ETV Bharat / bharat

TS New Secretariat: భాగ్యనగర సిగలో మరో మకుటంగా తెలంగాణ నూతన సచివాలయం

author img

By

Published : Apr 30, 2023, 5:57 AM IST

Telangana New Secretariat: భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, వనపర్తి సంస్థానాధీశుల ప్రాసాదాలు, రాజస్థానీ రాతి, గుజరాతీ రీతులతో కట్టిన కలల సౌధం. తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని... తాత్వికత, మార్మికత నిబిడీకృతమై దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో... అద్భుత కట్టడం. ప్రాచీనయుగం నాటి ఆలయ గోపురాలు, మధ్యయుగం నాటి రాజభవనాలను ప్రతిబింబిస్తూ...భాగ్యనగర సాగర తీరాన ఠీవీగా నిలిచింది.... ఈ అధునాతన పాలనాసౌధం. సీఎం కేసీఆర్‌ కార్యదక్షతతో... 4కోట్ల మంది ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పేలా తెలంగాణ ప్రజాసౌధం అద్భుతంగా రూపుదిద్దుకుంది.

Telangana New Secretariat
Telangana New Secretariat

భాగ్యనగర సిగలో మరో మకుటంగా తెలంగాణ నూతన సచివాలయం

Telangana New Secretariat: సీఎం కేసీఆర్‌ కార్యదక్షతతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం రికార్డు సమయంలోనే పూర్తి అయింది. 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం.. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం.. మధ్యలో ఇంద్ర భవనాన్ని తలపించేలా నూతన సముదాయం నిర్మాణం జరిగింది. తెలంగాణ చారిత్రక, సంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా హైదరాబాద్‌లో నడిబొడ్డున ఇది ఏర్పాటైంది. భవిష్యత్‌ తరాలకు అనుగుణంగా నిర్మాణమైన భవనం.. అత్యాధునికి సాంకేతికతో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధిలో, విస్తరణలో శరవేగంగా దూసుకుపోతున్న మహానగరానికే కాదు.... 4కోట్ల మంది హృదయస్థానమైన ఈ నవ్య పాలనాప్రాసాదం బయటి నుంచి చూపరుల కళ్లను ఎంతలా కట్టి పడేస్తుందో.. లోపలికెళితే అత్యాధునిక సౌకర్యాలూ అంతే అబ్బురపరుస్తాయి.

తెలంగాణ ఠీవిని ప్రతిబింబిస్తూ అద్భుత కట్టడం: ఇండో-పర్షియన్‌-అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలితో అలనాటి ప్యాలెస్‌లు, దేవాలయాల నిర్మాణాల తీరును ప్రతిబింబిస్తున్న ఈ భవంతి... కాకతీయుల కాలం నాటి కట్టడాలు, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల శైలుల ప్రేరణతో రూపుదిద్దుకుంది. భవనంపై ఉన్న 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలుస్తున్నాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన ఈ డోమ్‌లు నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా చెప్పొచ్చు. నిజామాబాద్‌లోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వరస్వామి ఆలయం, గుజరాత్‌ సలంగ్‌పూర్‌లోని హనుమాన్‌ ఆలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలుల నుంచి ప్రేరణ పొంది... అక్కడి గోపురాల ఆధారంగా హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలిల్లో ఈ భవనపు డోమ్‌లు నిర్మించారు. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించటం నిర్మాణ రంగంలో పెద్ద సవాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక చెరొక ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు.

ఆధునిక సౌందర్యాల కలబోతతో ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మాణం: తెలంగాణలో సాంస్కృతిక సంపద, శాంతియుత జీవనశైలి అనే రెండంచెల స్ఫూర్తి సచివాలయ భవన నిర్మాణ శైలిలో అడుగడుగునా నిండి ఉంటుంది. బయటి వైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. కాస్తంత వెలిసినట్లుగా బంగారు వర్ణం కనిపిస్తున్నప్పటికీ ప్రకాశిస్తున్నట్లు కనిపించే సువర్ణపు ఇసుక రంగు... ఈ భవంతి వినూత్నతను ప్రదర్శిస్తోంది. ఈ గుమ్మటాలపై జాతీయ చిహ్నమైన సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఒక్కోటి అయిదడుగుల ఎత్తు, రెండున్నర టన్నుల బరువుండే ఈ సింహాల బొమ్మలను దిల్లీలో సిద్ధం చేయించి తీసుకువచ్చి అమర్చారు. మరో 32 చిన్న గుమ్మటాలు భవనంపై కనిపిస్తాయి. అశోక కాపిటల్ పైభాగం కలిపితే మొత్తం సచివాలయ భవనం ఎత్తు 265 అడుగులుగా ఉంటుంది. భవనానికి తూర్పు, పడమరలోని 48 అడుగుల ఎత్తైన గుమ్మటాల ద్వారా హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు.

