ETV Bharat / bharat

యథాతథంగా నీట్-పీజీ పరీక్ష.. వాయిదా వేయడం కుదరదన్న సుప్రీంకోర్టు

author img

By

Published : Feb 27, 2023, 6:19 PM IST

నీట్-పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి5వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపింది.

supreme court refuses postponement of neet pg entrance exams
నీట్-పీజీ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను నిరాకరించిన సుప్రీం.

మార్చి5న జరగాల్సిన నీట్-పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇప్పటికే ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్​కార్డులు అందుబాటులో ఉంచామని, పరీక్షను వాయిదా వేయడం కుదరదని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్ణయించిన తేదీల ప్రకారం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్​బీఈ) తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి హాజరై.. పరీక్షకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు వెల్లడించారు. సోమవారమే నీట్ అడ్మిట్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. జులై 15న కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్ఆర్​ భట్, దీపాంకర్ ధర్మాసనానికి చెప్పారు. 'ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తే.. తర్వాత నిర్వహించడానికి ప్రత్యామ్నయ తేదీలు అందుబాటులో లేవు' అని ధర్మాసనానికి ఐశ్వర్య నివేదించారు. అయితే, ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్​షిప్ కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడగించిన నేపథ్యంలో.. నీట్ కౌన్సిలింగ్ సైతం అప్పుడే నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ఈ నేపథ్యంలో పరీక్షను సైతం వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ వీరి అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో పరీక్ష యథాతథంగా జరగనుంది.

2023 సంవత్సరానికి గాను దాదాపుగా 2.09లక్షల మంది అభ్యర్థులు నీట్-పీజి ప్రవేశ పరీక్షకు అప్లై చేసుకున్నారని ఫిబ్రవరి 24న నేషనల్ బోర్డు ఎగ్జామినేషన్ సుప్రీం కోర్టుకు తెలిపింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారికి షెడ్యూల్ ప్రకారం మార్చి 5న నీట్-పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఫిబ్రవరి 10న తెలిపారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు తప్పనిసరి అయిన ఏడాది ఇంటర్న్​షిప్​ను పూర్తి చేసేందుకు ఉన్న గడువును జూన్ 30 నుంచి ఆగస్టు 11 కు పెంచుతున్నట్లు ఆరోగ్య శాఖ గతంలోనే ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.