ETV Bharat / bharat

TS New Secretariat: భాగ్యనగరం నడిబొడ్డున.. ప్రారంభోత్సవానికి ముస్తాబైన నూతన సచివాలయం

author img

By

Published : Apr 29, 2023, 9:08 PM IST

Updated : Apr 29, 2023, 10:52 PM IST

Telangana New Secretariat Inauguration News: సకల సదుపాయలతో, ఆధునిక హంగులతో నిర్మితమైన తెలంగాణ కొత్త సచివాలయం నేడు అందుబాటులోకి రానుంది. నూతన సచివాలయం ప్రారంభఘట్టం... గంటలోపే ముగియనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక మొదలు... మంత్రులు, అధికారుల సంతకాల ప్రక్రియ... ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల్లోపే పూర్తి కానుంది. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

Telangana New Secretariat
Telangana New Secretariat

భాగ్యనగరం నడిబొడ్డున.. ప్రారంభోత్సవానికి ముస్తాబైన నూతన సచివాలయం

Telangana New Secretariat Inauguration News: డాక్టర్‌ బీఆర్​ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయ సౌధం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో... 8 ఎకరాల మేర పచ్చదనం మధ్య తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా... 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సచివాలయాన్ని నిర్మించారు. 12వేల మంది కార్మికులు... 3 షిఫ్టుల్లో శ్రమించి 10లక్షల 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. ఆరు అంతస్తుల్లో అద్భుత కట్టడాన్ని నిలబెట్టారు.

సకల హంగులతో నూతన సచివాలయం: పార్లమెంట్‌ తరహాలో స్వాగత తోరణం, విశాలమైన అంతర్గత రోడ్లు., పార్కింగ్ స్థలాలు, శాశ్వత హెలీప్యాడ్‌, ఉద్యానవనాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనామందిరాలు... కొత్త సచివాలయంలో ఏర్పాటుచేశారు. విశాలమైన గ్రంథాలయం, క్యాంటీన్‌, కమాండ్ కంట్రోల్ సెంటర్, బ్యాంకు, పోస్టాఫీస్, డిస్పెన్సరీ, ఇండోర్ స్టేడియం, ఆర్టీసీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, మీడియా సెంటర్‌.. ఇలా అన్ని హంగులతో సచివాలయ భవనం నిర్మించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో సీఎం కార్యాలయం, ప్రజాదర్బార్‌ నిర్వహణకు ‘జనహిత’పేరుతో కనీసం 250 మంది కూర్చునే హాలు, 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునే విధంగా కేబినెట్‌ హాలు, కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు 60 మంది కూర్చునే హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు... మొత్తం 25మంది కూర్చునే విధంగా అత్యాధునిక డైనింగ్‌ హాలు ఏర్పాటుచేశారు.

సంప్రదాయ పూజల అనంతరం సీఎం కుర్చీలో కేసీఆర్ ఆసీనులవుతారు: నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే ఇవాళ ఉదయం సుదర్శన యాగం, చండీహోమం నిర్వహించనున్నారు. రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు యాగంలో.. పాల్గొంటారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటా 20 నిమిషాలకు సీఎం కేసీఆర్... సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. తర్వాత మహాద్వారం వద్ద.. శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కింది అంతస్తులో... వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. అక్కడి నుంచి ఆరో అంతస్తుకు చేరుకుంటారు. సంప్రదాయ పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం మధ్య సీఎం కుర్చీలో ఆసీనులవుతారు. వెంటనే ఒక ముఖ్యమైన దస్త్రంపై... ముఖ్యమంత్రి సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఒంటి గంటా 33 నిమిషాలలోపు... పూర్తికానుంది.

మంత్రులందరూ ఒక దస్త్రంపై సంతకం చేస్తారు: సీఎం కేసీఆర్‌ తన కుర్చీలో కూర్చున్న తర్వాత... మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై... సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు... అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయడంతో ప్రారంభోత్సవ ఘట్టం పూర్తవుతుంది. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో... మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు.

నేడు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: పాలనా సౌధం ప్రారంభోత్సం నేపథ్యంలో నేడు సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు... ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. సచివాలయ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని... లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్‌ షోలను మూసి వేస్తున్నట్లు హెచ్​ఎండీఏ తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 29, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.