విభిన్న రీతుల్లో సచివాలయ భవంతికి సొగబులు: సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు దీటుగా బాహుబలి మహాద్వారం చూపరులను ఆకట్టుకుంటోంది. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో దీన్ని తీర్చిదిద్దారు. ఆదిలాబాద్‌ అడవుల్లోని నాణ్యమైన టేకు కలపను సేకరించి నాగ్‌పుర్‌లో మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875కి పైగా తలుపులుండగా...వీటన్నింటినీ టేకుతోనే తయారు చేశారు. మహాద్వారంలో ఉన్న 2 అంతస్థుల ప్రవేశమార్గం..భవనానికి కేంద్రంగా ఉంటుంది. "బ్రహ్మస్థానం" అయిన విశాలమైన అంతర్గత ప్రాంగణం చుట్టూ ఎర్ర ఇసుక రాతి పోడియం గోడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు సచివాలయంలో సహజ వెలుతురు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

భవిష్యత్‌ తరాల అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణం: దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే భవనం మధ్యలో విశాలమైన కోర్ట్ యార్డ్ వచ్చేలా నిర్మాణం చేశారు. ప్రధాన భవనం 2.45 ఎకరాల్లో, కోర్ట్ యార్డ్ రెండు ఎకరాల్లో ఉంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా నిర్మితమైన భవనంలో మంత్రులు, సందర్శకులకు విడిగా లిఫ్టులతో పాటు మెట్లు, ఫైర్ లిఫ్టులు, దివ్యాంగుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్ చుట్టూ మొత్తం 16 అడుగుల ఎత్తులో మెటల్ డిజైన్‌తో గ్రిల్ ఏర్పాటు చేశారు. భద్రతాపరంగానూ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ద్వారాలు, కిటికీలు, అద్దాలు, గోపురాలపైన ఆకర్షణీయంగా ఉండేలా వివిధ ఆకృతులను ఏర్పాటు చేశారు. స్తంభాలను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం సచివాలయం ఇంటీరియర్ ఫినిషింగ్‌లను గ్రానైట్, విట్రిఫైడ్ టైల్స్, వెనీర్ వుడ్ ప్యానలింగ్, మెటల్, అకౌస్టిక్ ఫాల్స్ సీలింగ్‌లు, ఎనర్జీ ఎఫెక్టివ్ ప్లంబింగ్ ఫిక్చర్‌లు సహా సచివాలయం అంతంటిని ఆకర్షణీయంగా రూపొందించారు.

విశేషాల సమాహారం..నూతన సచివాలయం: మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో కేవలం పది శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో ప్రధాన భవనాన్ని నిర్మించారు. విశాలమైన కారిడార్లతో పర్యావరణ హితంగా భవనాన్ని నిర్మించారు. గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలను పాటించారు. మొత్తం భవనాన్ని ప్లగ్ అండ్ ప్లే విధానంలో సిద్దం చేశారు. పర్యాటకులు, ఉద్యోగుల కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రాంగణానికి మరింత వన్నె తెచ్చేందుకు రెండు భారీ ఫౌంటెన్లను నిర్మించారు. పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో వాటిని ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ఉపయోగించిన రెడ్‌ శాండ్‌ స్టోన్‌తోనే నిర్మించటం విశేషం. ఒక్కో ఫౌంటెన్‌ను 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యంలో రూపొందించారు.

జల వాయు వ్యవస్థ- హైడ్రో న్యుమాటిక్‌ సిస్టం ద్వారా నీటి పంపిణీ: సాధారణంగా ఏ భవనంలోైనా వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలంటే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉంటుంది. కానీ..సచివాలయంలో మాత్రం ఓవర్‌ హెడ్‌ ట్యాంకును అత్యవసర సందర్భాలకు మాత్రమే పరిమితం చేశారు. సాధారణ సందర్భాల్లో దీనికి బదులు జల వాయు వ్యవస్థ- హైడ్రో న్యుమాటిక్‌ సిస్టం ద్వారా అన్ని అంతస్తులకు నీటిని పంపిణీ చేయనున్నారు. భవనం సమీపంలో 565 కిలోలీటర్ల సామర్థ్యంతో భూగర్భ నీటి నిల్వకేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీరు సరఫరా అయ్యేలా వ్యవస్థను నెలకొల్పారు. ఈ సౌధం పరిసరాల్లో కురిసిన ప్రతి వాన చినుకునూ ఒడిసి పట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి నీటి చుక్కా భూగర్భ సంపులో మిళితమయ్యేలా పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో.. సుమారు అడుగున్నర ఎత్తున వర్షపు నీరు సంపులోకి చేరటాన్ని అధికారులు గుర్తించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పచ్చిక బయళ్ల నిర్వహణకు ఇందులోని నీటినే వినియోగించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.