ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రవాదుల వరుస ఘాతుకాలు

author img

By

Published : Jan 2, 2021, 2:53 PM IST

కశ్మీర్​లో ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. భద్రతా దళాలే లక్ష్యంగా పుల్వామా లో గ్రనేడ్​లు విసిరారు. ఈ ఘటనలో 8 మంది పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్​లోని ఓ మార్కెట్​కు వెళ్లిన స్థానికున్ని దారుణంగా హతమార్చారు.

terror attacks in kashmir one civillion dead, 8 members injured
కశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందిన ఓ స్థానికేతరుడిని దారుణంగా హత్యచేశారు. సత్‌పాల్‌ నిశ్చల్‌‌(50) అనే నగల వ్యాపారి కశ్మీర్‌లో 50ఏళ్లుగా నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. గరువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికేతరులను బెదిరించాలన్న ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

దాడి చేసింది ఆ ముఠానే

రెసిస్టంట్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్లు ప్రకటించుకుంది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఆక్రమణదారులుగాలనే భావిస్తామని చెప్పుకొచ్చింది. అధికరణ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన నేపథ్యంలో అక్కడి స్థిరాస్తులను స్థానికేతరులు కొనుగోలు చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు 10 లక్షల మంది స్థానికేతరులు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే. అయితే, వీరిలో స్థానికేతరులు ఎవరన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదు.

భద్రతా దళాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి

పుల్వామా జిల్లా ట్రాల్​ బస్టాండ్​లో భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్​లు విసిరారు. అయితే అవి అదుపు తప్పి రోడ్డుపై పేలాయి. దాంతో అక్కడే ఉన్న 8 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వెల్లడించారు. ముష్కరుల్ని పట్టుకోవడానికి ఆ ప్రాంతంలో రాకపోకల్ని నిషేధించినట్లు తెలిపారు.

అంతకు ముందే జనవరి1 శ్రీనగర్​లోని చనపోర ప్రాంతంలోని సహస్ర సీమా దళ్​ పై గ్రనేడ్ దాడి జరిపారు ముష్కరులు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డిసెంబర్​ 9 న బారముల్లా జిల్లాలో కూడా ఉగ్రవాదులు ఇదే తరహా దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో 9 మంది పౌరులు గాయపడ్డారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఉగ్రదాడి- జవానుకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.