిక మందగమనం వల్ల జీడీపీ తగ్గుదలతో రూ.2.12 లక్షల కోట్లు కోల్పోతే.. 2020-21లో రూ.9.7 లక్షల కోట్ల విలువైన జీడీపీని కోల్పోవాల్సి వచ్చింది. వినియోగదారుల ధరల సూచీ మాత్రం 6.2%కే పరిమితమయ్యేలా చూశాం. అత్యధిక ఆర్థిక పతనంలోనూ ధరల భారం సామాన్యుడిపై పడకుండా కాపాడాం. మా ఆర్థిక నిర్వహణను అందరూ సానుకూల కోణంలో చూడాలి. 2008-09లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 252 బిలియన్‌ డాలర్లు ఉంటే ఇప్పుడు 579 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఎఫ్‌డీఐలు పదింతలు పెరిగాయి."

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి.

అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు

"2021, 2022, 2023ల్లో అమెరికా వరుసగా 5.6%, 4%, 2.6%; భారత్‌ వరుసగా 9%, 9%, 7.1% వృద్ధి రేటు నమోదు చేస్తాయని అంచనావేస్తున్నాం. మన వృద్ధిరేటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైనది అవుతుంది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పతనం మన దగ్గర ఎక్కువ నమోదైనప్పటికీ అందరికంటే వేగంగా పుంజుకుంటున్నాం. ప్రజలు కట్టిన పన్నులను మూలధన వ్యయంగా ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. 2020-21 అంచనాల ప్రకారం 7.3% ఉన్న రెవిన్యూ లోటును 2021-22 సవరించిన అంచనాల నాటికి 4.7%కి తగ్గించాం. ఆహార రాయితీ కింద 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రూ.2.86 లక్షల కోట్లు కేటాయించాం. 21-22లో ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరగడంతో రాయితీల భారం పెరిగింది. రాయితీకి కేటాయించిన రూ.79,530 కోట్లకు బదులు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరించింది. ఈసారి అంత ఖర్చు అవసరం ఉండదు. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకు కేటాయింపులు పెంచాం. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్‌కు తగ్గట్టు కేటాయింపులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబోం" అని నిర్మల స్పష్టంచేశారు.

ఇదీ చదవండి: 'నెహ్రూ వైఫల్యం వల్లే గోవాకు ఆలస్యంగా స్వాతంత్ర్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.