ETV Bharat / bharat

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!

author img

By

Published : Nov 14, 2022, 7:50 AM IST

Special activities of the Indian Army in Kashmir
కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు

సైన్యం అంటే ఉగ్రవాదులు నుంచి దేశానికి రక్షణ అందించడమే కాదు.. అన్నింటికి ముందుండి నడిపిస్తుందని మరోసారి రుజువుచేస్తోంది కశ్మీర్​లోని భారత సైన్యం. అక్కడ ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. కశ్మీర్​ యువత విద్యాభివృద్ధికి, ఉద్యోగాలు అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది.

సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. ప్రజల అభ్యున్నతికి తోడ్పడేలా సైన్యం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో సహీ రాస్తా (సరైన దారి), సూపర్‌-50 వంటి పథకాలు ప్రధానమైనవి.

మార్పు తెస్తున్నసహీ రాస్తా
కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చేసే కృషిలో భాగంగా.. సైన్యం 'సహీ రాస్తా' పథకం కింద అతివాద భావజాలం ఉన్న యువతను గుర్తిస్తోంది. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెప్పి వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. 25 మంది యువకులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి 21 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు, ఉగ్రవాద ముఠాలు చేస్తున్న ప్రచారాన్ని వివరంగా చెప్పడంతో పాటు వారంతా సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మతగ్రంథాల్లోని మంచి విషయాలను ఉగ్రవాదులు ఎలా వక్రీకరిస్తున్నారో మతపెద్దలతోనే చెప్పిస్తున్నారు. ఈ శిబిరాలకు హాజరైన 87 శాతం మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సహీ రాస్తా పథకానికి నేతృత్వం వహిస్తున్న కమాండర్‌ అలోక్‌దాస్‌ 'ఈటీవీ భారత్​'కు తెలిపారు.

.

విద్యాభివృద్ధికి సూపర్‌-50
కశ్మీరులో విద్యావకాశాలు చాలా స్వల్పంగా ఉండడంతో జేఈఈ, నీట్‌ వంటి పరీక్షల్లో విద్యార్థులు పోటీపడలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు సైన్యం సూపర్‌-50 పథకాన్ని అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించి.. మొదటి 50 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను శ్రీనగర్‌లోని ప్రత్యేక కళాశాలకు తరలిస్తోంది. అక్కడ వారికి పూర్తి ఉచితంగా ఇంటర్మీడియెట్‌ విద్యతోపాటు నీట్‌, జేఈఈ పరీక్షలకు శిక్షణ అందిస్తోంది. 2018 నుంచి దీన్ని అమలు చేస్తున్నామని, ఇందులో పాల్గొన్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారని మేజర్‌ జనరల్‌ సలారియా వెల్లడించారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులను పాఠశాలలకు తరలించేందుకు సైన్యం ఉచితంగా బస్సులు నడుపుతోంది. గ్రామాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది.

పరిశ్రమల ఏర్పాటు నామమాత్రం
కశ్మీరులో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఏటా రూ.80 వేల కోట్లకు పైగా కేటాయిస్తోంది. 370వ అధికరణ రద్దు తర్వాత కశ్మీరులో ఎవరైనా పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఏర్పడినా, ఆ దిశగా పెద్దగా పురోగతి కనిపించడంలేదు. 370 రద్దు తర్వాత రాష్ట్రంలోకి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.28,400 కోట్లు కేటాయించింది. 2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకు పరిశ్రమల స్థాపన కోసం వచ్చిన 3,300 దరఖాస్తులను ఆమోదించామని, 111 పారిశ్రామిక ఎస్టేట్‌ల కోసం 1233 ఎకరాలు కేటాయించామని ప్రభుత్వం వెల్లడించింది. వాస్తవంలో మౌలిక వసతుల కల్పన తప్ప పారిశ్రామికీకరణలో పురోగతి లేదు. ఉపాధి అవకాశాలు మెరుగవలేదు.

శ్రీనగర్‌లో ఓ మాల్‌ నిర్వాహకుడిని 'ఈటీవీ భారత్​' పలకరించగా.. 'రూ.కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత అనుకోని ఘటన జరిగితే పరిశ్రమ మూసేయాల్సి వస్తుందేమోనన్న భయం ఇంకా తొలగిపోలేదు' అని ఆయన వెల్లడించారు. అభివృద్ధి కళ్లకు కనిపిస్తేనే ప్రజల్లో మార్పు వస్తుందని సోపూర్‌కు చెందిన వ్యాపారి ఇష్వాక్‌ తెలిపారు. గతంతో పోల్చుకుంటే రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యం వంటివి పెరిగినా, ఇవి మాత్రమే సరిపోవన్నారు. దారి తప్పుతున్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఫలితం ఉంటుందన్నారు.

మౌలిక వసతుల్లో పురోగతి

  • 2022 మార్చి వరకు 28 వంతెనలు సహా 3500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం పూర్తి.
  • 2021 నవంబరు వరకు 5007కి.మీ. రహదారుల అభివృద్ధి, రూ.260 కోట్లతో 150 వంతెనల నిర్మాణం.
  • విద్యుత్తు రంగంలో రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టి ఇప్పుడున్న మూడువేల మెగావాట్ల విద్యుత్తుకు అదనంగా 4870 మె.వా. ఉత్పత్తి చేయాలని ప్రణాళిక.
  • గ్రామీణ పాఠశాలలకు జాతీయ జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా వంద శాతం రక్షిత నీటి సరఫరా. 23,160 పాఠశాలలు, 24,163 అంగన్‌వాడీలు, 3324 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 1612 గ్రామ పంచాయతీలకు శుద్ధి చేసిన తాగునీటి పంపిణీ.
  • వైద్య విద్య, వైద్య సదుపాయం కల్పించే మెడిసిటీల స్థాపనకు రూ.4,400 కోట్ల కేటాయింపు.

ఇవీ చదవండి:

బుర్ఖాలో వెళ్లి ప్రేయసి భర్తను హత్య చేసిన వ్యక్తి.. రైలు నుంచి పడి ఇద్దరు మృతి

డిటోనేటర్లతో రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు.. పట్టాలకు పగుళ్లు.. తప్పిన పెను ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.