ETV Bharat / bharat

రాజీవ్ హత్య కేసు దోషి విడుదల- సుప్రీం 'అసాధారణ' తీర్పు

author img

By

Published : May 18, 2022, 11:16 AM IST

Updated : May 18, 2022, 1:55 PM IST

Supreme Court
రాజీవ్ హత్య కేసు దోషికి ఊరట- విడుదలకు సుప్రీం ఆదేశం

AG Perarivalan: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరైన పెరారివాలన్​ను విడుదల చేయాలని ఆదేశించింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించి పెరారివాలన్​ను విడుదల చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

Rajiv Gandhi Assassination Convict: మాజీ ప్రధాని రాజీవ్​గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న దోషుల్లో ఒకరికి ఊరటను కల్పించింది సుప్రీంకోర్టు. 30 ఏళ్లకుపైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్​ను విడుదల చేయాలని జస్టిస్​ ఎల్​ నాగేశ్వర రావ్​ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తన జీవిత ఖైదును సస్పెండ్ చేయాలని కోరుతూ 47 ఏళ్ల పెరారివాలన్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

పెరారివాలన్‌కు ఉపశమనం కల్పించేందుకు.. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాన్ని ఉపయోగించింది. సంబంధిత పరిశీలనల ఆధారంగా తమిళనాడు మంత్రివర్గం తన నిర్ణయం తీసుకుందని.. ఆర్టికల్ 142 ప్రకారం దోషిని విడుదల చేయడం సముచితమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఎటువంటి ఫిర్యాదుల చరిత్ర లేకపోవడం సహా సుదీర్ఘమైన జైలు శిక్షను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మార్చి 9న పెరారివాలన్‌కు.. బెయిల్ మంజూరు చేసింది.

కుటుంబసభ్యుల భావోద్వేగం: సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పెరారివాలన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు. పెరారివాలన్ నివాసానికి చేరుకున్న సన్నిహితులు సంబరాలు చేసుకున్నారు. పెరారివాలన్ తన తల్లి అర్పుతమ్మాళ్‌కు మిఠాయి తినిపించారు. తన కుమారుడి 30 ఏళ్ల జైలు శిక్ష ముగియడం పట్ల పెరారివాలన్‌ తండ్రి కుయిల్‌దాసన్ సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో తమిళ అనుకూల సంఘాల కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైకో, పీఎంకే నేత రామదాస్‌ సహా రాజకీయ నేతలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.

'అతనికి స్వేచ్ఛ దక్కింది'..: పెరారివాలన్​ విడుదలపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్​ హర్షం వ్యక్తం చేశారు. 'జైలులోనే అతను 30 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అతనికి స్వేచ్ఛగా బతికే అవకాశం వచ్చింది. అతను బాగుండాలని కోరుకుంటున్నాను' అని స్టాలిన్​ పేర్కొన్నారు.

1991 మే 21 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్‌గాంధీని హత్య చేశారు. ఈ కేసులో 1999 మేలో పెరారివాలన్‌, మురుగన్, శాంతమ్, నళినికి మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో 11 ఏళ్ల జాప్యం కారణంగా సంతన్, మురుగన్, పెరారివాలన్‌ మరణశిక్షను సర్వోన్నత న్యాయస్థానం జీవిత ఖైదుగా మార్చింది. ఇప్పుడు పెరారివాలన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి : వీసా కుంభకోణం కేసులో చిదంబరం సన్నిహితుడు అరెస్ట్​

Last Updated :May 18, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.