ETV Bharat / bharat

భారత అమ్ములపొదిలో కొత్త అస్త్రం.. సముద్రంలో డ్రాగన్​కు ఇక చెక్!

author img

By

Published : Dec 18, 2022, 2:57 PM IST

భారత అమ్ములపొదిలో.. మరో అస్త్రం చేరింది. హిందూ మహా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలకు చెక్‌ పెట్టే.. ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ నౌకా దళంలో చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధ నౌక సముద్ర జలాల్లో డ్రాగన్‌ కుయుక్తులకు చెక్‌ పెట్టనుంది. భారత నౌకాదళ బలోపేతానికి ఈ యుద్ధ నౌక బలమైన నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.

Stealth guided missile destroyer Mormugao
ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌

హిందూ మహా సముద్రంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనాకు చెక్‌ పెట్టే.. అస్త్రం భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ను.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్​ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్.. విధుల్లోకి చేర్చారు. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌.. హిందూ మహాసముద్ర జలాల్లో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారనుంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు.. సముద్ర జలాల్లో ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ కంటిలో నలుసుగా మారుతుందని.. నౌకా దళ అధికారులు తెలిపారు. చైనా చేస్తున్న కుతంత్రాలను సమర్థంగా అడ్డుకునేందుకు భారత నౌక దళ సముద్ర సామర్థ్యాన్ని.. ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ పెంచనుంది. గత దశాబ్ద కాలంలో భారత నౌకాదళం యుద్ధ నౌకల తయారీ.. నిర్మాణ సామర్థ్యంలో సాధించిన పెద్ద పురోగతికి ఈ విజయం నిదర్శనమని భారత నేవీ వెల్లడించింది.

Stealth guided missile destroyer Mormugao
ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ను ప్రారంభిస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
Stealth guided missile destroyer Mormugao
ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ లోపలి భాగాలు

భారత రక్షణ రంగ చరిత్రలో ఇదో మైలురాయిగా.. భారత నౌక దళం అభివర్ణించింది. ఈ యుద్ధనౌకలో అత్యాధునిక సెన్సార్లు.. ఆధునిక రాడార్లు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతో ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ శత్రువులకు భయం పుట్టించేలా ఉంటుంది. 450 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించగలిగే.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ నుంచి ప్రయోగించవచ్చు. ఈ యుద్ధ నౌక నుంచి.. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, టార్పెడో రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మెషిన్‌గన్‌లు.. విస్తృత శ్రేణి రాడార్లు, సెన్సార్లు ఉన్నాయి. 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు కలిగిన ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌.. భారత్‌ నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిగా గుర్తింపుపొందింది.

Stealth guided missile destroyer Mormugao
ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ లోపలి భాగాలు

భారత నౌకా దళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీంగా తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐఎన్​ఎస్​ మోర్ముగావ్‌ రెండోది. ప్రాజెక్ట్-15బి పేరుతో.. మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ మొత్తం 35,800 కోట్ల రూపాయలతో ఈ యుద్ధనౌకను నిర్మించింది. ఐఎన్​ఎస్​ మోర్ముగావ్‌ 30 నాట్‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. న్యూక్లియర్, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడేలా ఈ యుద్ధ నౌకను తయారు చేశారు. నిర్దేశించుకున్నలక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించేందుకు ఆధునిక నిఘా రాడార్‌ను అమర్చారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యంతోపాటు.. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రాకెట్ లాంచర్‌లు, టార్పెడో లాంచర్లు, హెలికాప్టర్‌లు ఈ యుద్ధనౌకలో ఉన్నాయి.

Stealth guided missile destroyer Mormugao
ఐఎన్​ఎస్ మోర్ముగావ్‌ లోపలి భాగాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.